సూర్యలంక బీచ్‌కు మహర్దశ.. రూ.97 కోట్లతో భారీ అభివృద్ధి పనులు
బాపట్ల జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం సూర్యలంక బీచ్ ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రకటించారు. మంగళవారం సూర్యలంక బీచ్‌లో నిర్వహించిన అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
రూ.97.52 కోట్లతో సూర్యలంక సమగ్ర అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద రూ.97.52 కోట్ల నిధులతో సూర్యలంక బీచ్‌లో భారీ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు మంత్రి తెలిపారు. వెల్కమ్ ఆర్చ్, సైకిల్ ట్రాక్, స్ట్రీట్ లైటింగ్, పాదచారుల మార్గాలు, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, సోలార్ పవర్ సిస్టమ్, వ్యర్థాల నిర్వహణ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
‘బే ఆఫ్ బాపట్ల’గా బ్రాండింగ్
సూర్యలంక బీచ్‌కు “బే ఆఫ్ బాపట్ల” పేరుతో బ్రాండింగ్ ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు. కుటుంబాలతో సరదాగా గడిపేలా ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు ఫెస్టివల్ కార్నివాల్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్‌కు శ్రీకారం
బ్లూ వేవ్ అడ్వెంచరస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జెట్ స్కీ రైడ్స్‌ను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. స్వయంగా జెట్ స్కీ రైడ్ చేసి పర్యాటకులకు అడ్వెంచర్ అనుభూతిని వివరించారు. సూర్యలంక కేవలం అందమైన బీచ్ మాత్రమే కాకుండా, అడ్వెంచర్ స్పోర్ట్స్‌కు కూడా కేంద్రంగా మారుతోందన్నారు.
బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లక్ష్యం
సూర్యలంక బీచ్‌కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావాలనే లక్ష్యంతో బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు.
సినిమా షూటింగ్‌లకు ప్రోత్సాహం
సూర్యలంకను సినీ షూటింగ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. సినిమా షూటింగ్‌ల ద్వారా పర్యాటకానికి విస్తృత ప్రచారం లభిస్తుందని పేర్కొన్నారు.
పర్యాటక రంగంలో భారీ పెట్టుబడులు
నూతన పర్యాటక పాలసీ 2024-29 ద్వారా రాష్ట్రానికి గత 18 నెలల్లో రూ.20 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి తెలిపారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించడం వల్ల ఇన్వెస్టర్లలో నమ్మకం పెరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో అనగాని సత్య ప్రసాద్, వేగేశన నరేంద్ర వర్మ, నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు.