పిఠాపురం టెన్త్ టాపర్లకు పవన్ కళ్యాణ్ గిఫ్ట్.. ఉచిత ఉన్నత విద్య

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా విద్యారంగంలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ప్రోత్సాహం అందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో 580కిపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్య అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 31 మంది విద్యార్థులు 580 మార్కులకు పైగా సాధించినట్లు గుర్తించారు. వీరిలో 598 మార్కులతో రాష్ట్ర స్థాయిలో అగ్రస్థానంలో నిలిచిన ఒక విద్యార్థి కూడా ఉన్నారు. ఈ ప్రతిభావంతులైన విద్యార్థుల భవిష్యత్తు కోసం వారి అభిరుచికి అనుగుణంగా కోర్సులు, కళాశాలలు ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు.

ఇప్పటికే తల్లిదండ్రులు లేని పిల్లలకు నెలకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తున్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు అదే పిల్లల్లో ఏడుగురు 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో వారికి ఉన్నత విద్యాభ్యాసం కోసం పూర్తి సహాయం అందించాలని నిర్ణయించారు. విద్యార్థులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి ఆసక్తికి తగ్గ కోర్సులను ఎంపిక చేయించారు.

ఈ క్రమంలో పలు విద్యాసంస్థల యాజమాన్యాలతో సంప్రదింపులు జరిపి, ఆ 31 మంది విద్యార్థులకు ఉచిత అడ్మిషన్లు కల్పించినట్లు సమాచారం. తన విజ్ఞప్తిని గౌరవించి వెంటనే ముందుకు వచ్చిన విద్యాసంస్థలకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని విద్యార్థులకు సూచించారు.

పిఠాపురం నియోజకవర్గంలో విద్య, ఉపాధి, సామాజిక సంక్షేమ రంగాల్లో పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.