ద‌క్షిణాది హీరో రేవంత్‌రెడ్డి...!

18, Apr 2026

ఒక‌ప్పుడు ఒక మండ‌ల స్థాయి నేత ఆయ‌న‌. త‌రువాత జ‌డ్‌పిటిసి అనంత‌రం ఎమ్మెల్సీ...ఆ త‌రువాత ఎమ్మెల్యే, త‌రువాత ఏకంగా ముఖ్య‌మంత్రి...ఇప్పుడు...ఆ స్థాయి కూడా దాటిపోయే రీతిలో ఆయ‌న ఒక్క‌సారిగా ద‌క్షిణాది హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. వామ‌నుడు..ఇంతింత అంటూ ఆకాశమంత విస్త‌రించిన రీతిలో తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి త‌న ఖ్యాతిని విస్త‌రించుకుంటున్నారు. తాజాగా జ‌రిగిన లోక్‌స‌భ డీలిమిటేష‌న్‌, సీట్ల పెంపుపై ఆయ‌న వ్య‌వ‌హ‌రించిన తీరు ఆయ‌న‌ను ద‌క్షిణాది హీరోగా నిల‌బెట్టాయ‌న‌డంలో ఎటువంటి సందేహం లేదు. కేంద్ర ప్ర‌భుత్వం మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుతో పాటు, డిలిమిటేష‌న్‌, లోక్‌స‌భ సీట్లు పెంపు బిల్లు తెస్తుంద‌నే మాట రాగానే..దీనిలో బిజెపి కుట్ర ఉంద‌ని, ఈ బిల్లు వ‌ల్ల ద‌క్షిణాదికి న‌ష్టం జ‌రుగుతుంద‌ని తొలిసారి నోరెత్తింది తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డే.  కేంద్రం తెస్తోన్న ఈ బిల్లు వ‌ల్ల తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, కేర‌ళ‌, క‌ర్ణాట‌క‌తో పాటు పుదుచ్చేరిలు న‌ష్ట‌పోతాయ‌ని ఆయ‌న బ‌హిరంగంగా ధ్వ‌జ‌మెత్తారు. బిజెపి ప్ర‌భుత్వం కుట్ర‌పూరితంగా, ద‌క్షిణాదికి అన్యాయం చేస్తోంద‌ని ఆయ‌న వాదించారు. ఒకేసారి 50శాతం సీట్ల పెంపు స‌మ్మ‌తం కాద‌ని, దీని వెనుక బిజెపి ఉద్దేశ‌పూర్వ‌క కుట్ర ఉంద‌ని, ఇది ద‌క్షిణాదికి న‌ష్టం చేకూరుస్తుంద‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు. జ‌నాభా నియంత్ర‌ణ‌లో ముందున్న ద‌క్షిణాది ఈ 50శాతం సీట్ల పెంపుతో న‌ష్ట‌పోతుంద‌ని, ఇప్పుడు తెస్తోన్న డిలిమిటేష‌న్ ఉత్త‌రాదివారికే లాభం క‌లుగుతుంద‌ని, ముఖ్యంగా ఉత్త‌రాది పార్టీ అయిన బిజెపి దీని ద్వారా భారీగా ల‌బ్దిపొందుతుంద‌ని ఆయ‌న వాదించారు. ద‌క్షిణాదితో సంబంధం లేకుండా ఉత్త‌రాదిలోని సీట్ల‌తోనే అధికారంలోకి రావాల‌నే త‌లంపుతో ఈ సీట్ల పెంపును బిజెపి ప్ర‌భుత్వం తెస్తుంద‌ని, ఇది భార‌త‌దేశానికి న‌ష్ట‌మ‌ని, ముఖ్యంగా రాబోయే రోజుల్లో ద‌క్షిణాదికి భారీ న‌ష్టం చేకూరుస్తుంద‌ని ఆయ‌న ప‌దే ప‌దే చెప్పారు. ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌తో సంబంధం లేకుండా ఉత్త‌రాది వారి ఓట్ల‌తోనే ఢిల్లీలో అధికారం చేజిక్కించుకుంటార‌ని, అప్పుడు ద‌క్షిణాది ప్ర‌జ‌ల‌ను వారు చిన్న‌చూపు చూస్తార‌ని, రాజ్యాధికారంలో ద‌క్షిణాది వారికి భాగం ఉండ‌ద‌న్న ఆయ‌న ఆలోచ‌ణ‌కు ద‌క్షిణాది నుంచి బాగానే మ‌ద్ద‌తు వ‌చ్చింది. బిజెపి ఇప్ప‌టికే ద‌క్షిణాదిపై స‌వ‌తి ప్రేమ చూపుతోంద‌ని, ఇక్క‌డ నుంచి వ‌చ్చే నిధుల్లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌కు మేళ్లు చేస్తోంద‌ని, దీన్ని అడ్డుకోవాల‌ని ఆయ‌న ఇత‌ర పార్టీల నేత‌ల‌కు లేఖ‌లు రాశారు. నిన్న లోక్‌స‌భ‌లో ఈ బిల్లు వీగిపోవ‌డంతో..ఇప్పుడు రేవంత్‌రెడ్డిపై ద‌క్షిణాదిలో ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది.  సీట్ల పెంపుపై అంద‌రి క‌న్నా ముందే వాద‌న‌లు వినిపించిన‌, దాన్ని అడ్డుకోవ‌డానికి ఆయ‌న చేసిన ప్ర‌య‌త్నాల‌పై ఆయ‌న‌కు ద‌క్షిణాదిలో  మంచి మైలేజ్ వ‌చ్చింది.

ద‌క్షిణ‌భార‌త‌దేశంలో బ‌ల‌మైన నాయ‌కులైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు ఈ విష‌యంలో ఎన్‌డిఏ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించాల్సి వ‌చ్చింది. ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందే ఎన్‌డిఏతో పొత్తు పెట్టుకోవ‌డంతో ఆయ‌న‌కు ఎన్‌డిఏ నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్టే అవ‌కాశం లేదు. అయితే..మిగ‌తా నాయ‌కుల్లో వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి బిజెపిని స‌మ‌ర్థించి అప్ర‌దిష్ట‌పాల‌య్యారు. ఆయ‌నేమీ ఎన్‌డిఏలో భాగ‌స్వామి కాదు. ద‌క్షిణాదికి జ‌రుగుతోన్న అన్యాయంపై ఆయ‌న గొంతెత్తాల్సింది. కానీ..ఆయ‌న త‌న‌పై ఉన్న కేసుల భ‌యంతో బిజెపి తెచ్చిన ఈ బిల్లుకు మ‌ద్ద‌తు ఇచ్చి..ద‌క్షిణాదిలో విమ‌ర్శ‌లు కొని తెచ్చుకున్నారు. ద‌క్షిణాదిలో మ‌హామ‌హులైన రాజ‌కీయ‌నేత‌లు ఉన్నా..రేవంత్‌రెడ్డి ఈ ర‌కంగా వెలుగులోకి రావ‌డం..నిజంగా ఆయ‌న స‌రైన స‌మ‌యంలో తీసుకున్న నిర్ణ‌యాలే కార‌ణం. ఒక‌ప్పుడు తెలంగాణ‌ను పాలించిన కెసిఆర్ దేశ‌మొత్తాన్ని ఏకంగా చేస్తాన‌ని, ఢిల్లీ పీఠంపై జెండా ఎగురేస్తాన‌ని, తెలంగాణ సొమ్మ‌లు మ‌హారాష్ట్ర, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, బీహార్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఇలా ప‌లు రాష్ట్రాల్లో వెద‌జ‌ల్లి త‌న వ్య‌క్తిగ‌త ప్రాబ‌ల్యం పెంచుకునేందుకు తీవ్రంగా య‌త్నించారు. అప్ప‌ట్లో ఆయ‌న త‌న వ్య‌క్తిగ‌త ప్ర‌తిష్ట‌పెంచుకునేందుకు భారీగా ప్ర‌భుత్వ నిధులు ఖ‌ర్చు చేయ‌గా, ఇప్పుడు రేవంత్‌రెడ్డి అటువంటిదేమీ చేయ‌కుండా ద‌క్షిణాది ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న భ‌యాందోళ‌న‌లను బ‌హిరంగంగా వ్య‌క్తం చేయ‌డం, కేంద్ర నిర్ణ‌యాన్ని త‌ప్పుప‌ట్ట‌డంతో..ఒక్క‌సారిగా ద‌క్షిణాది ప్ర‌జ‌ల దృష్టిలో హీరోగా మారారు. కేంద్ర ప్ర‌భుత్వ తెచ్చిన డిలిమిటేష‌న్‌, సీట్ల పెంపు ఇప్పుడు ఆగిపోవ‌డంతో ఒక్క‌సారిగా రేవంత్‌రెడ్డి ప్ర‌తిష్ట పెరిగిపోయింది. ద‌క్షిణాది రాజ‌కీయ నాయ‌కుల్లో ఆయ‌న ఇమేజ్ పెరిగిపోతోంది. ఒక‌ప్పుడు సాదా సీదా రాజ‌కీయ‌నాయ‌కుడిగా ముద్ర‌ప‌డ్డ ఆయ‌న తెలుగుదేశం పార్టీలో ఎదిగి ఎమ్మెల్యే అయిన ఆయ‌న త‌రువాత మారుతున్న రాజ‌కీయ ప‌రిస్థితుల‌ను అంచ‌నా వేసి, కాంగ్రెస్‌లో చేర‌డం..అక్క‌డ డ‌క్కామొక్కీలు తిని తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు అవ‌డం, బ‌ల‌మైన కెసిఆర్ అండ్ ఫ్యామిలీని రాజ‌కీయంగా ఎండ‌గ‌ట్ట‌డంతో ఆయ‌న తెలంగాణ కాంగ్రెస్‌లో నాయ‌కుడిగా ఎదిగారు. వ‌చ్చిన అవ‌కాశాన్ని బ‌లంగా వాడుకుని ముఖ్య‌మంత్రి స్థానానికి ఎగ‌బాకారు. ఆయ‌న‌కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి అప్ప‌నంగా వ‌చ్చింద‌ని, అది లాట‌రీలో త‌గిలింద‌ని బిఆర్ఎస్ పార్టీ కార్య‌నిర్వ‌హ‌క అధ్య‌క్షుడు కెటిఆర్ ఎద్దేవా చేసేవారు. ఆయ‌న ప‌ద‌వి ఈ రోజో..రేపో ఊడిపోతుంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించేవారు. కాంగ్రెస్‌లో కూడా చాలా మంది నాయ‌కులు అదే త‌ర‌హా వ్యాఖ్య‌లు చేసేవారు. అయితే రేవంత్‌రెడ్డి సిఎం ప‌ద‌వి ద‌క్కించుకున్న రోజు నుంచి ఇంకా వేగంగా ఎదుగుతూనే ఉన్నారు. ఒక‌ప్పుడు తెలంగాణ‌లో కెసిఆర్ త‌ప్ప‌..మ‌రో నాయ‌కుడు లేని ప‌రిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు కెసిఆర్ కంటే..రేవంత్ ప్ర‌తిష్ట మ‌రింత‌గా ఎదుగుతోంది. కెసిఆర్ మాట‌ల మ‌నిషి కాగా..రేవంత్‌రెడ్డి మాట‌ల‌..చేత‌ల మ‌నిషిగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా ఇప్పుడు ఆయ‌న తీసుకున్న ఈ నిర్ణ‌యం ఆయ‌న‌ను ద‌క్షిణాదిలో ఒక పేరున్న నేత‌గా గుర్తింపు తెచ్చిపెట్టింది. 


(1)
(0)

Comments