కొత్తగా 5,606 స్పౌజ్ పింఛన్లు మంజూరు.. ప్రభుత్వం కీలక నిర్ణయం
అమరావతి: రాష్ట్రంలోని లక్షలాది మంది పింఛన్ లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. జూన్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కోసం రూ.2728.67 కోట్ల నిధులను విడుదల చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 62,34,445 మంది పింఛన్ లబ్ధిదారులకు జూన్ 1వ తేదీ ఉదయం నుంచే నేరుగా పింఛన్లు పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి నెలా మాదిరిగానే ఈసారి కూడా నెల మొదటి రోజునే లబ్ధిదారుల ఇంటి వద్దకు పింఛన్లు చేరేలా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందన్నారు.
ఈ నెలలో కొత్తగా 5,606 మంది స్పౌజ్ (భార్య లేదా భర్త) పింఛన్ లబ్ధిదారులను ప్రభుత్వం గుర్తించి మంజూరు చేసింది. వీరి కోసం ప్రత్యేకంగా రూ.2.24 కోట్లను విడుదల చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకాన్ని కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో అమలు చేస్తోందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అవ్వాతాతలు, వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఇతర బలహీన వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి నెలా ఎలాంటి జాప్యం లేకుండా పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి జూన్ 2026 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం మొత్తం రూ.65,886.57 కోట్లను ఖర్చు చేసినట్లు మంత్రి వెల్లడించారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే పింఛన్ల కోసం చేసిన అత్యధిక వ్యయాల్లో ఒకటిగా పేర్కొన్నారు.
సామాజిక భద్రతకు ఎన్టీఆర్ భరోసా పథకం ప్రధాన ఆధారంగా మారిందని, లబ్ధిదారుల జీవితాల్లో ఆర్థిక భరోసాను కల్పించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. జూన్ 1 నుంచి ప్రారంభమయ్యే పింఛన్ల పంపిణీ ప్రక్రియను అధికారులు పర్యవేక్షిస్తూ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని చెప్పారు.
లక్షలాది మంది లబ్ధిదారులకు ఆర్థిక ఊరటనిచ్చే ఈ పింఛన్ పంపిణీ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం ఉదయం నుంచే ప్రారంభం కానుంది.