నరసరావుపేటలో భూ కుంభకోణం.. ప్రభుత్వ భూమిని విక్రయించిన వైసీపీ నేతలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

నరసరావుపేట: రొంపిచర్ల మండలం అచ్చయ్యపాలెంకు చెందిన టీడీపీ నేత గాడిపర్తి రామాంజనేయులుకు భూ విక్రయం పేరుతో వైసీపీ నేతలు రూ.1.5 కోట్లు టోకరా వేసినట్లు ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. నకిలీ పత్రాలతో ఏకంగా ప్రభుత్వ భూమిని విక్రయించిన వ్యవహారం బహిర్గతమైంది.

రామాంజనేయులు నరసరావుపేటకు వలసొచ్చి స్థిరపడ్డారు. నరసరావుపేట మండలం రావిపాడు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 342, 22బీలో ఎకరా 1.85 సెంట్ల వ్యవసాయ భూమి తమ తల్లి నుంచి వారసత్వంగా సంక్రమించిందని వైసీపీ నేతలు వేలమూరి రామకృష్ణారెడ్డి, శివయ్య, లక్ష్మారెడ్డి నమ్మించారని బాధితుడు ఆరోపించారు. ఈ మేరకు భూమి విక్రయానికి సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నారని తెలిపారు.

రిజిస్ట్రేషన్ కార్యాలయంలో బయటపడిన వ్యవహారం

ఆ భూమిలో వెంచర్ వేసి ప్లాట్లుగా విక్రయిస్తే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించి తనతో రూ.కోటిన్నర ఖర్చు చేయించారని రామాంజనేయులు ఆరోపించారు. అగ్రిమెంట్‌కు కొంత నగదు ఇచ్చే ముందు కొనుగోలుదారులు ఆ భూమి డాక్యుమెంట్లను నరసరావుపేట రిజిస్ట్రేషన్ కార్యాలయంలో చూపించి విచారించారు.

అయితే, ఆ సర్వే నంబర్‌లో ప్రభుత్వ కుంట భూమి ఉన్నట్లు రిజిస్ట్రేషన్ కార్యాలయ అధికారులు తెలిపినట్లు బాధితుడు పేర్కొన్నారు. దీంతో మోసం జరిగినట్లు గ్రహించిన రామాంజనేయులు వైసీపీ నేతలను నిలదీశారు.

చంపుతామని బెదిరింపులు

ఈ విషయాన్ని బయటపెడితే చంపుతామని వైసీపీ నేతలు తనను బెదిరించారని రామాంజనేయులు ఆరోపించారు. ఈ వ్యవహారంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎట్టకేలకు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు చొరవతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సమాచారం.

ఇదే ప్రభుత్వ భూమిలో ‘కార్తికేయ గ్రాండ్’ పేరుతో కళ్యాణ మండపాన్ని వైసీపీ నేతలు నిర్మించడం గమనార్హం. సుమారు రూ.30 కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని విక్రయించబోయి పట్టుబడిన వైసీపీ నేతల తీరు తమ భూ ఆక్రమణకు పరాకాష్టగా నిలిచిందని బాధితుడు ఆరోపించారు.

ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని టీడీపీ నేత రామాంజనేయులు కోరుతున్నారు. ప్రభుత్వం కూడా ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.