సుధీర్ఘ క‌లెక్ట‌ర్ల స‌మావేశాల‌తో చంద్ర‌బాబుకు లాభ‌మా...? న‌ష్ట‌మా..?

13, Mar 2026

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఆధ్వ‌ర్యంలో ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి జ‌రిగే క‌లెక్ట‌ర్ల కాన్పిరెన్స్ రికార్డులు సృష్టిస్తోంది. ఆయ‌న ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించే ఈ స‌మావేశాల‌పై కొంద‌రు ఆక్షేప‌ణ‌లు, విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా మ‌రి కొంద‌రు మాత్రం స‌మ‌ర్థిస్తున్నారు. ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి ఎందుకీ క‌లెక్ట‌ర్ల స‌మావేశాలు అని కొంద‌రు విమ‌ర్శ‌లు చేస్తున్నారు. మూడు నెల‌ల్లో ఏమి మారిపోతుంది..? క‌లెక్ట‌ర్లు ఏమైనా సూప‌ర్‌మ్యాన్‌లా...?  వారిని, మంత్రుల‌ను, శాఖాధిప‌తుల‌ను  కూర్చోబెట్టి ప‌దే ప‌దే వివిధ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని ఆర్డ‌ర్‌పై ఆర్డ‌ర్ వేస్తే ఏమొస్తుంద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. గంట‌ల కొద్ది కూర్చోబెట్టి.. స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని వాళ్ల‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. వాస్త‌వానికి ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప‌లు  స‌మ‌స్య‌లు సొమ్ముల‌తో ముడిప‌డి ఉన్నాయి. ఏ జిల్లాలోనైనా ఏదైనా స‌మ‌స్య ప‌రిష్క‌రించాలంటే.. ఆ జిల్లా క‌లెక్ట‌ర్ త‌ల‌చుకుంటే ఆ స‌మ‌స్య ప‌రిష్కారం కాదు. అందుకు అవ‌స‌ర‌మైన నిధులు  కావాలి. ఆ నిధులు కోసం ఆయా జిల్లా క‌లెక్ట‌ర్లు రాష్ట్ర ప్ర‌భుత్వం వైపు చూస్తుంటారు. కానీ  రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌ద్ద సొమ్ములేమీ మూల్గ‌డం లేదు. ఏరోజుకు ఆ రోజు బండిని అప్పుల‌తో నెట్టుకొస్తున్నారు. అల‌వికాని సంక్షేమ ప‌థ‌కాల‌తో రాష్ట్ర ఖ‌జానా దివాలా అంచుల‌కు చేరింది. ఇలా దివాలా అంచుల‌కు చేర‌డంలో గ‌త ప్ర‌భుత్వమే కార‌ణం అని అనుకున్నా..ఈ పాల‌కులు కూడా వారిని మించి సంక్షేమం అంటూ అప్పులు చేస్తూ..ఆర్థిక ప‌రిస్థితిని మ‌రింత సంక్షోభంలోకి నెడుతున్నారు. ఇప్పుడు  ప్ర‌తి రోజూ  అప్పుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రిజర్వ్ బ్యాంక్  త‌లుపు త‌ట్టాల్సిందే. అలా కాని ప‌క్షంలో..ప్ర‌భుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే ప‌రిస్థితి లేదు. ల‌క్ష‌ల కోట్ల పెండింగ్ బిల్లులు ఆర్థిక‌శాఖ నుంచి శాఖ‌ల మ‌ధ్య గింగ‌రాలు తిరుగుతున్నాయి.  ఈ ప్ర‌భుత్వం వ‌చ్చి దాదాపు రెండేళ్లు కావ‌స్తున్నా...కొన్నిశాఖ‌ల్లోని ఉద్యోగుల‌కు జీతాలు మొద‌టి వారంలో రావ‌డ‌మే గ‌గ‌నం అవుతోంది. ఇటువంటి  ప‌రిస్థితుల్లో శాఖాధిప‌తుల‌ను, క‌లెక్ట‌ర్లును కూర్చోబెట్టుకుని మీరు అది చేయాలి..? ఇది చేయాలి... ఇంత ప్ర‌గ‌తి కావాలి..? ఇన్ని ర్యాంకులు కావాలంటే....వాళ్లేమి చేస్తారు. ప్ర‌భుత్వం ప్ర‌స్తావించే ప్ర‌తి విష‌య‌మూ నిధుల‌తో కూడుకున్న‌దే. ఇటువంటి ప‌రిస్థితుల్లో వాళ్ల‌ను గంట‌ల కొద్ది కూర్చోబెట్టుకుని చేసేదేముంద‌న్న ప్ర‌శ్న ప‌లువురు రాజ‌కీయ‌, అధికార వ‌ర్గాల నుంచి వ‌స్తోంది. అయితే..గ‌త వైకాపా ప్ర‌భుత్వం వ‌లే..స‌మ‌స్య‌ల‌ను గాలికి వ‌దిలేయ‌కుండా..ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటోంది అనే భావ‌న వ్య‌క్తం కావ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డుతుంది. మూడు నెల‌ల క్రితం ప్ర‌స్తావించిన అంశాల‌పై పురోగ‌తి,నిధులతో ప‌నిలేని స‌మ‌స్య‌ల గురించి మాత్రం ఇది చ‌క్క‌గానే ఉప‌యోగ‌ప‌డుతోంది. 




జ‌గ‌న్ తీరు ఇది...!

గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో ముఖ్య‌మంత్రిగా జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి క‌లెక్ట‌ర్ల స‌మావేశాల‌ను పెద్ద‌గా నిర్వ‌హించ‌లేదు. ఆయ‌న ముఖ్య‌మంత్రి అయిన తొలినాళ్ల‌లో ఉండ‌వ‌ల్లిలోని ప్ర‌జావేదిక‌లో క‌లెక్ట‌ర్ల స‌మావేశం నిర్వ‌హించి క‌లెక్ట‌ర్ల‌కు దిశాద‌శ‌ను నిర్దేశించారు. అయితే..ఆయ‌న క‌లెక్ట‌ర్ల స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌య‌మే పెను వివాదానికి దారి తీసింది. ఆయ‌న పాల‌న ఎలా ఉండ‌బోతుందో..తెలియ‌చేయ‌డానికి అదో ఉదాహ‌ర‌ణ‌లా నిలిచింది. ఆ త‌రువాత ఆయ‌న పెద్ద‌గా క‌లెక్ట‌ర్ల స‌మావేశాల‌ను నిర్వ‌హించ‌లేదు. అయితే..ఆయ‌న ఇలా క‌లెక్ట‌ర్ల స‌మావేశాల‌ను గంట‌ల కొద్ది నిర్వ‌హించ‌క‌పోయినా..అధికార వ్య‌వ‌స్థ‌పై మాత్రం ఆయ‌న గ‌ట్టి ప‌ట్టే చిక్కింది. ఆయ‌న అనుకున్న ప‌ని క్ష‌ణాల్లో అధికారులు అప్ప‌ట్లో ఆయ‌న‌కు చేసిపెట్టారు. ఆయ‌నేమి కోరుకుంటున్నారో..అది నిమిషాల‌పై చేసి అప్ప‌ట్లో అధికారులు ఆయ‌న‌ను మెప్పించారు. 


చంద్ర‌బాబును మాయ‌చేస్తున్నారా..? 

ఆయ‌న‌తో పోల్చుకుంటే..ఇప్ప‌టి ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు ఇంకా అధికారుల‌పై ప‌ట్టే చిక్క‌డం లేదు. చంద్ర‌బాబు ఆదేశాల‌ను అధికారులు సీరియ‌స్‌గా తీసుకోరు. గంట‌ల కొద్ది ఇచ్చే ఉప‌న్యాసాల‌పై అనాస‌క్తి వ్యక్తం చేస్తూ త‌మ‌కు తోచిందే చేసుకుంటూపోతున్నారు కొంద‌రు అధికారులు. ఆయ‌న అడిగిన‌ప్పుడు అంతా బాగుందంటూ..మ‌సిపూసి మారేడు కాయ చేస్తుంటారు. వంద‌శాతం సంతృప్తి, 80శాతం సంతృప్తి అంటూ..ఆయ‌న‌ను అధికారులు బోల్తా కొట్టిస్తుంటారు. దీంతో..అంతా బాగుంది..త‌న క‌లెక్ట‌ర్ల కాన్పిరెన్స్  వ‌ల్ల ప్ర‌జ‌లంద‌రూ సుఖాల‌ల్లో తేలిపోతున్నార‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు భావిస్తుంటూ ఉంటారు. కాగా..ఇలా గంట‌ల కొద్ది స‌మావేశాలు ఏమిటంటూ కొంద‌రు అధికారులు లోలోన అసంతృప్తిని వ్య‌క్తం చేస్తున్నారు. నిన్న‌టికి నిన్న నిర్వ‌హించిన క‌లెక్ట‌ర్ల స‌మావేశాలు బుధ‌వారం ఉద‌యం ప‌ది గంట‌ల‌కు ప్రారంభ‌మై..శుక్ర‌వారం రాత్రి దాదాపు ప‌దిగంట‌ల‌కు ముగించారు. రెండు రోజుల పాటు అధికార వ్య‌వ‌స్థ మొత్తం అమ‌రావ‌తిలోనే స్థంభించిపోయింది. గంట‌ల‌కొద్ది నిర్వ‌హించిన ఈ స‌మావేశాల‌తో ఫ‌లితాలు ఎలా వ‌స్తాయో..ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు తెలుసో తెలియ‌దో..కానీ కొంద‌రు అధికారులు మాత్రం ఈయ‌న మార‌రు. 2014-19 మ‌ధ్య‌లో కూడా ఇలానే స‌మావేశాలు గంట‌ల కొద్ది నిర్వ‌హించి చివ‌ర‌కు చేతులు కాల్చుకున్నారు.. ఇప్పుడూ అదే ప‌రిస్థితి నెల‌కొంటుంద‌ని, ఆయ‌న‌కు చెప్పేవారు లేర‌నే కొంద‌రు అంటున్నారు. గ‌తంలో ఇదే రీతిలో ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తే..జ‌గ‌న్ చాప‌కింద నీరులా అన్ని వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టి, న‌మ్మించి చంద్ర‌బాబును ఘోరంగా ఓడించారు. రైలు ద‌హ‌నం చేసి..కులాల‌ను రెచ్చ‌గొట్టినా..కోడిక‌త్తితో తానే దాడి చేయించుకుని చంద్ర‌బాబు చేయించార‌ని ప్ర‌చారం చేయించినా..చివ‌ర‌కు స్వంత బాబాయిని ఆయ‌న బంధువులే హ‌త్య చేస్తే..దాన్ని చంద్ర‌బాబు మీద‌కు తోసేస్తే..ఈయ‌న స‌మీక్ష‌లు, స‌మావేశాలంటూ కాలం గ‌డిపార‌ని, ఇప్పుడూ అదే పున‌రావృతం అవుతుంద‌ని, ఇలాంటి మార‌థాన్ స‌మావేశాల వ‌ల్ల లాభాల‌కంటే...న‌ష్టాలే ఎక్కువ‌ని రాజ‌కీయ ప‌రిశీల‌కులు అంటున్నారు. 


(2)
(0)

Comments