కాన్వాయ్‌కు గుడ్‌బై.. ఈవీ బైక్‌పై ప్రయాణించిన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ, పీవీఎన్ మాధవ్

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

భీమవరం: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన ఇంధన పొదుపు పిలుపుకు మద్దతుగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వినూత్నంగా స్పందించారు. శనివారం భీమవరం పట్టణంలో ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) బైక్‌పై ప్రయాణించి ప్రజల దృష్టిని ఆకర్షించారు.

భీమవరంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ అభియాన్’ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన పీవీఎన్ మాధవ్‌తో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ తన నివాసం నుంచి ఈవీ బైక్‌పై బయలుదేరారు. సాధారణంగా కేంద్ర మంత్రులకు ఉండే అధికారిక కాన్వాయ్, ప్రోటోకాల్‌ను పక్కనపెట్టి వారు ఈ ప్రత్యేక ప్రయాణాన్ని ఎంచుకోవడం విశేషంగా మారింది.

ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్వయంగా హెల్మెట్ ధరించి బైక్ నడపగా, కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ వెనుక కూర్చుని ప్రయాణించారు. ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, సామాన్య ప్రజల మాదిరిగానే భీమవరం పట్టణ ట్రాఫిక్ గుండా ప్రయాణిస్తూ ‘కే కన్వెన్షన్’ కార్యక్రమ వేదికకు చేరుకున్నారు.

భవిష్యత్ తరాల కోసం ఇంధన పొదుపు ఎంత ముఖ్యమో ప్రజలకు తెలియజేయడానికే ఈవీ బైక్‌పై ప్రయాణించినట్లు నేతలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సంప్రదాయ ఇంధనాల వినియోగాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అధికారిక వాహనాలను పక్కనపెట్టి సాధారణ బైక్‌పై రావడం స్థానిక ప్రజలను ఆకట్టుకుంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ స్వయంగా బైక్ నడపడం కార్యకర్తల్లో చర్చనీయాంశంగా మారింది.

ప్రధాని మోదీ సూచించిన ‘ఇంధన పొదుపు – పర్యావరణ పరిరక్షణ’ సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్య చేపట్టినట్లు బీజేపీ నేతలు తెలిపారు. భీమవరం వీధుల్లో జరిగిన ఈ వినూత్న ప్రయాణం స్థానికంగా విశేష చర్చకు దారి తీసింది.