పార్టీ బలోపేతానికి టీడీపీ ఫోకస్.. బీటీ నాయుడికి కీలక పదవి

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

తెలుగుదేశం పార్టీ సంస్థాగత బలోపేతం దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. పల్నాడు, బాపట్ల జిల్లాల జోనల్ ఇన్‌చార్జిగా సీనియర్ నాయకులు, ఎమ్మెల్సీ బీటీ నాయుడు ను నియమించినట్లు పార్టీ అధిష్టానం ప్రకటించింది.

ఈ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు సంయుక్తంగా వెల్లడించారు.

అపార రాజకీయ అనుభవం

బీటీ నాయుడు రెండు సార్లు కర్నూలు ఎంపీగా, రెండు సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్, ప్రివిలేజ్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. సుప్రీంకోర్టు న్యాయవాదిగా కూడా ఆయనకు విశేష అనుభవం ఉంది.

పార్టీ బలోపేతమే లక్ష్యం

ఈ సందర్భంగా బీటీ నాయుడు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో కీలక బాధ్యతలు అప్పగించిన చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు. క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడమే తన ప్రధాన లక్ష్యమన్నారు.

నాయకులు, కార్యకర్తల మధ్య వారధి

రెండు జిల్లాల్లో నాయకులు, కార్యకర్తల మధ్య వారధిలా వ్యవహరిస్తూ పార్టీ నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేస్తానని బీటీ నాయుడు తెలిపారు. తన సుదీర్ఘ రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి పల్నాడు, బాపట్ల జిల్లాల్లో పార్టీ పటిష్టతకు అహర్నిశలు శ్రమిస్తానని పేర్కొన్నారు.