ఏపీకి బ్రాండ్ అంబాసిడర్లుగా మారండి.. సింగపూర్‌లో ఎన్నారైలకు మంత్రి లోకేష్ పిలుపు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రాష్ట్ర ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సింగపూర్‌లోని తెలుగు ప్రవాసులకు కీలక పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగస్వాములు కావడంతో పాటు రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరించాలని కోరారు. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా సోమ‌వారం నాడు సింగపూర్ పర్యటనకు వెళ్లిన లోకేష్‌కు అక్కడి ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు.

సింగపూర్‌లో ప్రవాసాంధ్రులతో సమావేశం

సింగపూర్ చేరుకున్న మంత్రి లోకేష్‌ను తెలుగుదేశం ఫోరం సింగపూర్ సభ్యులు విమానాశ్రయంలో ఆత్మీయంగా స్వాగతించారు. అనంతరం ప్రవాసాంధ్రులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, పరిశ్రమలకు కల్పిస్తున్న ప్రోత్సాహకాలు, పెట్టుబడులకు అనుకూల వాతావరణంపై లోకేష్ వివరించారు.

ఏపీలో పెట్టుబడులకు మంచి అవకాశాలు

రాయల్ ఎన్‌ఫీల్డ్ వంటి ప్రముఖ సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయడంపై ఎన్నారైలు సంతోషం వ్యక్తం చేశారు. తాము పనిచేస్తున్న సంస్థల్లో ఏపీకి ఉన్న అవకాశాలను వివరించి పెట్టుబడులు తీసుకురావడంలో సహకరించాలని మంత్రి కోరారు.

ప్రపంచ స్థాయి కంపెనీలతో చర్చలు జరిపి రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులు తీసుకురావడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

గ్లోబల్ కంపెనీల సీఈఓలతో భేటీలు

సింగపూర్ పర్యటనలో భాగంగా మంత్రి లోకేష్ పలువురు గ్లోబల్ కంపెనీల సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పరిశ్రమలు, ఐటీ, విద్యా రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై చర్చించినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో సింగపూర్ టీడీపీ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ పారేపల్లి సతీష్ కుమార్, మాదాల హనుమంతరావు, తాటి గంగాధర్ రావు, చేబ్రోలు సురేంద్ర, అశోక్ బాబు మాండ్రు, చల్లా రవి, ఇంటూరి మనోహర్, చవ్వా కిరణ్ తదితరులు పాల్గొన్నారు.