సచివాలయంలో ఇంకా వైసీపీ ప్రభావమేనా? కూటమి ప్రభుత్వంలో అధికార వ్యవస్థపై సంచలన ఆరోపణలు

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

రాష్ట్ర పరిపాలనకు కేంద్రబిందువైన సచివాలయంలో ఇప్పటికీ వైసీపీ ప్రభావం కొనసాగుతోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తున్నా, పాలనా వ్యవస్థలో పెద్ద మార్పులు కనిపించడం లేదనే చర్చ అధికార వర్గాల్లో వినిపిస్తోంది.

ఆఫ్ ది రికార్డ్‌గా పలువురు సచివాలయ ఉద్యోగులు వెల్లడించిన సమాచారం ప్రకారం, కొద్దిమంది మినహా అధిక శాతం ఐఏఎస్ అధికారులు, కీలక శాఖల సిబ్బంది వైసీపీ అనుబంధంగా ఉన్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా GAD వంటి కీలక విభాగాల్లో సమాచారం వైసీపీ నేతలకు చేరుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

మంత్రుల పేషీల్లోనూ, సీఎం కార్యాలయంలోనూ టీడీపీ–జనసేన అభిమానుల కంటే వైసీపీ మద్దతుదారులే ఎక్కువగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. గత వైసీపీ పాలనలో టీడీపీ లేదా జనసేన అనుబంధ అధికారులు కనీసం కనిపించకపోయినా, ప్రస్తుతం మాత్రం పరిస్థితి పూర్తిగా రివర్స్‌గా మారిందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న అధికార వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోందని, ముఖ్యంగా కొన్ని వర్గాల అధికారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సమాచారం. సచివాలయం స్థాయిలోనే పరిస్థితి ఇలా ఉంటే, జిల్లాల పరిపాలన ఎలా ఉందన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.

ఈ అంశం రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.