అన్న విగ్ర‌హంపై అంత అలుసెందుకో...?

✍️
Janamonline న్యూస్ డెస్క్
తెలుగు వార్తలు — నిజంగా, నిర్భయంగా

ఎన్టీఆర్ విగ్ర‌హ‌పునఃప్ర‌తిష్టాప‌న‌పై టిడిపి నేత‌ల అనాస‌క్తి..!

ఇత‌ర పార్టీ నేత‌ల విగ్ర‌హాలు పునఃప్ర‌తిష్టించినా..

అన్న విగ్ర‌హానికి మోక్షం లేదు..!

బాప‌ట్ల ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారో..?

జిల్లా టిడిపి తీరుపై త‌మ్ముళ్ల ఆగ్ర‌హం...!

బాప‌ట్ల‌, మే 11ః ఆంధ్రుల ఆరాధ్య‌దైవం, తెలుగువారు అన్న‌గా పిలుచుకునే దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు విగ్ర‌హ పునఃప్ర‌తిష్ట‌పై బాప‌ట్ల తెలుగుదేశం పార్టీ అనాస‌క్తిగా వ్య‌వ‌హ‌రించ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు కార‌ణ‌మ‌వుతోంది. పార్టీని స్థాపించి 9 నెల‌ల్లోనే అధికారంలోకి తెచ్చిన ఎన్టీఆర్‌కు జిల్లా తెలుగుదేశం పార్టీ త‌గిన గౌర‌వం ఇవ్వ‌క‌పోవ‌డంపై తెలుగు త‌మ్ముళ్లు మండిప‌డుతున్నారు. బాప‌ట్ల‌లోని జీబీసీ రోడ్డు విస్త‌ర‌ణ ప‌నుల స‌మ‌యంలో గ‌త వైకాపా ప్ర‌భుత్వం ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని అక్క‌డ నుంచి తొల‌గించింది. ఎన్టీఆర్‌తో పాటు మిగ‌తా విగ్ర‌హాల‌ను కూడా తొల‌గించింది. అయితే..మిగ‌తా విగ్ర‌హాల‌ను ఆయా పార్టీల‌కు చెందిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు తిరిగి ప్ర‌తిష్టించ‌గా తెలుగుదేశం వ్య‌వ‌స్థాప‌కుడైన ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని మాత్రం తెలుగు త‌మ్ముళ్లు ఇంత వ‌ర‌కూ ప‌ట్టించుకోలేదు. గ‌తంలో వైకాపాకు భ‌య‌ప‌డి అక్క‌డ విగ్ర‌హాన్ని పునఃప్ర‌తిష్టించ‌లేద‌నుకున్నా..ఇప్పుడు అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లు అవుతున్నా..ఎన్టీఆర్ విగ్ర‌హానికి ముసుగెందుకు తీయ‌లేద‌ని సామాన్య కార్య‌క‌ర్త ప్ర‌శ్నిస్తున్నాడు. అన్ని పార్టీల‌కు చెందిన నేత‌ల విగ్ర‌హాల‌ను వారు పునఃప్ర‌తిష్టించుకుంటే..ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఎందుకు అలా వ‌దిలేశారు..? దీనిపై బాప‌ట్ల తెలుగుదేశం నేత‌లు ఎవ‌రూ స్పందించ‌డం లేదు. పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడి విగ్రహ పునః ప్ర‌తిష్ట‌పై అంత అలుసెందుకు... ఆయ‌న బొమ్మ పెట్టుకుని ఎంత మందో ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాజ్య‌స‌భ స‌భ్యులు, మంత్రులు, మేయ‌ర్లు, కార్పొరేట‌ర్లు, అయ్యారు. ఆయ‌న బొమ్మ‌తోనే ప‌ద‌వులు సంపాదించుకుని..త‌ద్వారా వంద‌ల‌కోట్లు సంపాదించుకున్నారు. ఆయ‌న వ‌ల్ల అంత వృద్ధిలోకి వ‌చ్చిన నాయ‌కులు, ఇప్పుడు ఆయ‌న బొమ్మ‌పై అంత అనాస‌క్తిని ఎందుకు చూపిస్తున్నారు? ఎన్నిక‌లు వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఆయ‌న బొమ్మ‌కావాలా..? ఎన్నిక‌లు లేన‌ప్పుడు..ఆయ‌న అవ‌స‌రం లేదా..? అస‌లు మిగ‌తా పార్టీ నేత‌లు వారి వారి నేత‌ల విగ్ర‌హాల‌ను పునఃప్ర‌తిష్టించుకుంటుంటే..బాప‌ట్ల తెలుగుదేశం పార్టీ ఏమి చేస్తుంది..? చోద్యం చూస్తుందా??

ఎమ్మెల్యే ఏమి చేస్తున్నారు..?

గ‌త ఎన్నిక‌ల్లో తెలుగుదేశం పార్టీ త‌రుపున బాప‌ట్ల నుంచి గెలిచిన ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ తీరుపై సామాన్య కార్య‌క‌ర్త‌లు, ఎన్టీఆర్ అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. గెలిచి రెండేళ్లు అయినా..ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఎందుకు పునఃప్ర‌తిష్టంచ‌లేదు..? ఎందుకు ఎమ్మెల్యే చొర‌వ తీసుకోలేద‌నే ప్ర‌శ్న వారి నుంచి వ‌స్తోంది. ఈ విష‌యంలో జిల్లా టిడిపి నేత‌లు కూడా స‌రిగా స్పందించ‌డం లేద‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. ఇప్ప‌టికైనా..ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని పునఃప్ర‌తిష్టించాల‌ని, దీనికి ఎమ్మెల్యే చొర‌వ తీసుకోవాల‌ని, ఎన్టీఆర్ అభిమానులు, టిడిపి కార్య‌క‌ర్త‌లు, సానుభూతిప‌రులు కోరుకుంటున్నారు.