జాతరలో దళితులకు అవమానం..? పూజలకు దూరంగా ఉండాలంటూ అగ్రవర్ణాల హుకుం!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నంద్యాల జిల్లా మిట్టపల్లి గ్రామంలో గ్రామదేవత జాతర సందర్భంగా మాల, మాదిగలకు వివక్ష ఎదురైందని ఆరోపణలు..

సంప్రదాయ విధులు చేయాల్సిందే కానీ పూజల్లో పాల్గొనొద్దంటూ ఆంక్షలు విధించారంటూ దళిత సంఘాల ఆవేదన

సమాజంలో కులాధిపత్యం ఇప్పటికీ తీవ్రమైన సమస్యగానే కొనసాగుతోంది. కుల అహంకారం ప్రజాస్వామ్య వ్యవస్థను, మానవ సంబంధాలను, సమానత్వ భావనను దెబ్బతీస్తోందని సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందరికీ సమాన హక్కులు కల్పించేందుకు చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ, కొన్ని గ్రామాల్లో ఇంకా అంటరానితనం కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చి 78 సంవత్సరాలు పూర్తవుతున్నా, గ్రామీణ ప్రాంతాల్లో కుల వివక్ష పూర్తిగా నిర్మూలం కాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో గ్రామదేవత జాతరల్లో మాల, మాదిగల పాత్ర ఎంతో కీలకమైనది. ముఖ్యంగా పెద్దమ్మతల్లి, మైసమ్మ, కర్రెమ్మ వంటి గ్రామదేవతల జాతరల్లో దళిత వర్గాలు నిర్వహించే సాంప్రదాయ విధులు జాతరలో ప్రధాన భాగంగా ఉంటాయి.

జాతరల్లో మాల, మాదిగల సంప్రదాయ బాధ్యతలు

గ్రామదేవత జాతరల్లో మాదిగలు డప్పు వాయిద్యకారులుగా కీలక పాత్ర పోషిస్తారు. జాతర ప్రారంభం నుంచి ముగింపు వరకు డప్పుల మోతతో గ్రామానికి ఆధ్యాత్మిక వాతావరణాన్ని తీసుకువస్తారు. అమ్మవారికి డప్పు వాయిద్యం ఎంతో ప్రీతికరమని గ్రామస్తుల నమ్మకం.

జాతర తేదీలు, పూజా కార్యక్రమాల వివరాలను గ్రామ ప్రజలకు తెలియజేసే చాటింపు కార్యక్రమాన్ని కూడా సంప్రదాయంగా మాదిగ పెద్దలే నిర్వహిస్తారు. అలాగే జాతరలో అత్యంత ముఖ్యమైన “పోతురాజు” పాత్రలను దళిత యువకులే పోషిస్తారు. అమ్మవారి రక్షకుడిగా భావించే పోతురాజు పాత్రలో యువకులు పూనకంతో ఊగిపోతూ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు.

జంతు బలి ఆచారాల్లోనూ మాదిగల పాత్ర కీలకమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. బలి అనంతరం ఊరి పొలిమేరల్లో రక్షణార్థం “పోలి చల్లడం”, గ్రామ సరిహద్దుల్లో కాపలా విధులు నిర్వహించడం వంటి సంప్రదాయ కార్యక్రమాలను మాలలు నిర్వహిస్తారు. అమ్మవారికి సమర్పించే బోనాలు, నైవేద్యాల తయారీలోనూ వీరి భాగస్వామ్యం అనివార్యంగా ఉంటుంది.

మిట్టపల్లి గ్రామంలో వివక్ష ఆరోపణలు

అయితే ఈ సంప్రదాయాలకు విరుద్ధంగా నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం మిట్టపల్లి గ్రామంలో దళితులపై వివక్ష చోటుచేసుకుందని ఆరోపణలు వెలువడ్డాయి. గ్రామ దేవత జాతరలో మాల, మాదిగలు వెట్టిచాకిరి పనులు చేయాల్సిందేనని, కానీ పూజా కార్యక్రమాల్లో పాల్గొనకూడదని అగ్రవర్ణాలకు చెందిన కొందరు ఆంక్షలు విధించారంటూ గ్రామ దళితులు వాపోతున్నారు.

జాతరలో డప్పులు వాయించడం, జంతు బలి నిర్వహించడం వంటి పనులు మాత్రం చేయాలని, కానీ బలి అనంతరం చల్లే “పోలి”ని దళితవాడలో కాకుండా కేవలం అగ్రవర్ణాల కాలనీల్లో మాత్రమే చల్లాలని హుకుం జారీ చేశారని ఆరోపిస్తున్నారు.

ఈ నిర్ణయంతో గ్రామదేవత జాతరను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలనుకున్న మాల, మాదిగలు తీవ్ర నిరాశకు గురయ్యారని తెలుస్తోంది. ఈ విషయాన్ని బయటకు చెబితే రోజువారీ ఉపాధి కోల్పోతామనే భయం వారిలో ఉందని దళిత సంఘాలు చెబుతున్నాయి. పశువులను పొలాల్లో మేపనివ్వరని, గ్రామ బహిష్కరణకు గురిచేస్తారనే ఆందోళనతో బాధితులు మౌనం పాటిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

అధికారులపై దళిత సంఘాల ఆగ్రహం

అంటరానితన నిర్మూలన కోసం ప్రభుత్వం పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ప్రతి నెల “సివిల్ రైట్స్ డే” నిర్వహిస్తూ గ్రామస్థాయిలో కుల వివక్ష నిర్మూలనపై అవగాహన కల్పిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇలాంటి కార్యక్రమాలు నిజంగా గ్రామాల్లో అమలవుతున్నాయా అనే ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలంలోని గ్రామాల్లో కుల వివక్ష కొనసాగుతుండటంపై దళిత సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. “సివిల్ రైట్స్ డే కార్యక్రమాలు సక్రమంగా జరిగి ఉంటే ఇంకా గ్రామాల్లో అంటరానితనం ఎందుకు కొనసాగుతోంది?” అంటూ అధికారులను ప్రశ్నిస్తున్నాయి.

రేపు జరగబోయే గ్రామదేవత జాతరలో మాల, మాదిగలకు కూడా సమాన హక్కులతో పూజల్లో పాల్గొనే అవకాశం కల్పించాలని దళిత సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని కోరుతున్నారు.