ఉత్తరాంధ్రను ముంచెత్తుతున్న వానలు: నీటి భద్రతకు ఇదే సరికొత్త పాఠం!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

వాన పడితే వరద... ఆ వెంటనే చుక్క నీటికి అలమటించే ముప్పు... ఇది ఉత్తరాంధ్ర ప్రాంతం ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి! ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా ‘ఎల్‌నినో’ ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, భయంకరమైన ఎండలు, కరువు భయాలు వెంటాడుతున్నాయి. ఇటువంటి తరుణంలో ఉత్తరాంధ్ర జిల్లాలపై క్లౌడ్ బరస్ట్ తరహాలో కురుస్తున్న విస్తారమైన వర్షాలు మనకు ఒక గొప్ప అవకాశాన్ని, అంతకంటే పెద్ద హెచ్చరికను ఇస్తున్నాయి. ఆకాశం నుంచి పడుతున్న వర్షపు నీటిని సముద్రం పాలు కాకుండా 'వడిసి పట్టుకుంటే' భవిష్యత్ నీటి అవసరాలకు తిరుగుండదని వాతావరణ, నీటిపారుదల నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

నగరంలో నీటి తిప్పలు... డేటా సెంటర్ల ప్రచారంపై వాస్తవాలు!

ఇటీవలి కాలంలో విశాఖపట్నం నగరం తీవ్రమైన నీటి కొరతతో అల్లాడిపోతోంది. నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలో రోజువారీ అవసరాలకు నీళ్లు అందడం లేదనే ఫిర్యాదులు పదే పదే వెల్లువెత్తుతున్నాయి.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ద్వారా విశాఖకు తాగు, సాగు నీటిని సరఫరా చేయడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే కేవలం బాహ్య ప్రాజెక్టుల మీదే కాకుండా స్థానికంగా కురిసే వర్షపు నీటిని ఆదా చేసుకునే ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

రాబోయే కాలంలో విశాఖలో ఏర్పాటు చేయబోయే బారీ 'డేటా సెంటర్ల' వల్ల నగరానికి తీవ్రమైన నీటి కొరత ఏర్పడుతుందనే ప్రచారం కూడా కొన్ని వర్గాల్లో జరుగుతోంది. శాస్త్రీయంగా ఈ ప్రచారంలో వాస్తవం లేకపోయినప్పటికీ... వర్షపు నీటిని సక్రమంగా నిర్వహించకపోతే భవిష్యత్తులో నీటి లభ్యతపై ఒత్తిడి పెరిగే ప్రమాదముంది. అందుకే తక్షణమే వర్షపు నీటిని ఒడిసిపట్టే మార్గాలపై శ్రద్ధ చూపాల్సిన సమయం ఆసన్నమైంది.

ఆకాశమే హద్దుగా వానల హోరు

విశాఖపట్నం జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర వ్యాప్తంగా గడచిన కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో వర్షపాతం నమోదైంది. విశాఖ పరిధిలోని తులసీనగర్‌లో 236 మి.మీ, మధురవాడలో 218 మి.మీ, ఎండాడలో 210 మి.మీ, సీతమ్మధారలో 205 మి.మీ చొప్పున అత్యంత భారీ వర్షం కురిసింది.

ఒక్కరోజే 210 బిలియన్ లీటర్లు! కేవలం అంచనా కోసం లెక్కగట్టినా... విశాఖపట్నం జిల్లా విస్తీర్ణం (1,048 చదరపు కిలోమీటర్లు) వ్యాప్తంగా సగటున 200 మి.మీ వర్షం పడితే, ఆ నీటి పరిమాణం దాదాపు 7.4 టీఎంసీలు (సుమారు 210 బిలియన్ లీటర్లు)! ఇందులో కనీసం 30 శాతం నీటిని మనం నిల్వ చేయగలిగినా... అది 2.2 టీఎంసీలు (63 బిలియన్ లీటర్లు) అవుతుంది. ఇది విశాఖ నగరం యొక్క కొన్ని నెలల దాహార్తిని తీర్చడానికి సరిపోతుంది. కానీ, ప్రస్తుతం సమగ్రమైన డ్రైనేజీ, వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు లేకపోవడంతో ఆ అమూల్యమైన నీరంతా కాలువల ద్వారా సముద్రంలో కలిసిపోతోంది.

‘ఎల్‌నినో’ ముప్పు... ముందస్తు ప్రణాళికే రక్షణ!

ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరికల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో తీవ్రరూపం దాల్చింది. దీనివల్ల రాబోయే రోజుల్లో వర్షపాతంలో తీవ్రమైన వ్యత్యాసాలు ఉంటాయి. అంటే... కురిస్తే ఒకేసారి కుండపోత వానలు పడతాయి, లేదంటే నెలల తరబడి తీవ్ర కరువు తాండవిస్తుంది.

ఇలాంటి వాతావరణ మార్పుల కాలాన్ని తట్టుకోవాలంటే "వర్షం పడినప్పుడు పట్టుకోవడమే" ఏకైక మార్గం. ఆ వర్షం ఎప్పుడు, ఎంత వ్యవధిలో పడిందనే దానికంటే... పడిన నీటిలో ఎంత భాగాన్ని మనం భూమిలో ఇంకించాం లేదా మళ్లించి దాచుకున్నాం అనేదే ముఖ్యం.

పాఠం నేర్పే ‘సింగపూర్ మోడల్’

స్వంతంగా సహజ నీటి వనరులు లేని చిన్న దేశమైన సింగపూర్, వర్షపు నీటిని ఒడిసిపట్టడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచింది.

  • 2/3 వంతు భూభాగం కేచ్‌మెంట్‌గా: సింగపూర్ ప్రభుత్వం తమ దేశంలో మూడింట రెండు వంతుల భూభాగాన్ని వర్షపు నీటి సేకరణ ప్రాంతంగా (Catchment Area) మార్చింది.

  • 8,000 కిలోమీటర్ల డ్రైనేజీ నెట్‌వర్క్: నగర వీధులు, భవనాలపై పడే ప్రతి నీటి బొట్టునూ కాలువల ద్వారా సమీపంలోని 17 జలాశయాలకు (Reservoirs) తరలిస్తారు.

  • 'మెరీనా బ్యారేజ్' అద్భుతం: సముద్రంలోకి వెళ్లే నీటిని అడ్డుకట్ట వేసి మెరీనా రిజర్వాయర్‌గా మార్చారు. ఇది ఒకే సమయంలో వరద నివారణకు, తాగునీటి సరఫరాకు ఉపయోగపడుతోంది.

అంతేకాకుండా, నీరు ఎక్కడ పడితే అక్కడే ఇంకేలా లేదా దాచుకునేలా “సోర్స్-పాత్‌వే-రిసెప్టర్” అనే ఆధునిక stormwater యాజమాన్య పద్ధతిని సింగపూర్ అనుసరిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఏం చేయాలి?

సింగపూర్ తరహా భౌగోళిక పరిస్థితులు ఏపీలో లేకపోయినా, వారి సూత్రాన్ని (Principle) ఇక్కడి ఉత్తరాంధ్రలోనూ అమలు చేయవచ్చు.

  1. చెరువులు - కుంటల పునరుద్ధరణ: గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఆక్రమణలకు గురైన చెరువులను, సాంప్రదాయ నీటి వనరులను యుద్ద ప్రాతిపదికన పూడికతీసి బాగు చేయాలి.

  2. అపార్ట్‌మెంట్లు, ప్రభుత్వ భవనాల్లో హార్వెస్టింగ్: ప్రతి ప్రభుత్వ కార్యాలయం, విద్యాసంస్థ, ప్రైవేట్ అపార్ట్‌మెంట్‌లో 'రూఫ్‌టాప్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్' నిర్బంధం చేయాలి.

  3. వర్షపు నీటిని నిల్వ చేసే పాండ్స్ (Detention Ponds): పట్టణాల్లోని ఖాళీ స్థలాలను, లోతట్టు ప్రాంతాలను సైంటిఫిక్ పార్కులుగా లేదా డిటెన్షన్ పాండ్స్‌గా మార్చి, ప్రవాహ వేగాన్ని తగ్గించి నీటిని ఇంకించాలి.

  4. డ్రైనేజీ - రిజర్వాయర్ల అనుసంధానం: నగరాల్లోని ప్రధాన డ్రైనేజీ కాలువలను కలుషితం కాకుండా చూస్తూ, వాటిని సమీప జలాశయాలకు అనుసంధానించే వ్యవస్థను రూపొందించాలి.

  5. చెక్ డ్యామ్‌ల నిర్మాణం: కొండలు, వాలు ప్రాంతాల నుంచి వచ్చే ప్రవాహాలను ఆపడానికి విస్తృతంగా చెక్ డ్యామ్‌లను నిర్మించాలి.

సమయం మించిపోలేదు!

ఇప్పటివరకు నగర ప్రణాళికల్లో వాన నీటిని "త్వరగా బయటకు పంపే మురుగు నీరు"గా చూశాం. కానీ మారిన వాతావరణ పరిస్థితుల్లో వర్షపు నీటిని "భవిష్యత్ వనరు"గా చూడాల్సిన సమయం ఆసన్నమైంది.

ఉత్తరాంధ్ర జిల్లాలకు వెంటనే ఒక సమగ్ర 'రైన్ వాటర్ క్యాప్చర్ అండ్ వాటర్ సెక్యూరిటీ ప్లాన్' అత్యవసరం. పడిన వర్షపు నీటిని సురక్షితంగా భూమిలోకి ఇంకించడమో, జలాశయాలకు తరలించడమో చేస్తేనే రాబోయే ఎల్‌నినో లేదా కరువు ముప్పుల నుంచి ఆంధ్రప్రదేశ్ తన నీటి భద్రతను కాపాడుకోగలదు!