కాకినాడలో గ్రీన్ అమ్మోనియా తయారీ, ఎగుమతి కేంద్రం ఏర్పాటు చేయండి: నారా లోకేష్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

యారా ఇంటర్నేషనల్‌ ప్రతినిధితో మంత్రి భేటీ.. ఏపీలో పెట్టుబడులకు ఆహ్వానం

న్యూఢిల్లీ: కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా తయారీ, ఎగుమతి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రముఖ క్రాప్‌ న్యూట్రిషన్‌, ఫెర్టిలైజర్స్‌, అమ్మోనియా తయారీ సంస్థ యారా ఇంటర్నేషనల్‌ ASAను ఆహ్వానించారు. న్యూఢిల్లీలో యారా పబ్లిక్‌ అఫైర్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ హెడ్‌ వైశాలి చోప్రాతో మంత్రి సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు, వ్యవసాయ రంగంలో సాంకేతిక సహకారంపై చర్చించారు.

కాకినాడలో గ్రీన్‌ అమ్మోనియా మ్యానుఫ్యాక్చరింగ్‌, ఎగుమతి కాంప్లెక్స్‌ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని లోకేష్‌ కోరారు. ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక ఎరువుల మిశ్రమం, సూక్ష్మపోషకాల తయారీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను కూడా పరిశీలించాలని సూచించారు.

వ్యవసాయ సాంకేతికతపై దృష్టి

ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో పంట పోషణ సాంకేతికత, డిజిటల్‌ వ్యవసాయ కేంద్రం ఏర్పాటుకు యారా ముందుకు రావాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఆధునిక సాంకేతికతను అనుసంధానించడంలో ఇలాంటి భాగస్వామ్యాలు ఉపయోగపడతాయని తెలిపారు.

17 రాష్ట్రాల్లో 1,500 అవుట్‌లెట్లు

యారా ఇండియా (గురుగ్రామ్‌) పంట పోషణ, వ్యవసాయ శాస్త్రం, డిజిటల్‌ వ్యవసాయ రంగాల్లో సేవలు అందిస్తున్నట్లు వైశాలి చోప్రా తెలిపారు. సంస్థ 17 రాష్ట్రాల్లో 1,500 అవుట్‌లెట్ల ద్వారా 55 లక్షల మంది రైతులకు డిజిటల్‌గా చేరువైందని ఆమె వివరించారు.

ఉత్తరప్రదేశ్‌లోని బాబ్రాలా కాంప్లెక్స్‌ ద్వారా 16 లక్షల టన్నుల యూరియా, 6.6 లక్షల టన్నుల అమ్మోనియా ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. బయోలాజికల్‌ క్రాప్‌ సొల్యూషన్స్‌ కోసం కైరాన్‌ బయోప్రైమ్‌తో భాగస్వామ్యం కలిగి ఉన్నట్లు చెప్పారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన అంశాలపై సంస్థ ఉన్నతస్థాయి బృందంతో చర్చించి తదుపరి చర్యలను పరిశీలిస్తామని వైశాలి చోప్రా తెలిపారు.