శశిభూషణ్ కుమార్ బదిలీపై చర్చ.. రూ.650 కోట్ల చెల్లింపుల వ్యవహారం ఏంటి?
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంలో ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి బదిలీ ఇప్పుడు రాజకీయ, అధికార వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖాధిపతిగా పనిచేస్తున్న శశిభూషణ్ కుమార్ను అకస్మాత్తుగా బదిలీ చేసి, కీలకమైన నీటిపారుదల శాఖ బాధ్యతలు అప్పగించడం వెనుక పలు కారణాలు ఉన్నాయన్న ప్రచారం సాగుతోంది.
ప్రచారంలో ఉన్న వివరాల ప్రకారం.. చిన్న కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల చెల్లింపుల కోసం ఆర్థిక శాఖ సుమారు రూ.700 కోట్లు విడుదల చేసినట్లు తెలుస్తోంది. అయితే, అందులో రూ.650 కోట్లను ఓ పెద్ద నిర్మాణ సంస్థకు మొబిలైజేషన్ అడ్వాన్స్ రూపంలో విడుదల చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఈ చెల్లింపులు ఉన్నత స్థాయి ఆమోదంతోనే జరిగాయా..? లేక శాఖ స్థాయిలోనే నిర్ణయం తీసుకున్నారా..? అన్నదానిపై కూడా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు సమాచారం లేకుండానే ఈ చెల్లింపులు జరిగాయన్న ప్రచారం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
అలాగే, ఈ వ్యవహారంలో సీఎంఓలోని కొందరు కీలక అధికారుల పాత్ర కూడా ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, ఈ చెల్లింపుల్లో భారీ స్థాయిలో కమిషన్లు చేతులు మారాయన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే, ఈ ఆరోపణలపై ప్రభుత్వం గానీ, సంబంధిత అధికారులు గానీ ఇప్పటివరకు స్పందించలేదు.
మరోవైపు, శశిభూషణ్ కుమార్కు నీటిపారుదల శాఖ పోస్టింగ్ రావడంలో ఓ ప్రముఖ కాంట్రాక్టర్ ప్రభావం పనిచేసిందన్న ప్రచారం కూడా కొనసాగుతోంది. గత ప్రభుత్వంలోనూ, ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలోనూ ఆ కాంట్రాక్టర్కు మంచి పరిచయాలు ఉన్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.
ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్ తమ కథనాలపై పరువు నష్టం నోటీసులు అందాయని వెల్లడించడం కూడా ఈ వ్యవహారాన్ని మరింత హాట్ టాపిక్గా మార్చింది.
అయితే ప్రస్తుతం ఇవన్నీ రాజకీయ, మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారమే తప్ప.. అధికారికంగా ఎలాంటి ధృవీకరణ వెలువడలేదు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం స్పందిస్తుందా..? లేదా దర్యాప్తు జరుగుతుందా..? అన్నది చూడాల్సి ఉంది.