ఓటరు జాబితాపై కలెక్టర్ సీరియస్.. ఈరోజే 100% ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలి!
ఏలూరు, జూన్ 27: ఓటరు జాబితా ప్రత్యేక సవరణ (SIR-2026) ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని నూరుశాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరిస్తూ, ఫారాలను కేవలం బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వోలు) మాత్రమే ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఈ ప్రక్రియలో భాగస్వాములను చేయరాదని కఠిన ఆదేశాలు జారీ చేశారు.
శనివారం పెదవేగి మండలంలోని పెదవేగి గ్రామంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీని కలెక్టర్ ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో బీఎల్వోలు, సూపర్వైజర్లతో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026పై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 15,79,042 ఎన్యూమరేషన్ ఫారాలు (96.04 శాతం) పంపిణీ పూర్తయిందని తెలిపారు. అలాగే 3,30,537 ఫారాలు (20 శాతం) ఇప్పటికే డిజిటైజేషన్ చేసినట్లు వెల్లడించారు. అయితే పెదవేగి మండలంలో ఫారాల పంపిణీ 95.42 శాతం మాత్రమే పూర్తవడంతో అసంతృప్తి వ్యక్తం చేసిన కలెక్టర్, అదే రోజు సాయంత్రానికి నూరుశాతం పంపిణీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
జూలై 14 వరకు కొనసాగనున్న ఈ ప్రత్యేక సవరణ కార్యక్రమంలో ప్రతి బీఎల్వో తమ పరిధిలోని ప్రతి ఇంటిని సందర్శించి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేయాలని, ఓటర్లు వాటిని పూర్తి చేసిన తర్వాత తిరిగి స్వీకరించి వెంటనే డిజిటైజేషన్ చేయాలని సూచించారు.
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)-2026 ప్రధాన లక్ష్యం అర్హులైన ప్రతి పౌరుడిని ఓటరు జాబితాలో చేర్చడం, అనర్హుల పేర్లను తొలగించడం, డూప్లికేట్ నమోదులను గుర్తించి తొలగించడం, అలాగే కొత్తగా అర్హత పొందిన వారిని ఓటర్లుగా నమోదు చేయడమేనని కలెక్టర్ వివరించారు.
ఈ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, రాజకీయాలకు అతీతంగా సాగాలని స్పష్టం చేసిన కలెక్టర్, బీఎల్వోలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్యూమరేషన్ ఫారాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అప్పగించకూడదని హెచ్చరించారు. ఇంటింటికీ వెళ్లి ఫారాలు అందించడం, పూర్తయిన తర్వాత తిరిగి సేకరించడం, అనంతరం డిజిటైజేషన్ చేయడం బీఎల్వోల బాధ్యత అని స్పష్టం చేశారు.
ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ముఖ్యంగా పెదవేగి మండలంలో నిర్దేశించిన గడువులోగా ఫారాల పంపిణీ, డిజిటైజేషన్ పూర్తి చేయని సిబ్బందిపై చర్యలకు ప్రతిపాదనలు పంపాలని తహసీల్దార్కు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సమీక్ష సమావేశంలో తహసీల్దార్ సీహెచ్. హేమ ప్రసాద్, ఎంపీడీవో ఎం. నాగేంద్ర కుమార్, బీఎల్వోలు, సూపర్వైజర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.