రెండేళ్ల కూటమి పాలనపై కన్నబాబు ఫైర్.. జగన్ను ఆశ్రయిస్తున్న రైతులు, నిరుద్యోగులు!
కాకినాడ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధాలు, అవినీతి, అరాచకాలు, బంధుప్రీతితో పాలన సాగిస్తోందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, అమరావతి రైతుల నుంచి డీఎస్సీ అభ్యర్థుల వరకు అనేక వర్గాలు న్యాయం కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఆశ్రయిస్తున్నాయని పేర్కొన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న ప్రజల స్వరాన్ని అణిచివేసేందుకు అధికార పార్టీ జగన్పై విమర్శలు, ఆరోపణలు చేస్తోందని కన్నబాబు ఆరోపించారు. ముఖ్యంగా డీఎస్సీ నియామకాల అంశంలో అభ్యర్థులు వ్యక్తం చేస్తున్న అనుమానాలను ప్రభుత్వం సీరియస్గా తీసుకుని సమాధానాలు చెప్పాల్సిందిపోయి, ప్రతిపక్షంపై విమర్శలకు దిగుతోందని అన్నారు.
సూపర్ సిక్స్ హామీలపై స్పందించిన ఆయన, ఎన్నికల సమయంలో మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ.3,000 భృతి, ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. "అవి అమలు చేశామని దేవుడి మీద ప్రమాణం చేసి చెప్పగలరా?" అంటూ చంద్రబాబు ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
తల్లికి వందనం పథకాన్ని కూడా వైఎస్సార్సీపీ హయాంలో అమలైన అమ్మఒడి పథకానికి కాపీగా అభివర్ణించిన కన్నబాబు, గతంలో లబ్ధి పొందిన విద్యార్థుల కంటే ఇప్పుడు తక్కువ మందికి మాత్రమే సాయం అందుతోందని విమర్శించారు. బడ్జెట్ కేటాయింపులు, ఖర్చు వివరాలను ప్రస్తావిస్తూ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని ఆరోపించారు.
ఆక్వా రంగంపై కూడా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ సబ్సిడీలు తగ్గడం, రొయ్యల మేత ధరలు పెరగడం, మార్కెట్లో ధరలు పడిపోవడం వల్ల రైతులు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రంలో వరి, ఉల్లి, టమాట, మామిడి వంటి పంటలకు కనీస మద్దతు ధర లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
వైద్య రంగంపై స్పందిస్తూ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు, సర్జికల్ పరికరాలు, వెంటిలేటర్లు కూడా అందుబాటులో లేని పరిస్థితి నెలకొందని ఆరోపించారు. మరోవైపు బీచ్లలో మద్యం విక్రయాలకు అనుమతులు ఇవ్వడం ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నార్థకంగా మారుస్తోందన్నారు.
అమరావతి రైతుల సమస్యలను ప్రస్తావించిన కన్నబాబు, భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఉదహరిస్తూ, భూసేకరణ ప్రక్రియలో అనేక అవకతవకలు జరిగాయని అన్నారు. అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల అంచనా వ్యయాన్ని రూ.444 కోట్లు పెంచడం వెనుక అవినీతి కోణం ఉందని ఆరోపించారు.
రెండేళ్లలో ప్రభుత్వం రూ.2.83 లక్షల కోట్ల అప్పులు తెచ్చిందని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ అంశాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడుతుందని, జూన్ 8, 9 తేదీల్లో నియోజకవర్గ స్థాయి సభలు, జూన్ 12న భారీ నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
ప్రజలకు ఇచ్చిన హామీల అమలు, రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కురసాల కన్నబాబు స్పష్టం చేశారు.