అర్ధరాత్రి 2 గంటలకు స్పందించిన కలెక్టర్.. బాల్య వివాహం అడ్డుకుని బాలికకు రక్షణ!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ప‌ల్నాడు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామచంద్రాపురం తండాలో జరుగుతున్న బాల్య వివాహాన్ని ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా సకాలంలో స్పందించి అడ్డుకోవడంతో ఒక మైనర్ బాలికకు రక్షణ లభించింది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో అందిన సమాచారంపై వెంటనే స్పందించిన కలెక్టర్ సంబంధిత అధికారులను అప్రమత్తం చేసి సంఘటనా స్థలానికి పంపించారు.

కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్, రెవెన్యూ సిబ్బంది, పోలీసు అధికారులు, ఐసీడీఎస్ మరియు చైల్డ్‌లైన్ ప్రతినిధులు తక్షణమే రామచంద్రాపురం తండాకు చేరుకున్నారు. అక్కడ వివాహానికి సిద్ధమవుతున్న బాలిక వయస్సుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను పరిశీలించగా, ఆమెకు చట్టబద్ధమైన వివాహ వయస్సు నిండలేదని అధికారులు నిర్ధారించారు.

దీంతో అధికారులు వెంటనే వివాహాన్ని నిలిపివేసి బాలికను సంరక్షణలోకి తీసుకున్నారు. ఈ ఘటనపై ఇంచార్జ్ కలెక్టర్ సంజనా సింహా మాట్లాడుతూ పిల్లల భవిష్యత్తును నాశనం చేసే బాల్య వివాహాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించవద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.

బాల్య వివాహ నిరోధక చట్టం ప్రకారం బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21 ఏళ్లు నిండిన తరువాత మాత్రమే వివాహం జరగాలని ఆమె స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘించి బాల్య వివాహాలు నిర్వహించే తల్లిదండ్రులు, సహకరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ ఘటనతో జిల్లా అధికారుల అప్రమత్తతపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు.