సార్వత్రిక ఎన్నికల దాకా లడ్డూ వివాదం సాగుతుందా...!?
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి కల్తీ లడ్డూ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఇదో నిత్య వివాదంగా మారుతోంది. ఒకరేమో..లడ్డూలో కల్తీ జరిగిందని వాదిస్తుండగా, ప్రతిపక్ష వైకాపా లడ్డూలో జంతు కొవ్వు కలవలేదని వాదిస్తోంది. దీనిపై దర్యప్తు చేస్తోన్న దర్యాప్తు సంస్థలు మాత్రం కల్తీ జరిగిన మాట నిజమేనని, అయితే..జంతు కొవ్వు అవశేషాలు ఎంత మాత్రం ఉన్నాయని దృవీకరించలేమని చెప్పింది. దీంతో రెండు పక్షాల మధ్య తిరుమల లడ్డూపై రోజుకో వివాదం, వాదనలు జరుగుతున్నాయి. ఈ వివాదంపై పైచేయి సాధించడానికి కూటమి ప్రభుత్వం, ప్రతిపక్ష వైకాపా రెండూ..నిత్యం ఘర్షణ పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు పైచేయిసాధించడానికి ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. మీరు ద్రోహులు అంటే మీరు ద్రోహులు అంటూ.. విమర్శలు, ఆరోపణలు చేసుకుంటున్నారు. దీంతో..తిరుమలలో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు. పరమపవిత్రమైన తిరుమల దేవస్థానం రాజకీయాలకు కేంద్రంగా మారుతోందా..? అనే ప్రశ్న సామాన్య ప్రజల నుంచి, సామాన్య భక్తుల నుంచి వ్యక్తం అవుతోంది. అధికార కూటమి ప్రభుత్వం వైకాపా హయంలో తిరుమల దేవదేవుడిని అపకీర్తిపాలు చేశారని, అవినీతికి పాల్పడ్డారని, దేవుడిని అడ్డుపెట్టుకుని అరాచకం చేశారని విమర్శలు గుప్పిస్తుండగా, ప్రతిపక్ష వైకాపా మాత్రం తాము అన్నీ సవ్యంగానే చేశామని, తమ అంత శుద్దపూసలు ఎవరూ లేరని దబాయిస్తోంది. అయితే..కల్తీ జరిగిన మాట నిజమేనని దర్యాప్తు సంస్థలు చెబుతున్నా..వైకాపా దబాయింపుతో..అధికార పక్షాన్ని ఆత్మరక్షణలోకి నెడుతోంది. తాజాగా వైకాపా టీటీడీ ఛైర్మన్ నాయుడిపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఓ వీడియో విడుదల చేసింది. దీంతో..నిన్నటి దాకా...వైకాపా వాళ్లే చెడ్డవారని అనుకుంటున్న పరిస్థితుల్లో టీటీడీ ఛైర్మన్‌పై వచ్చిన వీడియో భక్తులను, సామాన్య ప్రజలను ఆలోచనలో పడేసింది. వాళ్ళకూ వీళ్లకు పెద్ద తేడా లేదనే భావన వ్యక్తం అవుతోంది.
వాస్తవానికి 2024 ఎన్నికల్లో టిడిపి కూటమి ఘనవిజయం సాధించిన తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబునాయుడు తన కూటమి ఎమ్మెల్యేల సమావేశంలో మాట్లాడుతూ వైకాపా హయాంలో తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారని ఆరోపించారు. దీంతో ప్రపంచంలోని దేవదేవుని భక్తులతో పాటు, సామాన్య ప్రజలు నివ్వెరపోయి ఆగ్రహంతో రగిలిపోయారు. ముఖ్యమంత్రి ప్రకటనతో వైకాపా ఆత్మరక్షణలో పడింది. అయితే..వెంటనే తేరుకుని కూటమిపై ఎదురుదాడి చేసింది. ప్రభుత్వం నియమించిన సిట్‌పై తమకు నమ్మకం లేదని, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని డిమాండ్‌చేసింది. వారు కోరిన విధంగానే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతోంది. సుప్రీంకోర్టు నియమించిన దర్యాప్తు సంస్థే తిరుమల లడ్డూలో కల్తీ ఉందని, ఒక్క చుక్క నెయ్యి లేకుండా తిరుమల లడ్డూను వైకాపా హయాంలో తయారుచేశారని ఆక్షేపించింది. అయితే..దర్యాప్తు సంస్థ మధ్యంతర నివేదికతో వైకాపా ఇబ్బందులకు గురికావాల్సింది. కానీ ఆశ్చర్యకరంగా ఆ పార్టీ ఎదురుదాడి చేస్తూ కూటమిని ఆత్మరక్షణలోకి నెట్టింది. దీని కోసం వారు ఎదురుదాడినే అస్త్రంగా ఎంచుకున్నారు. లడ్డూలో కల్తీ ఉంది కానీ..చంద్రబాబు చెప్పినట్లు జంతుకొవ్వులేదని, చంద్రబాబు భక్తుల మనోభావాలతో ఆడుకుంటున్నారని, ఆయనే దేవదేవుడికి అపరాధం చేస్తున్నారని విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తోంది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రెండు పక్షాల మధ్య పోస్టర్‌వార్ నడిచింది. ఈ సందర్భంలోనే వైకాపానేత అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల వివాదం కావడం, ఆయన ఇంటిపై టిడిపి నేతలు దాడి చేయడం..తరువాత కాపు నేతపై టిడిపి నేతలు దాడి చేస్తున్నారని, ఆయనను చంపేందుకు యత్నిస్తున్నారంటూ..వైకాపా యాగీ చేయడం మొదలెట్టింది. తిరుమల వివాదం కాస్తా...కులరాజకీయంగా మారింది. అయితే..ఈ వివాదం సాగకుండా కూటమి ప్రభుత్వం మళ్లీ అసెంబ్లీలో తిరుమల లడ్డూ వివాదాన్ని ప్రస్తావించి వైకాపాను మళ్లీ లడ్డూ వివాదంలోకి తెచ్చింది. అయితే..వైకాపా శాసన మండలిలో లడ్డూ వివాదంపై చర్చకు వస్తామంటూ..పేర్కొంటూ అక్కడ హడావుడి చేస్తున్నారు. ఇంతలో టీటీడీ ఛైర్మన్ వ్యక్తిగత విషయాలను చర్చకు తీసుకువచ్చి..పైచేయిసాధించేందుకు యత్నిస్తోంది. వారు బయటపెట్టిన విషయాల్లో ఎంత నిజం ఉందో కానీ..ఇప్పుడైతే...టిడిపి కూటమిని కొంత వరకూ అడ్డుకోగలిగిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా..ఈ లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పట్లో ముగియదనే భావన రాజకీయ పరిశీలకుల్లో వ్యక్తం అవుతోంది. దీన్ని ఎన్నికల అంశంగా మార్చాలనే ఉద్దేశ్యం అధికార కూటమిలో కనిపిస్తున్నట్లుంది. 2024 ఎన్నికల తరువాత కూటమి తనకు కల్తీ లడ్డూ అంశం లడ్డూలా దొరికిందనే భావనలో ఉంది. దీనిలో జగన్ బృందం చేసిన అరాచకాన్ని సాక్ష్యాలతో బయటపెడితే..వచ్చే ఎన్నికల్లో లబ్ది కలుగుతుందనే ఆశతో ఉంది. రాష్ట్రంలో ఉన్న హిందువుల మనోభావాలతో జగన్ బృందం ఎలా ఆడుకుందో..భక్తులకు వివరంగా వివరిస్తే..గత ఎన్నికల్లో జగన్‌కు ఓటు వేసిన హిందువులు మళ్లీ జగన్‌కు ఓటువేయరని, దీన్ని సమర్థవంతంగా వచ్చే ఎన్నికల వరకూ లాగాలనే ఎత్తుగడ కూటమిలో ఉంది. పైగా మాజీ సిఎం, వైకాపా అధ్యక్షుడైన జగన్మోహన్‌రెడ్డి జన్మతా క్రైస్తవుడు. క్రైస్తువుడైన ఆయన హిందువుల పట్ల చిన్నచూపు చూస్తున్నారని, హిందూదేవుళ్ల విషయంలో ఆయన అపరాధానికి పాల్పడ్డారని కూటమి నేతలు మరో మూడేళ్లపాటు ఆధారాలతో చెప్పగలిగితే..వారికి లబ్ది చేకూరవచ్చు. అయితే..జగన్మోహన్‌రెడ్డితో వ్యవహారం అంత ఈజీగా ఉండదు. స్వంత బాబాయిని ఆయన బంధువులే హత్య చేస్తే..దాన్ని కాసేపు గుండెపోటు..తరువాత నారా సుర రక్తచరిత్ర అంటూ..ప్రజలను నమ్మించగలిగారు. మరి ఇప్పుడు మెజార్టీ ఓట్లు పోతాయంటే ఆయన చూస్తూ ఊరుకుంటారా..? దర్యాప్తు సంస్థలు ఆయన నేరం చేశారని చెప్పినా..ఎదురుదాడి చేసి..నెగ్గుకు రాగలడు. గత రెండేళ్లుగా ఆయన చేస్తోన్న ఎదురుదాడికి కూటమికి చుక్కలు కనిపిస్తున్నాయి. తప్పు చేసి కూడా ఆయన చేస్తోన్న యాగీ కూటమిని నివ్వెరపాటుకు గురిచేస్తోంది. జగన్‌ను సమర్థవంతంగా ఎదుర్కోకుండా...ఈ లడ్డూ వ్యవహారాన్ని వచ్చే ఎన్నికల వరకూ కూటమి లాగాలని ప్రయత్నిస్తే..అది వారికే ఎదురుదెబ్బ కావచ్చు. లడ్డూ కల్తీ విషయంలో కానీ, ఇతర విషయాల్లో కానీ..చంద్రబాబు ఆయన బృందం నిక్కచ్చిగా వ్యవహరిస్తే..వారికి లబ్ది చేకూరింది. అంతే కానీ..చేద్దాం..చూద్దాం..అంటే..మళ్లీ 2019 ఫలితాలకు సిద్దంగా ఉండాల్సిందే...!