రాజ్య‌స‌భ రేసు నుంచి లింగ‌మ‌నేని ఔట్‌...!?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నాలుగు రాజ్య‌స‌భ స్థానాల‌పై కూట‌మిలో హాట్ చ‌ర్చ

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అభ్య‌ర్థులు ఎవ‌ర‌నే దానిపై రాజ‌కీయ పార్టీల్లో జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి. జూన్‌లో జ‌ర‌గ‌నున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో రాష్ట్రం నుంచి నాలుగు స్థానాలు భ‌ర్తీ అవుతాయి. అయితే..ఈ నాలుగు స్థానాలు అధికార కూట‌మికే ల‌భిస్తాయి. ప్ర‌తిప‌క్ష వైకాపాకు క‌నీసం ఒక అభ్య‌ర్థిని కూడా గెలుచుకునే బ‌లం లేక‌పోవ‌డంతో..ఈ నాలుగు స్థానాలు కూట‌మికే ద‌క్క‌నున్నాయి.

టిడిపి మూడు.. బీజేపీ, జ‌న‌సేన చెరో సీటు కోరుతున్నాయా..?

అయితే..దీనిలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు ల‌భిస్తాయ‌నే దానిపై ఆయా పార్టీల్లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. కూట‌మిలో పెద్ద‌పార్టీ అయిన తెలుగుదేశం పార్టీ ఈసారి మూడు స్థానాలు త‌మ‌కే కావాల‌ని కోరుతోంది. అయితే..జ‌న‌సేన‌, బిజెపి కూడా త‌మ‌కు చెరో స్థానం కేటాయించాల‌ని డిమాండ్ చేస్తున్నాయి. జ‌న‌సేన‌కు రాజ్య‌స‌భ‌లో ప్రాతినిధ్యం లేక‌పోవ‌డంతో..ఈసారి త‌మ‌కు త‌ప్ప‌కుండా స్థానం క‌ల్పించాల‌ని, గ‌తంలోనే త‌మ‌కు హామీ ఇచ్చార‌ని ఆ పార్టీ గుర్తు చేస్తోంది.

అదే స‌మ‌యంలో బిజెపి కూడా త‌మ‌కు ఓ స్థానం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెండు స్థానాల‌కు బిజెపికి కేటాయించింది. ఆ పార్టీకి శాస‌న‌స‌భ‌లో 8 మంది స‌భ్యుల బ‌లం ఉన్నా..వారికి రెండు స్థానాలు ల‌భించాయంటే..ప్ర‌ధాని Narendra Modi, కేంద్ర హోంమంత్రి Amit Shah ఆదేశాల‌తోనే జ‌రిగింది.

లింగ‌మ‌నేని పేరే ఫైన‌ల్ అన్న ప్ర‌చారం.. ఇప్పుడు సీన్ మారిందా..?

అయితే..ఇప్ప‌టికే ఆ పార్టీకి రెండు స్థానాలు ఇచ్చినందున ఈ సారి వారికి ఒక్క సీటు కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని టిడిపి క్యాడ‌ర్ అంటోంది. అయితే..కేంద్ర పెద్ద‌లు ఒత్తిడి చేస్తే..N. Chandrababu Naidu వారికి సీటు ఇవ్వ‌కుండా ఉండ‌లేని ప‌రిస్థితి నెల‌కొంది. అంటే..ఈసారి బిజెపి ఒక‌టి, జ‌న‌సేన ఒక‌టి..టిడిపికి రెండు స్థానాలు ల‌భిస్తాయ‌నే ప్ర‌చారం ఉంది.

అయితే...ఈ స్థానాల‌కు ఎవరిని అభ్య‌ర్థులుగా నిర్ణ‌యిస్తారో..ఇంకా తెలియ‌క‌పోయిన‌ప్ప‌టికి జ‌న‌సేన విష‌యంలో మాత్రం ఒక క్లారిటీ ఉంది. జ‌న‌సేన‌కు రాజ్య‌స‌భ స్థానం ల‌భిస్తే..ఆ సీటును జ‌న‌సేన అధ్య‌క్షుడు Pawan Kalyanకు అత్యంత స‌న్నిహితుడైన లింగ‌మ‌నేని ర‌మేష్‌కు ద‌క్కుతుంద‌నే ప్ర‌చారం చాలా రోజులుగా ఉంది.

అయితే..ఇప్పుడు లింగ‌మ‌నేనికి ఈ సీటు ద‌క్క‌ద‌ని, ఆయ‌న‌కు అవ‌కాశాలు త‌గ్గిపోతున్నాయ‌నే భావ‌న రాజ‌కీయ వ‌ర్గాల్లో ఉంది. ప‌వ‌న్ క‌ళ్యాన్‌కు అత్యంత ఆప్తుడైన లింగ‌మ‌నేనికి రాజ్య‌స‌భ సీటు ఇస్తున్నార‌ని, ఆయ‌న త‌ప్ప ఆ పార్టీ నుంచి మ‌రొక‌రికి అవ‌కాశం ఉండ‌ద‌నే ప్ర‌చారం రాజ‌కీయ‌వ‌ర్గాల‌తో పాటు, ఐఏఎస్ వ‌ర్గాల్లోనూ ఉంది. అయితే..ఇప్పుడు కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆయ‌న అవ‌కాశాలు కోల్పోతున్నార‌నే ప్ర‌చారం సాగుతోంది.

అధికార వ్య‌వ‌స్థ‌లో పెత్త‌నం ఆరోప‌ణ‌లు.. అదే మైన‌స్ అయిందా..?

ఇటీవ‌ల కాలంలో లింగ‌మ‌నేని వ్య‌వ‌హార‌శైలి వ‌ల్ల ఆయ‌న అవ‌కాశాలు భారీగా దెబ్బ‌తిన్నాయ‌నే ప్ర‌చారం ఉంది. ఆయ‌న Pawan Kalyan నిర్వ‌హిస్తోన్న శాఖ‌లో త‌ల దూరుస్తున్నార‌ని, వివిధ కాంట్రాక్ట్ సంస్థ‌ల‌కు ఆయ‌న మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని, ప‌వ‌న్ శాఖ నుంచి వ‌స్తోన్న నిధుల విష‌యంలో ఆయ‌న జోక్యం చేసుకుంటున్నార‌ని, ఇటీవ‌ల కాలంలో ఓ బ‌డా కంపెనీకి భారీగా నిధులు విడుద‌ల చేయించ‌డంలో ఈయ‌న హ‌స్తం ఉంద‌ని ప్ర‌చారం సాగుతోంది.

పేరుకు ప‌వ‌న్ మంత్రిగా ఉన్నార‌ని, పెత్త‌నం అంతా ఈయ‌నేదేన‌నే విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు ఉన్నాయి. అంతే కాకుండా ఇత‌ర అధికార వ్య‌వ‌హారాల్లో ఆయ‌న త‌ల‌దూరుస్తున్నార‌ని, మొత్తం ఆయ‌నే చేస్తున్న‌ప్పుడు ఇప్పుడు మ‌ళ్లీ రాజ్య‌స‌భ కూడా ఆయ‌న‌కే ఇస్తారా..? ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గం వారికి చోటు ఇవ్వ‌కుండా చంద్ర‌బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారికి రాజ్య‌స‌భ ఎలా ఇస్తార‌నే ప్ర‌శ్న జ‌న‌సేన నుంచి వినిపిస్తోంది.

ప‌వ‌న్‌పై ఒత్తిడి పెరుగుతోందా..?

అయితే..జ‌న‌సేన‌లో ఎలాంటి అభిప్రాయాలు ఉన్నా..Pawan Kalyan మాత్రం ఆయ‌న‌కే రాజ్య‌స‌భ ఇస్తార‌నే భావ‌న వివిధ వ‌ర్గాల్లో ఉంది. అయితే..ఇటీవ‌ల కాలంలో..త‌మిళ‌నాడులో జ‌రిగిన ప‌రిణామాలు ప‌వ‌న్‌కు చికాకులు సృష్టిస్తున్నాయి. త‌మిళ‌నాడులో సినీన‌టుడు Vijay ఒంట‌రిగా పోటీ చేసి..ముఖ్య‌మంత్రి అయ్యార‌ని, ఇక్క‌డ ప‌వ‌న్ మాత్రం చంద్ర‌బాబుకు కొమ్ము కాస్తున్నార‌ని ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ప‌వ‌న్ స్పందించాల్సి వ‌చ్చింది.

అయితే..ఆయ‌న ఎంత స‌మ‌ర్థించుకున్నా..ప్ర‌స్తుతం ప‌వ‌న్ సామాజిక‌వ‌ర్గంలో మాత్రం దీనిపై భారీ ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు లింగ‌మ‌నేనిని జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు పంపితే..ప‌వ‌న్‌పై తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

చివ‌రికి ప‌వ‌న్ నిర్ణ‌యం ఏంటి..?

ఇటువంటి ప‌రిస్థితుల్లో లింగ‌మ‌నేని అవ‌కాశాలు సంక్లిష్టం అయిపోతున్నాయ‌నే భావ‌న రాజ‌కీయ ప‌రిశీల‌కుల్లో వ్య‌క్తం అవుతోంది. Pawan Kalyan త‌న‌పై ఉన్న ఒత్తిడి త‌ట్టుకుని త‌న‌కు ఆప్తుడైన లింగ‌మ‌నేనికి రాజ్య‌స‌భ ఇస్తారా... లేక ఒత్తిడికి త‌లొగ్గి వేరే వారికి అవ‌కాశాలు ఇస్తారా..? అనేది చూడాల్సి ఉంది.