దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదాపై మంద కృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో నిర్వహించిన దళిత క్రైస్తవుల అవగాహన సదస్సులో మంద కృష్ణ మాదిగ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ విరుద్ధమైన 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను వెంటనే రద్దు చేయాలని లేదా సవరణ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించకుండా మత స్వేచ్ఛను అడ్డుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమని ఆయన మండిపడ్డారు.

రాజమహేంద్రవరం ఏవి అప్పారావు రోడ్డులోని జేకే గార్డెన్స్‌లో ఏపీ పాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి పాస్టర్లు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, దళిత నాయకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

మత స్వేచ్ఛ ప్రతి పౌరుడి హక్కు

సదస్సులో మాట్లాడిన మంద కృష్ణ మాదిగ భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛను కల్పించిందన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 16, 25 ప్రకారం కులం, మతం, లింగం ఆధారంగా వివక్ష ఉండకూడదని గుర్తుచేశారు. కానీ దళితులు క్రైస్తవ మతం స్వీకరించిన వెంటనే వారికి ఎస్సీ హోదా తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు.

ఓసీలు, బీసీలు, ఎస్టీలు మతం మార్చుకున్నా వారికి ప్రభుత్వ ప్రయోజనాలు కొనసాగుతున్నాయని, కానీ దళిత క్రైస్తవులకు మాత్రమే ఆంక్షలు విధించడం వెనుక రాజకీయ, సామాజిక వివక్ష ఉందని ఆరోపించారు. 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కారణంగానే ఈ పరిస్థితి కొనసాగుతోందన్నారు.

సుప్రీంకోర్టు తీర్పుపై ఆవేదన

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా వర్తించదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మంద కృష్ణ మాదిగ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల దళిత కుటుంబాలు భయాందోళనలకు గురయ్యాయని చెప్పారు. చర్చిలకు వెళ్లడానికి కూడా కొందరు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ తీర్పును అడ్డం పెట్టుకుని కొందరు దళితులను భయపెట్టేలా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికీ దేశంలో మను ధర్మ భావజాలం కొనసాగుతోందని, దళితులకు పూర్తి స్థాయి మత స్వేచ్ఛ లభించడంలేదని అన్నారు.

రాజకీయ పార్టీలపై విమర్శలు

దళిత క్రైస్తవుల ఓట్లు తీసుకున్న అధికార, ప్రతిపక్ష పార్టీలు ఇప్పుడు స్పందించడం లేదని మంద కృష్ణ మాదిగ మండిపడ్డారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్నవారే దళిత క్రైస్తవుల మత స్వేచ్ఛను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్న సమయంలో దళిత క్రైస్తవులకు మత స్వేచ్ఛ కల్పించాలని అసెంబ్లీలో తీర్మానాలు చేసి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు.

బాలకృష్ణన్ కమిషన్ నివేదికపై దృష్టి

జూన్ 10లోపు జస్టిస్ బాలకృష్ణన్ కమిషన్ నివేదిక రానుందని, ఆ నివేదికకు ముందు దళిత క్రైస్తవులకు ఇతర రాష్ట్రాల్లో కల్పిస్తున్న అవకాశాలు, పార్లమెంట్‌లో జరిగిన చర్చలు, రాజకీయ నాయకుల ప్రకటనలను ఆధారాలతో సమర్పించాలని సూచించారు.

అంబేద్కర్ రచించిన రాజ్యాంగ హక్కులు దళిత క్రైస్తవులకు పూర్తిగా అందే వరకు తమ పోరాటం కొనసాగుతుందని మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు.