గడ్డం గీయని పట్టుదలే... ఆ ఊరి సమస్యకు పరిష్కారం
టీఎన్ఎస్ఎఫ్ నేత భార్గవ్ సాయి పోరాటం గెలిచింది
ఎనిమిదేళ్ల గతుకుల రోడ్డుకి మోక్షం
పల్నాడు, నరసరావుపేట:
జన్మభూమికి వెళ్లే ప్రధాన రహదారి ఎనిమిదేళ్లుగా గోతులతో అధ్వానంగా తయారైంది. ఎంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి పాలకుల నిర్లక్ష్యం తన స్వగ్రామానికి శాపమైందని టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నాయకుడు భార్గవ్ సాయి ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎదురుచూస్తున్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పట్టించుకునే దిక్కు లేదని ఆవేదనకు లోనయ్యారు. సమస్య పరిష్కరించండి మహా ప్రభూ అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులను వేడుకున్నారు.
పని కోసం శపథం చేసి సాధించుకున్నారు
సొంత ఊరి రోడ్డు పని కోసం పంతం పట్టారు. అప్పటి వరకు తల జుట్టు, మీసం, గడ్డం తీయనని శపథంతో యేనుగంటి భార్గవ్ సాయి వినూత్నంగా చేపట్టిన ఈ నిరసనకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. ఆయనతో పాటు ఆ గ్రామస్తుల కల సాకారమైంది. నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల ఆర్&బీ రహదారి నుంచి తుంగపాడుకి రోడ్డు నిర్మించాలని చాలాకాలంగా స్థానికులు కోరుతున్నారు. గ్రామ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో రోడ్డు నిర్మాణం కోసం తనవంతుగా ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు సాయి నిరసన బాట పట్టారు.
పల్లె పండుగ 3.0లో రూ.50 లక్షల నిధులు
తన ఊరి రోడ్డుకి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టే వరకు గడ్డం తీయనంటూ సంకల్పించుకుని పోరాటం కొనసాగించారు. నిరాశ చెందకుండా పట్టుదలగా తన లక్ష్యం కోసం ప్రభుత్వ కార్యాలయాలు, ప్రజాప్రతినిధుల చుట్టూ ప్రదక్షిణలు చేశారు. దీనికి తోడు గ్రామ ప్రజల ఆకాంక్ష ఇప్పుడు కార్యరూపం దాల్చింది. రొంపిచర్ల ఆర్&బీ రహదారి నుంచి తుంగపాడు రోడ్డు పునర్నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. పల్లె పండుగ 3.0 పథకంలో రూ.50 లక్షల నిధులను మంజూరు చేశారు. ఈ రోడ్డు పనులకు నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవిందబాబు బుధవారం భూమిపూజ చేశారు. ఊరి సమస్య పరిష్కారానికి కృషి చేసిన యేనుగంటి భార్గవ్ సాయిని ఎమ్మెల్యేతో పాటు నాయకులు, గ్రామస్తులు అభినందించారు.