నెల్లూరులో టీడీపీ మహానాడు ఏర్పాట్లు షురూ.. 250 ఎకరాల్లో భారీగా పసుపు పండుగ
టీడీపీ మహానాడు 2026 కోసం నెల్లూరు జిల్లా కిసాన్ సెజ్ వేదికగా భారీ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొంగూరు నారాయణ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ, మహానాడును చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.
మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న ఈ మహాసభ కోసం సుమారు 250 ఎకరాల్లో ప్రత్యేక సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది కార్యకర్తలు, నాయకులు హాజరయ్యే అవకాశముందని పార్టీ అంచనా వేస్తోంది.
7 లక్షల మందితో భారీ బహిరంగ సభ
మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ మహానాడు ముగింపు రోజైన మే 29న జరిగే బహిరంగ సభకు రాష్ట్రంలోని 28 జిల్లాల నుంచి 7 లక్షల మందికి పైగా ప్రజలు, కార్యకర్తలు వచ్చే అవకాశం ఉందన్నారు. దాదాపు 6 వేల బస్సులు రానుండటంతో భారీ పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తున్నామని చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన సమస్యలు, సూచనలపై చర్చించి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి పంపనున్నట్లు వెల్లడించారు.
కమిటీలతో సమీక్షలు.. యుద్ధప్రాతిపదికన పనులు
మే 13న మంగళగిరి పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్ర స్థాయి నేతలు నెల్లూరుకు వచ్చి రవాణా, భోజనం, పార్కింగ్, తీర్మానాలు, వాలంటీర్, సాంస్కృతిక కార్యక్రమాలు, ఫోటో ఎగ్జిబిషన్ కమిటీలతో సమీక్ష నిర్వహించనున్నారు.
బీద రవిచంద్ర మాట్లాడుతూ మహానాడుకు వచ్చే వాహనాల వల్ల జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు.
నెల్లూరులో తొలిసారి మహానాడు
కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ 44 ఏళ్ల చరిత్రలో నెల్లూరులో తొలిసారి మహానాడు నిర్వహించడం చారిత్రాత్మక ఘట్టమన్నారు. సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ నెల్లూరుకు ఈ అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ మహానాడును పండుగలా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.