ప్రైవేట్ స్కూళ్లకు షాక్.. ప్రభుత్వ విద్యపై లోకేష్ సంచలన ప్రకటన!

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, వచ్చే విద్యా సంవత్సరంలో మరో 2 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్ల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. పదో తరగతి, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 'షైనింగ్ స్టార్స్' సత్కార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

మంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే ఇప్పుడు ప్రభుత్వ విద్యకు బ్రాండ్ అంబాసిడర్లు అని పేర్కొన్నారు. గతంలో ప్రభుత్వ స్కూళ్లంటే చిన్నచూపు ఉండేదని, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. ఇప్పటికే 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఈ మార్పుకు షైనింగ్ స్టార్స్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల కృషే కారణమన్నారు.

దేశం మొత్తం ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడాలి

ఉత్తమ ఉపాధ్యాయులను సింగపూర్, ఫిన్‌లాండ్ వంటి దేశాలకు పంపించి అక్కడి అత్యుత్తమ విద్యా విధానాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నామని లోకేష్ తెలిపారు. భవిష్యత్తులో దేశమంతా 'ఏపీ మోడల్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్' గురించే చర్చించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని చెప్పారు.

ప్రభుత్వ స్కూళ్లలో సీట్ల కోసం రికమండేషన్లు

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం ఎమ్మెల్యేల సిఫార్సులు కోరే పరిస్థితి వచ్చిందని మంత్రి తెలిపారు. మంగళగిరి నియోజకవర్గంలో ఓ తల్లి ప్రభుత్వ స్కూల్లో సీటు ఇప్పించాలని తనను కోరిన సంఘటనను గుర్తు చేశారు. భవిష్యత్తులో రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల కూడా ఇదే స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

విద్యార్థుల కోణంలోనే సంస్కరణలు

తాను తీసుకొచ్చిన ప్రతి సంస్కరణ విద్యార్థులను కేంద్రంగా పెట్టుకుని అమలు చేశామని మంత్రి వివరించారు. 'వన్ క్లాస్-వన్ టీచర్', లీప్ మిషన్, లీప్ యాప్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్టూడెంట్ కిట్, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, నో బ్యాగ్ డే, క్లిక్కర్ టెక్నాలజీ, త్వరలో ఏఐ ట్యూటర్ వంటి కార్యక్రమాలు ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్నామని చెప్పారు.

మధ్యాహ్న భోజనంలో నాణ్యత పెంచేందుకు ఫైన్ రైస్, సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు, మిల్లెట్ చిక్కీ వంటి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.

పదో తరగతి ఫలితాల్లో గణనీయమైన పురోగతి

విద్యా సంస్కరణల ఫలితంగా ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి ఉత్తీర్ణత శాతం 72.8 శాతం నుంచి 78.39 శాతానికి పెరిగిందని మంత్రి వెల్లడించారు. ఈ విజయానికి ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రుల సమిష్టి కృషే కారణమని ప్రశంసించారు.

పాఠశాలల్లో రాజకీయాలకు చోటు లేదు

విద్యాశాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న తొలి నిర్ణయం పాఠశాలల్లో రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండటం అని మంత్రి స్పష్టం చేశారు. స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, గుడ్లు, ఇతర విద్యా సామగ్రిపై రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పాఠ్యపుస్తకాల నుంచి కూడా ముఖ్యమంత్రి, మంత్రుల సందేశాలను తొలగించామని వెల్లడించారు.

విలువలతో కూడిన విద్య అవసరం

విద్యార్థులకు నైతిక విలువలు నేర్పడం అత్యంత ముఖ్యమని పేర్కొన్న లోకేష్, చాగంటి కోటేశ్వరరావును విలువల ఆధారిత విద్యకు సలహాదారుగా నియమించినట్లు తెలిపారు. మహిళలను గౌరవించడం, సమాజంలో మంచి విలువలను పెంపొందించడం చిన్నప్పటి నుంచే నేర్పించాలని సూచించారు.

ప్రతి విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు

ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సుమారు రూ.1 లక్ష వరకు ఖర్చు చేస్తోందని, ఆ నమ్మకాన్ని నిలబెట్టే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తుంచుకుని చదువులో రాణించాలని సూచించారు. ఒకసారి అపజయం వచ్చినా నిరాశ చెందవద్దని, "FAIL అంటే First Attempt In Learning" అని విద్యార్థులకు మంత్రి లోకేష్ సందేశమిచ్చారు.