పల్నాడులో చోరీల ముఠా అరెస్ట్.. రూ.6 లక్షల బంగారం స్వాధీనం
పల్నాడు జిల్లా, మే 19:
పల్నాడు జిల్లాలో వివిధ ప్రాంతాల్లో తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితులను దాచేపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.6 లక్షల విలువైన 104 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల నగదు, నేరాలకు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
దాచేపల్లి పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో గురజాల సబ్ డివిజన్ డీఎస్పీ ఎం. మహేశ్వరరావు కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ప్రధాన నిందితులు షేక్ పండు అలియాస్ బాబావలి, వేముల యేసురాజు గతంలోనే దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నారని తెలిపారు. పిడుగురాళ్ల జైలులో ఉన్న సమయంలో వీరికి లఘువరపు వెంకటేశ్వర్లు, అనాల శివతో పరిచయం ఏర్పడింది.
దొంగతనాల ద్వారా సంపాదించిన బంగారం, వెండి వస్తువులను వెంకటేశ్వర్లు, శివలకు అప్పగించి, అందులో 30 శాతం నగదు పండు, యేసురాజుకు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా నరసరావుపేట, వినుకొండ, విఠంరాజుపల్లె, ఫిరంగిపురం, గాదెవారిపల్లె, ముత్యాలంపాడు, నారాయణపురం ప్రాంతాల్లో పలు చోరీలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది.
పల్నాడు జిల్లా ఎస్పీ బి. కృష్ణారావు ఆదేశాల మేరకు గురజాల డీఎస్పీ మహేశ్వరరావు పర్యవేక్షణలో దాచేపల్లి సీఐ రాజేష్, ఎస్సై పాపారావు మరియు సిబ్బంది ప్రత్యేక దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు.