రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల‌ను చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు ఫైన‌ల్ చేశారా..!?

04, Mar 2026

రానున్న రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో కూట‌మి త‌రుపున అభ్య‌ర్థుల‌ను ఫైన‌ల్ చేశారా..? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. నిన్న ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుతో డిప్యూటీ సిఎం, జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ సుధీర్ఘంగా స‌మావేశం అయ్యారు. ఈ స‌మావేశంలో త‌న శాఖ‌కు సంబంధించిన అంశాల‌తో పాటు, రాజ్య‌స‌భ ఎన్నిక‌ల గురించి కూడా చ‌ర్చించిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. ముఖ్యంగా ఏ పార్టీకి ఎన్ని స్థానాలు, బిజెపికి ఈసారి సీటు కేటాయించాలా..?  లేదా అనేదానిపై కూడా చ‌ర్చ జ‌రిగిన‌ట్లు స‌మాచారం. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌లు భేటీ త‌రువాత బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు మాధ‌వ్ కూడా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడిని క‌లిశారు. వారిద్ద‌రి మ‌ధ్య ఈ విష‌యంపై చ‌ర్చ జ‌రిగిందో లేదో తెలియ‌దు. వాస్త‌వానికి బిజెపి రాష్ట్ర అధ్య‌క్షుడు త‌మ పార్టీకి రాజ్య‌స‌భ స్థానం క‌ల్పించమ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబును అడిగే అవ‌కాశం లేదు. కేంద్ర పెద్ద‌లైన అమిత్‌షా లేక ప్ర‌ధాని మోడీ ఈ విష‌యంలో జోక్యం చేసుకుంటారు. త‌మ పార్టీ త‌రుపున ఎవ‌రినైనా అభ్య‌ర్థిగా పెట్టాల‌న‌కుంటే..వారు నేరుగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో మాట్లాడ‌తారు. అయితే..ఈసారి రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో త‌మిళ‌నాడుకు చెందిన బిజెపి నేత‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచి ఎంపిక చేస్తార‌నే ఊహాగానాలు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో వెలువ‌డుతున్నాయి. ఇది ఎంత వ‌ర‌కు నిజం అవుతుందో తెలియ‌దు. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌రిగిన రెండు రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో బిజెపికి రెండు స్థానాలు ఇచ్చారు. అయితే..ఈసారి బిజెపికి ఒక్క స్థానం కూడా క‌ల్పించ‌వ‌ద్ద‌ని టిడిపి కార్య‌క‌ర్త‌లు, నేత‌లు కోరుకుంటున్నారు. ఈసారి మూడు స్థానాలు టిడిపికి, ఒక స్థానం జ‌న‌సేన‌కు ఇస్తే బాగుంటుంద‌నే అభిప్రాయం పార్టీ నేత‌ల్లోనూ, పార్టీ హార్ట్‌కోర్ కార్య‌కర్త‌ల్లోనూ వ్య‌క్తం అవుతోంది. అయితే...బిజెపిపెద్ద‌లు కోరితే ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కాద‌నే ప‌రిస్థితి లేదు. 

నిన్న‌టి చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ల భేటీ త‌రువాత రాజ్య‌స‌భ అభ్య‌ర్ధుల ఎంపిక ఖ‌రారు అయింద‌నే స‌మాచారం మీడియాలో వ‌స్తోంది. జ‌న‌సేన‌కు ఒక స్థానం క‌ల్పించార‌ని, మిగ‌తా మూడు స్థానాల్లో టిడిపికి రెండు, బిజెపికి ఒక‌టి ఇచ్చే అవ‌కాశం ఉంద‌నే ప్ర‌చారం సాగుతోంది. కాగా జ‌న‌సేన త‌రుపున లింగ‌మ‌నేని ర‌మేష్‌, కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుతో పాటు మ‌రో రెండు మూడు పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. కాపు స‌మాజిక‌వ‌ర్గానికి ఈసారి రాజ్య‌స‌భ సీటు ఇవ్వాల‌నే వాద‌న జ‌న‌సేన‌లో ఉంది. ప్ర‌స్తుతానికి జ‌న‌సేన త‌రుపున ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు అత్యంత స‌న్నిహితుడైన‌ లింగ‌మ‌నేని ర‌మేష్ అభ్య‌ర్థిత్వం దాదాపు ఖ‌రారు అయింద‌నే ప్ర‌చారం ఉంది. అయితే..కాపు వ‌ర్గానికి చెందిన వారికి ఇవ్వాల‌ని కాపు నేత‌లు కోరుతుండ‌గా, టిడిపి త‌రుపున సానా స‌తీష్ రాజ్య‌స‌భ‌కు వెళ్ల‌డం ఖాయ‌మైనందున, ఆయ‌న కాపు కోటాను భ‌ర్తీ చేస్తున్నార‌ని, జ‌న‌సేన త‌రుపున లింగ‌మ‌నేనికి ఖాయ‌మైందంటున్నారు. ఇది ఇలా ఉండ‌గా టిడిపికి ద‌క్కే రెండు సీట్ల కోసం భారీ పోటీ నెల‌కొని ఉంది. సానా స‌తీష్ ఖ‌రారు త‌రువాత రెండో సీటు ఎవ‌రికి ఇస్తార‌నే దానిపై ర‌క‌ర‌కాలైన ఊహాగానాలు పార్టీలో నెల‌కొంటున్నాయి. ముఖ్యంగా క‌మ్మ వ‌ర్గానికి చెందిన వారి నుంచి డిమాండ్ భారీగా ఉంది. అయితే..జ‌న‌సేన నుంచి క‌మ్మ‌వ‌ర్గానికి చెందిన వారు రాజ్య‌స‌భ వ‌స్తూండ‌డంతో..టిడిపి నుంచి కూడా అదే వ‌ర్గానికి ఇవ్వ‌ర‌నే వాద‌న ఉంది. అయితే..పార్టీ క‌ష్ట‌కాలంలో ప‌నిచేసిన క‌మ్మ‌వ‌ర్గానికి న్యాయం చేయాల‌నే డిమాండ్లు ఆ వ‌ర్గం నుంచి వ‌స్తున్నాయి. ఇదే నిజ‌మైతే.. గుంటూరుకు చెందిన ప్ర‌ముఖ విద్యావేత్త‌తో పాటు, గుంటూరు మాజీ పార్ల‌మెంట్ స‌భ్యుడొక‌రు రేసులో ఉంటారు. వీరిలో ఒక‌రికి ఆ సీటు ద‌క్క‌వ‌చ్చు. కాగా..బీసీ, ఎస్సీ స‌మాజిక వ‌ర్గాల‌కు చెందిన వారు కూడా రేసులో ఉన్నారు. అయితే..నిన్న చంద్ర‌బాబుతో ప‌వ‌న్‌క‌ళ్యాణ్ భేటీ త‌రువాత ఈ లెక్క‌లు తారుమారు అవుతాయ‌నే ప్ర‌చారం ఉంది.మొత్తం మీద చంద్ర‌బాబు, ప‌వ‌న్‌లు రాజ్య‌స‌భ అభ్య‌ర్థుల‌పై ఒకే మాట‌పైకి వ‌చ్చార‌ని, త్వ‌ర‌లో దీనిపై ప్ర‌క‌ట‌న ఉంటుందంటున్నారు. 


(0)
(1)

Comments