మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సాహానికి పలు కీలక నిర్ణయాలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

అమరావతి, మే 13ః రాష్ట్రంలో ఐదు లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలను తయారు చేసే లక్ష్యంతో వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించడంతో పాటు సమన్వయంతో ముందుకు సాగాలని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు.

బుధవారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో సెర్ప్ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సెర్ప్ వ్యవస్థలో చేపట్టాల్సిన సంస్కరణలు, మహిళల ఆర్థిక సాధికారత, గ్రామీణ జీవనోపాధి అభివృద్ధిపై పలు కీలక అంశాలపై చర్చించి అధికారులకు సూచనలు చేశారు.

సెర్ప్‌లో అన్ని స్థాయిల సిబ్బందికి KPIs (కీలక పనితీరు సూచికలు) ఖరారు చేయాలని నిర్ణయించారు. చేతివృత్తులు, కులవృత్తుల వారికి నైపుణ్యాభివృద్ధి కల్పించేందుకు ప్రత్యేక శిక్షణ యూనిట్లు ఏర్పాటు చేయాలని, తొలి విడతలో మూడు నుంచి నాలుగు జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని సూచించారు.

పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధిగా ఉన్న గ్రామాల్లో పశుగ్రాసం పెంపకం ప్లాట్లు అభివృద్ధి చేయాలని, ఐదుకంటే ఎక్కువ పాడి పశువులు ఉన్న స్వయం సహాయక సంఘాల మహిళలకు పాల సేకరణ, బాట్లింగ్, సొంత బ్రాండ్ మార్కెటింగ్‌పై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.

అలాగే స్వయం సహాయక సంఘాల మహిళల ఇళ్ల వద్ద పెరటి కోళ్ల పెంపకానికి మదర్ హేచరీల ఏర్పాటు, ఎంపిక చేసిన మండలాల్లో పొట్టేళ్ల పెంపకం యూనిట్ల ప్రోత్సాహంపై కూడా చర్చించారు.

ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద మహిళా సంఘాల సభ్యులందరినీ నమోదు చేయాలని, బ్యాంకుల నుంచి డేటా సేకరించి సెర్ప్ పోర్టల్‌లో అప్‌డేట్ చేయాలని నిర్ణయించారు. నమోదు, క్లెయిమ్ పరిష్కారాల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు.

పీఎం సూర్య ఘర్ యోజన కింద మహిళలకు సోలార్ పవర్ యూనిట్ల ఏర్పాటులో సహకారం అందించడంతో పాటు మండల సమాఖ్యలు, గ్రామ సంఘాల ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు ప్రోత్సహించాలని మంత్రి సూచించారు.

ఈ సమావేశంలో సెర్ప్ అదనపు సీఈవో శ్రీరామ్ నాయుడు తదితర అధికారులు పాల్గొన్నారు.