ఫైల్ క్లియరెన్స్లో రాష్ట్రంలో రెండో స్థానం సాధించిన పల్నాడు కలెక్టర్ కృతికా శుక్లా
నరసరావుపేట, మే 9: పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా పరిపాలనలో తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల అమలులో వేగం, పారదర్శకతతో ముందుకు సాగుతూ ప్రజలకు సత్వర సేవలు అందించడంలో ఆమె ముందంజలో నిలుస్తున్నారు.
తాజాగా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ-ఫైల్స్ క్లియరెన్స్ నివేదికలో పల్నాడు జిల్లా రాష్ట్రస్థాయిలో రెండో స్థానాన్ని దక్కించుకుంది. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా ఒక్కో ఫైలును సగటున కేవలం 7.65 గంటల్లోనే పరిష్కరిస్తూ సమర్థవంతమైన పరిపాలనకు నిదర్శనంగా నిలిచారు.
ఫైళ్ల పరిష్కారంలో జాప్యం లేకుండా వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ జిల్లా అభివృద్ధికి, ప్రజల సమస్యల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తున్నారని అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా జిల్లా పరిపాలనను సమర్థంగా నడిపిస్తూ ఫైల్ క్లియరెన్స్లో అగ్రస్థానంలో నిలిపేందుకు కలెక్టర్ కృషి చేస్తున్నారని తెలిపారు.
ఈ విజయంపై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కలెక్టర్ కృతికా శుక్లాను అభినందించారు. ప్రజలకు అందాల్సిన సేవలు నిర్ణీత సమయంలోగా చేరేలా చర్యలు తీసుకోవడమే తన ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా కలెక్టర్ పేర్కొన్నారు.