అమరావతి అవినీతిపై కోర్టుకు వెళ్తా.. విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి, మావిగన్ పేరుతో జరుగుతున్న రాజకీయ వాదోపవాదాల కంటే రాజధాని నిర్మాణంలో అవినీతి ఆరోపణలపైనే ప్రధాన చర్చ జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాజధాని నిర్మాణ వ్యయాల్లో జరిగినట్లు తాను ఆరోపిస్తున్న అక్రమాలపై పూర్తి వివరాలతో త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని ప్రకటించారు.
సోషల్ మీడియా వేదికగా స్పందించిన విజయసాయిరెడ్డి, ఆంధ్రప్రదేశ్లో రాజధాని అంశం ఇప్పటికీ రాజకీయ వివాదంగానే కొనసాగడం బాధాకరమని పేర్కొన్నారు. 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి దశాబ్దానికి పైగా గడిచినా రాజధాని అంశంపై స్పష్టత లేకపోవడం అన్ని రాజకీయ పార్టీల వైఫల్యమేనని విమర్శించారు.
శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఎందుకు పక్కన పెట్టారు?
రాజధాని ఎంపిక విషయంలో శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు అమలు చేయలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజన జరిగి పన్నెండేళ్లు గడిచినా ఇప్పటికీ రాజధాని ఎక్కడ ఉండాలనే చర్చ కొనసాగుతుండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు. 2029 ఎన్నికల్లో కూడా ఇదే అంశాన్ని ఎన్నికల ఎజెండాగా మార్చడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు.
రైతుల సమస్యలు, VGTM కాన్సెప్ట్పై ప్రశ్నలు
ల్యాండ్ పూలింగ్ కింద భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ప్లాట్ల కేటాయింపులు పూర్తికాకపోవడాన్ని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో ప్రస్తావించిన విజయవాడ–గుంటూరు–తెనాలి–మంగళగిరి (VGTM) అభివృద్ధి భావనను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
అమరావతి నిర్మాణంపై అవినీతి ఆరోపణలు
రాజధాని నిర్మాణం పేరుతో భారీ స్థాయిలో ప్రజాధనం ఖర్చు చేస్తున్నారని ఆరోపించిన విజయసాయిరెడ్డి, నిర్మాణ వ్యయాలను కృత్రిమంగా పెంచి చూపుతున్నారని విమర్శించారు. సుమారు రూ.50 వేల కోట్ల నిర్మాణ వ్యయంలో భారీ స్థాయిలో అవినీతికి ఆస్కారం ఉందని ఆరోపించారు. అమరావతి పేరుతో జరుగుతున్న నిర్మాణాల్లో ఎస్కలేషన్, టెండర్లు, వ్యయాలపై పూర్తి వివరాలను ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు.
మావిగన్తో ప్రయోజనం ఏమిటి?
రాజధాని నిర్మాణాలు కొనసాగుతున్న సమయంలో "మావిగన్" వంటి కొత్త ప్రతిపాదనలు తీసుకురావడం వల్ల ప్రయోజనం ఏమిటని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజధాని అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా ధన పరిరక్షణ కోణంలో చూడాలని సూచించారు.
కోర్టును ఆశ్రయిస్తానన్న మాజీ ఎంపీ
అమరావతి నిర్మాణంలో ఎస్కలేషన్, వ్యయాలు, టెండర్లకు సంబంధించిన వివరాలను సేకరించి, ప్రజా ధనం దుర్వినియోగమైందని తాను భావిస్తున్న అంశాలపై త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. అమరావతి పేరుతో జరుగుతున్నట్లు తాను ఆరోపిస్తున్న అవినీతిపై ప్రజల తరఫున పోరాడతానని స్పష్టం చేశారు.