టీడీపీ నేత దుర్గారెడ్డి హత్యపై సమగ్ర దర్యాప్తు.. అధికారుల నిర్లక్ష్యం తేలితే చర్యలు: ఎంపీ పుట్టా మహేష్ కుమార్
ఏలూరు, జూలై 08: జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటలో టీడీపీ నేత కారుమూరి దుర్గారెడ్డి హత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ దారుణ హత్యను తీవ్రంగా ఖండించిన ఆయన.. కేసులో నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
హత్యకు గురైన దుర్గారెడ్డి భౌతికకాయానికి బుధవారం ఉదయం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ నివాళులర్పించారు. అనంతరం దుర్గారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఎంపీ.. ప్రశాంతంగా ఉన్న చింతలపూడి నియోజకవర్గంలో ఇటువంటి దారుణ ఘటన చోటుచేసుకోవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. కుటుంబ ఆస్తి తగాదాలే హత్యకు కారణమని ప్రాథమికంగా చెబుతున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన అన్ని కోణాల్లో విచారణ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. నిందితుడికి వైసీపీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతోపాటు పోలీసులు, అధికారుల వ్యవహారశైలిపై వచ్చిన ఫిర్యాదులను కూడా దర్యాప్తులో పరిశీలించాలని అన్నారు.
ఎంపీ పర్యటన సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమకు న్యాయం చేయాలని దుర్గారెడ్డి కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు డిమాండ్ చేశారు. పోలీసులు, సంబంధిత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో ఎంపీ వారిని సముదాయించి, కేసులో న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.
తన ప్రాణానికి ప్రమాదం ఉందని దుర్గారెడ్డి గతంలో పోలీసులకు చెప్పినా పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఎంపీకి ఫిర్యాదు చేశారు. భూమి వివాదం విషయంలో కొందరు అధికారులు పక్షపాతంగా వ్యవహరించారని ఆరోపించారు. హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాసరెడ్డి వెనుక వైసీపీ నేతల ప్రోద్బలం ఉందని టీడీపీ నేతలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు.
ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను స్థానిక పార్టీ నేతలను అడిగి తెలుసుకున్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్.. కేసును సమగ్రంగా దర్యాప్తు చేయించాలని స్పష్టం చేశారు. హత్యకు బాధ్యులైన వారికి చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవడంతోపాటు, పోలీసు లేదా ఇతర అధికారుల నిర్లక్ష్యం ఉన్నట్లు విచారణలో తేలితే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దుర్గారెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని ఎంపీ భరోసా ఇచ్చారు.