9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు.. స్త్రీ శక్తి సూపర్ హిట్
అమరావతి
ఆర్టీసీని కేవలం ప్రజా రవాణా వ్యవస్థగా కాకుండా మహిళలు, దివ్యాంగులు, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే సంక్షేమ వేదికగా కూటమి ప్రభుత్వం తీర్చిదిద్దుతోంది. ముఖ్యమంత్రి N. Chandrababu Naidu నేతృత్వంలో అమలవుతున్న “స్త్రీ శక్తి” పథకం రాష్ట్రవ్యాప్తంగా మహిళల జీవితాల్లో పెద్ద మార్పుకు దారితీస్తోంది. ఉచిత బస్సు ప్రయాణంతో మహిళలకు ఆర్థిక వెసులుబాటు కలగడంతో పాటు ఆర్టీసీకి కూడా భారీ స్థాయిలో ప్రయాణికుల ఆదరణ పెరిగింది.
9 నెలల్లో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు
2025 ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం కేవలం తొమ్మిది నెలల్లోనే రికార్డు స్థాయిలో స్పందన అందుకుంది. రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 67 కోట్ల ఉచిత ప్రయాణాలు చేయగా, ప్రభుత్వం ఇందుకోసం సుమారు రూ. 2350 కోట్ల సబ్సిడీ భరించింది. ఇందులో భాగంగా ఆర్టీసీకి ఇప్పటికే రూ. 720 కోట్ల మేర రీయింబర్స్మెంట్ అందించింది.
ఈ పథకం వల్ల ప్రతి కుటుంబానికి నెలకు సగటున రూ. 2 వేల నుంచి రూ. 2,500 వరకు ఆదా అవుతోందని లబ్దిదారులు చెబుతున్నారు. ఉద్యోగినులు, విద్యార్థినులు, మహిళా రైతులు, చిన్న వ్యాపారులు తమ ప్రయాణ ఖర్చులు తగ్గడంతో ఆర్థికంగా ఊరట పొందుతున్నారు.
ఆర్టీసీకి పెరిగిన ఆక్యుపెన్సీ
స్త్రీ శక్తి పథకం ప్రభావంతో ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో భారీగా పెరిగింది. గతంలో సుమారు 60 శాతంగా ఉన్న ఆక్యుపెన్సీ ప్రస్తుతం 92 శాతానికి చేరినట్లు అధికారులు చెబుతున్నారు. మహిళలతో పాటు పురుష ప్రయాణికుల సంఖ్య కూడా పెరగడం ఆర్టీసీ ఆదాయ వృద్ధికి తోడ్పడుతోంది.
ప్రభుత్వం నుంచి సబ్సిడీ అందుతుండగా, పెరిగిన ప్రయాణికుల రద్దీ ద్వారా ఆర్టీసీకి అదనపు ఆదాయం లభిస్తోంది. ఈ విధంగా స్త్రీ శక్తి పథకం సంక్షేమంతో పాటు ప్రజా రవాణా వ్యవస్థకు కూడా బలాన్నిస్తోంది.
తగ్గుతున్న ప్రమాదాలు.. కాపాడుతున్న ప్రాణాలు
స్త్రీ శక్తి పథకం వల్ల రోడ్డు ప్రమాదాలు, మరణాలు కూడా తగ్గినట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఆటోలు, ఇతర ప్రైవేట్ వాహనాల బదులు మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించడం పెరగడంతో భద్రత మెరుగుపడిందని అధికారులు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం మహిళల ప్రమాద మరణాలు దాదాపు 39 శాతం తగ్గినట్లు గుర్తించారు. పురుషుల మరణాల సంఖ్య కూడా గణనీయంగా తగ్గినట్లు నివేదికలో వెల్లడైంది. ఈ అంశంపై రాష్ట్ర స్థాయి అధ్యయనం నిర్వహించాలని సీఎం అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
ఉద్యోగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి
కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమంపై కూడా కీలక నిర్ణయాలు తీసుకుంది. రాత్రి వేళల్లో విధులు నిర్వహించే డ్రైవర్లు, కండక్టర్లకు ప్రతి నైట్ డ్యూటీకి రూ.150 చొప్పున నైట్ అవుట్ అలవెన్స్ మంజూరు చేసింది. దీని వల్ల ఉద్యోగులకు నెలకు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు ఆదాయం లభిస్తోంది.
ఏళ్లుగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లను కూడా ప్రభుత్వం వేగవంతం చేసింది. 2020కు ముందు నియమితులైన సుమారు 7 వేల మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పించడంతో ఉద్యోగుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
SBI బీమా, రిటైర్డ్ ఉద్యోగులకు EHS
ఆర్టీసీ ఉద్యోగులకు SBI ప్రత్యేక బీమా పథకాన్ని వర్తింపజేయడం ద్వారా ప్రభుత్వం భద్రతా కవచం కల్పించింది. రూ.1 కోటి ప్రమాద బీమా, సహజ మరణానికి రూ.10 లక్షల బీమా వంటి ప్రయోజనాలు ఉద్యోగ కుటుంబాలకు ఆర్థిక భరోసా ఇస్తున్నాయి.
రిటైర్డ్ ఉద్యోగులకు జీవితాంతం EHS వైద్య సేవలు అందేలా తీసుకున్న నిర్ణయం కూడా మానవీయ చర్యగా ప్రశంసలు అందుకుంటోంది.
కొత్త బస్సులు.. ఈవీలతో ఆధునికీకరణ
ప్రజా రవాణాను ఆధునికీకరించే దిశగా ప్రభుత్వం 1,489 కొత్త బస్సులను ప్రవేశపెట్టింది. సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్, స్టార్ లైనర్, వెన్నెల బస్సులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తున్నాయి. అదనంగా కేంద్ర సహకారంతో సుమారు 1450 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
338 బస్ స్టేషన్ల అభివృద్ధికి రూ.30 కోట్లు కేటాయించగా, డిజిటల్ ఫీడ్బ్యాక్ వ్యవస్థ ద్వారా ప్రయాణికుల అభిప్రాయాలను నేరుగా సేకరిస్తున్నారు. ప్రతి వారం ఆర్టీసీ సేవలపై సీఎం సమీక్ష నిర్వహిస్తూ సేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.