ఎంపీ నోట కల్తీ మాట... చేతల్లో చూపించిన అధికారులు
ఎంపీ నోట కల్తీ మాట... చేతల్లో చూపించిన అధికారులు
నరసరావుపేటలో మెడికల్ షాప్, 4 రెస్టారెంట్లు సీజ్.. రెండు రెస్టారెంట్లకు నోటీసులు
మెడికల్, ఫుడ్ మాఫియా ఆరోపణలపై ఈగల్ టీం ఉక్కుపాదం!
పల్నాడు, నరసరావుపేట: నరసరావుపేటలో భారీగా సాగుతున్న కల్తీపై ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సుతిమెత్తగా హెచ్చరిక చేశారు. ఇటీవల ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షునిగా మిస్టర్ గ్రాండ్ సుబ్బు పదవి ప్రమాణ స్వీకారోత్సవ సభలో ఎంపీ లావు మాట్లాడుతూ.. కొంత మంది వ్యాపారులు చేస్తున్న కల్తీ వ్యాపారంతో నరసరావుపేటకు చెడ్డ పేరు వచ్చిందన్నారు. ప్రభుత్వం ఏదైనా చర్య తీసుకుంటే తన వద్దకు సిఫార్సుల కోసం రావద్దని వ్యాఖ్యానించారు.
ఎంపీ హెచ్చరికలతో రంగంలోకి దిగిన అధికార యంత్రాంగం
ఎంపీ లావు మాటలతో అధికార యంత్రాంగం కూడా మేల్కొని తనిఖీలకు శ్రీకారం చుట్టింది. నరసరావుపేట పట్టణం మల్లమ్మ సెంటర్లోని ఓ ఔషధ దుకాణంపై ఈగల్ టీం దాడి చేసింది. అనుమతి లేని సుమారు రూ.10 లక్షల విలువైన మందులను అధికారులు సీజ్ చేశారు.
నాలుగు హోటళ్లకు తాళాలు.. రెండు హోటళ్లకు నోటీసులు
ఎంతో కాలంగా ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్న ఆర్కే రెస్టారెంట్, జూపల్లి రెస్టారెంట్, షాజ్ బిర్యానీ హౌస్, యూనిక్ రెస్టారెంట్లను సీజ్ చేశారు. ఏకే బిర్యానీ.. హెచ్-6 రెస్టారెంటైస్కు నోటీసులు జారీ చేశారు. ఈగల్ టీం డైరెక్టర్, పల్నాడు జిల్లా పూర్వపు కలెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో అధికారులు చేపట్టిన ఈ తనిఖీలతో కల్తీ వ్యాపారులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.
నరసరావుపేట నుంచి విశాఖపట్నంకు కల్తీ సరుకు
విశాఖపట్నంలోనూ నిర్వహించిన తనిఖీల్లో కల్తీ ఔషధాల సరఫరా వెనుక నరసరావుపేట వ్యాపారుల హస్తం ఉందని అరుణ్ బాబు వెల్లడించారు. నరసరావుపేటలో భారీగా సాగుతున్న కల్తీ మాఫియాపై ఉక్కుపాదం తప్పదని ఈగల్ టీమ్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే దుకాణాలు సీజ్ చేస్తామన్న అరుణ్ బాబు చెప్పారు. మెడిసిన్ నుంచి ఫుడ్ వరకు జరుగుతున్న కల్తీపై అధికారులు దృష్టి సారించారు.