జడ శ్రావణ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం.. ఉండిలో టీడీపీ ఆందోళన

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి: ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజుపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు, హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జడ శ్రావణ్ కుమార్ దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు మంగళవారం ఉండిలో దహనం చేశారు. ఉండి పెద్ద వంతెన సెంటర్‌లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమానికి టీడీపీ మండల అధ్యక్షుడు కరిమెరక నాగరాజు నాయకత్వం వహించారు.

ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులపై వ్యక్తిగతంగా, అభ్యంతరకరంగా వ్యాఖ్యలు చేయడం తగదని అన్నారు. మాజీ న్యాయమూర్తిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి హుందాగా వ్యవహరించాలని సూచించారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమైన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

నియోజకవర్గంలో రఘురామ కృష్ణంరాజు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించకుండా విమర్శలు చేయడం సరికాదని టీడీపీ నేతలు పేర్కొన్నారు. దళితులు, దళిత క్రైస్తవుల మధ్య విభేదాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని ఆరోపించారు.

నిరసన అనంతరం టీడీపీ నాయకులు ఉండి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి జడ శ్రావణ్ కుమార్‌పై ఫిర్యాదు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ కలిదిండి రామకృష్ణంరాజు, క్లస్టర్ కన్వీనర్ గురుగుబిల్లి వెంకట సత్యనారాయణతో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.