పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేశారు.. 'గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్' అంటూ సీఎం చంద్రబాబు ఫైర్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని కుట్రలు జరుగుతున్నాయని, ఫేక్ ప్రచారం, కుల రాజకీయాలే ప్రతిపక్షం అజెండాగా మారాయని సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు. జొన్నగిరి సభలో లడ్డూ వివాదం నుంచి డీఎస్సీ, రాయలసీమ ప్రాజెక్టుల వరకు పలు అంశాలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కర్నూలు, జూన్ 24: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. బుధవారం కర్నూలు జిల్లా జొన్నగిరిలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలు, ప్రభుత్వంపై జరుగుతున్న దుష్ప్రచారం, అభివృద్ధి కార్యక్రమాలపై విస్తృతంగా స్పందించారు.
పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం చేస్తున్నారని, విజయవాడ సాయికృష్ణ అదృశ్యం ఘటనకు కుల రంగు పులిమి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని సీఎం విమర్శించారు. అబద్ధాలు చెప్పడం, కులాల పేరుతో రాజకీయాలు చేయడం ప్రతిపక్షానికి అలవాటుగా మారిందని అన్నారు.
తిరుమల లడ్డూ వివాదాన్ని ప్రస్తావిస్తూ, గత ప్రభుత్వ హయాంలో కల్తీ నెయ్యి వినియోగంతో జరిగిన ఘటనలు వెలుగులోకి వచ్చాయని చెప్పారు. ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టేందుకు దేవాలయాల చుట్టూ తిరుగుతున్నారని, అలాంటి రాజకీయాలను ప్రజలు నమ్మబోరని వ్యాఖ్యానించారు.
డీఎస్సీ నియామకాలపై కూడా ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని సీఎం మండిపడ్డారు. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, కానీ తమ ప్రభుత్వం పారదర్శకంగా డీఎస్సీ నిర్వహిస్తుంటే దుష్ప్రచారం చేస్తోందని అన్నారు. సీపీఎస్ విషయంలో గత ప్రభుత్వం హామీలు ఇచ్చి అమలు చేయలేదని, తమ ప్రభుత్వం 10,800 మంది ఉద్యోగులను పాత పెన్షన్ విధానంలోకి తీసుకొచ్చిందని తెలిపారు.
ప్రతిపక్షం గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లకు అండగా నిలుస్తోందని, యువతను తప్పుదోవ పట్టించి రాజకీయ అవసరాలకు ఉపయోగించుకుంటోందని సీఎం ఆరోపించారు. "గొడ్డలి పార్టీకి విధ్వంసమే విజన్.. ఫేక్ ప్రచారమే విధానం.. రప్పా రప్పా రాజకీయాలే మేనిఫెస్టో" అని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
రాయలసీమ అభివృద్ధిపై కూడా మాట్లాడిన చంద్రబాబు, ప్రాజెక్టుల గేట్లు కూడా మరమ్మతు చేయించలేని వారు ఇప్పుడు ఇరిగేషన్ లిఫ్ట్‌ల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం ప్రాధాన్యతల వారీగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తోందని, తుంగభద్రకు కర్ణాటకతో కలిసి కొత్త గేట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.
రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి తీసుకురావడమే తమ లక్ష్యమని, ప్రతిపక్షం మాత్రం కులం, మతం, ప్రాంతాల పేరుతో ప్రజలను విడదీయాలని చూస్తోందని సీఎం ఆరోపించారు. ప్రభుత్వంపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొడుతూ ప్రజల ముందుకు ప్రోగ్రెస్ రిపోర్టులు తీసుకువస్తామని స్పష్టం చేశారు.