గుంటూరులో భారీ అగ్నిప్రమాదం.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
అగ్నిమాపక శాఖ అప్రమత్తతతో భారీ ముప్పు నివారణ
గుంటూరు నగరంలో గురువారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగర శివారులోని ఇన్నర్ రింగ్ రోడ్డులో ఉన్న టీఛర్స్ కాలనీలో భారీ భూగర్భ డ్రైనేజ్ పనుల కోసం నిల్వ ఉంచిన పైపులకు ఒక్కసారిగా మంటలు అంటుకోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. భారీగా ఎగిసిపడిన మంటలను చూసిన స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సమాచారం అందుకున్న వెంటనే అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు, అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించారు. ఉదయం నుంచి చోటుచేసుకున్న పరిణామాలను గుంటూరు అదనపు ఎస్పీ జి.వి. రమణమూర్తి, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి ఎం. శ్రీనివాసరెడ్డికి వివరించారు.
ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ.. అగ్నిప్రమాదానికి కారణమైన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. సంఘటనపై సమగ్ర విచారణ జరపాలని కూడా డిమాండ్ చేశారు.
అలాగే తాను జిల్లా అగ్నిమాపక శాఖ అధికారులకు, రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీకి లైవ్ వీడియోల ద్వారా సమాచారం అందించడంతో అధికారులు వెంటనే స్పందించారని తెలిపారు. కేవలం 20 నిమిషాల్లో ఫైరింజన్లు సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చాయని చెప్పారు.
అగ్నిమాపక శాఖ సిబ్బంది వేగంగా స్పందించకపోయి ఉంటే భారీ ప్రమాదం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడంలో ఫైర్ సిబ్బంది కీలక పాత్ర పోషించారని డాక్టర్ జాస్తి వీరాంజనేయులు అభినందించారు.
ఈ ఘటనతో టీఛర్స్ కాలనీ పరిసరాల్లో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటనకు గల అసలు కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.