ఇంటింటికీ వెళ్లి వైద్యం.. గ్రామీణ ప్రజల గుండెల్లో దేవుడైన డాక్టర్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా వెదుళ్ళపల్లిలో అభినందన సభ..

నిరుపేదలకు దశాబ్దాలుగా సేవలందిస్తున్న వైద్యుడిని సత్కరించిన జనవిజ్ఞాన వేదిక, గ్రామాల సమాఖ్య

కార్పొరేట్ వైద్యం సామాన్యుడికి అందని ద్రాక్షగా మారి, చికిత్స ఖర్చులు మధ్యతరగతి కుటుంబాలపై భారంగా మారుతున్న నేటి పరిస్థితుల్లో.. మానవత్వాన్ని వైద్య సేవల పరమావధిగా చేసుకుని నిరుపేదల పాలిట ఆశాకిరణంగా నిలుస్తున్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ జి. ఆంజనేయ చార్యులు. దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత ప్రజలకు నిస్వార్థ వైద్య సేవలు అందిస్తూ వేలాది కుటుంబాలకు అండగా నిలిచిన ఆయనకు ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం సందర్భంగా ఘన సన్మానం జరిగింది.

జనవిజ్ఞాన వేదిక మరియు వెదుళ్ళపల్లి పరిసర గ్రామాల సమాఖ్య సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ అభినందన సభ స్థానిక ప్రజల సమక్షంలో ఎంతో వైభవంగా జరిగింది. కార్యక్రమానికి జనవిజ్ఞాన వేదిక సాంస్కృతిక విభాగం రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర రెడ్డి, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ మరియు ఘంటసాల చైతన్య వేదిక కన్వీనర్ గురజాల శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా డాక్టర్ జి. ఆంజనేయ చార్యుల సేవలను కొనియాడుతూ ఆయనకు శాలువాలు, పూలదండలతో ఘన సత్కారం నిర్వహించారు. స్థానిక ప్రజల తరఫున హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేశారు.

“నిజమైన కుటుంబ వైద్యుడు”

జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోట వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ.. బాపట్ల మండలం వెదుళ్ళపల్లిలోని శ్రీ గోపరాజు రామచంద్రరావు & రుక్మిణమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రి ద్వారా డాక్టర్ ఆంజనేయ చార్యులు అందిస్తున్న సేవలు అమూల్యమని కొనియాడారు.

వెదుళ్ళపల్లి, బేతపూడి, కొత్తపాలెం, పడమర బాపట్ల, కావూరివారి పాలెం తదితర ప్రాంతాలకు చెందిన వందలాది నిరుపేద కుటుంబాలకు ఆయన గత అనేక దశాబ్దాలుగా ఒక నమ్మకమైన కుటుంబ వైద్యుడిగా మారిపోయారని పేర్కొన్నారు. కేవలం ఆసుపత్రికే పరిమితం కాకుండా, అత్యవసర పరిస్థితుల్లో 24 గంటలూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజా వైద్యుడిగా సేవలందిస్తున్నారని ప్రశంసించారు.

ఇంటింటికీ వెళ్లి వైద్య సేవలు

డాక్టర్ ఆంజనేయ చార్యుల సేవా నిరతిని వివరిస్తూ.. వయసుతో సంబంధం లేకుండా ప్రతిరోజూ ఉదయం వైద్య పరికరాలు, మందుల సంచితో రోగుల ఇళ్లకు స్వయంగా వెళ్లి సేవలందించడం ఆయన దినచర్యలో భాగమైందని తెలిపారు.

కేవలం పరీక్షలు చేయడమే కాకుండా, చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవసరమైన మందులను కూడా ఉచితంగా అందజేస్తూ పేదల ప్రాణాలను కాపాడుతున్నారని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే ప్రతి రోగిని ఎంతో ఓపికతో, ఆప్యాయంగా పరీక్షించి వైద్య సేవలు అందించడం వల్ల ఆయన ప్రజల గుండెల్లో దేవుడిలా నిలిచిపోయారని కొనియాడారు.

వైద్యంతో పాటు సామాజిక చైతన్యం

డాక్టర్ గారు కేవలం వైద్య సేవలకే పరిమితం కాలేదని, జనవిజ్ఞాన వేదికలో క్రియాశీల సభ్యుడిగా శాస్త్రీయ విజ్ఞాన ప్రచారానికి కృషి చేస్తున్నారని నిర్వాహకులు తెలిపారు. అలాగే వెదుళ్ళపల్లి పరిసర గ్రామాల సమాఖ్య, ఘంటసాల చైతన్య వేదిక నిర్వహించే సామాజిక చైతన్య కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటూ సమాజ శ్రేయస్సుకు సేవలందిస్తున్నారని అభినందించారు.

ప్రపంచ కుటుంబ వైద్యుల దినోత్సవం వంటి ప్రత్యేక సందర్భంగా డాక్టర్ ఆంజనేయ చార్యుల మహోన్నత సేవలకు ప్రజలందరి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని కోట వెంకటేశ్వర రెడ్డి, గురజాల శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పరిసర గ్రామాలకు చెందిన వందలాది మంది ప్రజలు పాల్గొని డాక్టర్ గారిపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.