పశ్చిమ గోదావరిలో వాణిజ్య పన్నుల వసూళ్లకు కలెక్టర్ నాగరాణి కఠిన ఆదేశాలు.. రూ.543 కోట్ల లక్ష్యంపై ఫోకస్
పశ్చిమ గోదావరి జిల్లాలో వాణిజ్య పన్నుల వసూళ్లను మరింత వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. వశిష్ట సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 2026-27 ఆర్థిక సంవత్సరానికి జిల్లాకు ప్రభుత్వం రూ.543.02 కోట్ల వాణిజ్య పన్నుల లక్ష్యాన్ని నిర్దేశించినట్లు వెల్లడించారు.
గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు నిర్దేశించిన రూ.485 కోట్ల లక్ష్యానికి 85.41 శాతం వసూళ్లు సాధించగా, వృత్తి పన్ను వసూళ్లలో 86.72 శాతం సాధనతో రాష్ట్రంలో జిల్లా తొమ్మిదో స్థానంలో నిలిచిందని పేర్కొన్నారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృత్తి పన్ను, వ్యాట్ బకాయిలు, పాత చలాన్ల ద్వారా భారీ వసూళ్ల లక్ష్యాలు నిర్దేశించబడిన నేపథ్యంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రతి శాఖ నెలవారీ నివేదికలను తప్పనిసరిగా సమర్పించాలని, వసూళ్లు లేకున్నా నిల్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు.
జీఎస్టీ అమలులో భాగంగా నకిలీ సంస్థలు, ఉనికిలో లేని పన్ను చెల్లింపుదారులపై ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పలు సంస్థలపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. జిల్లాలో కొత్తగా జీఎస్టీ, వృత్తి పన్ను నమోదులు పెరుగుతున్నాయని, విద్యాసంస్థలు, బంగారం వ్యాపారులు, రిసార్టులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు.
మార్చి–ఏప్రిల్ 2026 మధ్య జిల్లాలో రూ.3.67 కోట్ల బకాయిలు వసూలు చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో ఆదాయ వృద్ధికి పన్ను వసూళ్లే కీలకమని, లక్ష్య సాధనలో అధికారులు పూర్తి సమన్వయంతో ముందుకు సాగాలని ఆమె స్పష్టం చేశారు.