నెల్లూరులో టిడిపి బలహీన పడుతోందా...!?
గత సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టిడిపి ఊహించిన ఫలితాలు సాధించింది. ఆ పార్టీ నేతలే ఊహించని విధంగా జిల్లాలోని 10కి పది సీట్లు గెలుచుకుని టిడిపి చరిత్ర సృష్టించింది. అప్పుడెప్పుడో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు, తరువాత 1994లో టిడిపి ఇక్కడ స్వీప్ చేసింది. అటువంటి మ్యాజిక్‌నే రెండేళ్ల క్రితం జరిగిన ఎన్నికల్లో టిడిపి మళ్లీ సాధించింది. గత ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపితో పొత్తు పెట్టుకుని పోటీ చేసి ఈ ఫలితాలను సాధించింది. అయితే ఇక్కడ ఏ ఒక్క సీటును టిడిపి తన మిత్ర పక్షాలకు ఇవ్వకపోవడం విశేషం. జిల్లాలో ఉన్న పదికి పది స్థానాల్లో టిడిపి అభ్యర్థులే ఎన్నికల్లో పోటీ చేసి పదికి పది గెలిచి చరిత్ర సృష్టించారు. అయితే ఇదంతా చరిత్ర. ప్రస్తుతానికి వస్తే...జిల్లాలో పరిస్థితి ఏమిటనే దానిపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి.
రెండేళ్ల క్రితం పరిస్థితులు ఇప్పుడు అక్కడలేవని వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా కొందరు ఎమ్మెల్యేల పనితీరు, మంత్రుల పనితీరు బాగా లేదని చెబుతున్నారు. టిడిపి క్షేత్రస్థాయి కార్యకర్తలు కూడా అదే అంటున్నారు. పనిచేసిన టిడిపి కార్యకర్తలను ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదని, వైకాపా నుంచి పార్టీలో చేరిన వారికే పనులు చేసి పెడుతున్నారనే ప్రచారం ఉంది. అప్పుడూ వాళ్లే..ఇప్పుడూ వాళ్లే అంటూ..అసలైన టిడిపి కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండేళ్ల క్రితం పార్టీని అధికారంలోకి తేవడానికి ఆస్తులు అమ్ముకుని, కేసులు పెట్టించుకుని, జైళ్లకు వెళ్లిన వారిని ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదని వారు అంటున్నారు. కాగా గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవని, వైకాపా నుంచి టిడిపిలోకి వచ్చిన కొందరు పెద్దరెడ్లు ఇప్పుడు మళ్లీ జగన్‌వైపు వెళ్లడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిలో నిజమెంతో తెలియదు కానీ..ఒక పద్దతి ప్రకారం ఈ ప్రచారాన్ని జోరుగా చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఒక బడా నాయకుడు జగన్‌కు టచ్‌లోకి వెళ్లారని వీళ్లు ప్రచారం చేస్తున్నారు. ఆయన మళ్లీ జగన్ వైపు చేరతారని, ఆయన చేరితే నెల్లూరులో టిడిపి మళ్లీ పట్టుకోల్పోతుందని ప్రచారం చేస్తోన్నవాళ్లు చెబుతున్నారు.
వాస్తవానికి 2019 ఎన్నికల్లో కానీ, 2014 ఎన్నికల్లో కానీ, 2009,2004 ఎన్నికల్లో కానీ టిడిపి ఈ జిల్లాలో పెద్దగా సాధించింది ఏమీ లేదు. 1999 తరువాత ఈ జిల్లాలో టిడిపి బలహీన పడుతూ వస్తోంది. ఇలా బలహీనపడడానికి సంస్థాగత కారణాలు కొన్ని కాగా, సామాజికవర్గ కారణాలు కూడా ఉన్నాయి. అత్యంత బలహీనంగా ఉన్న టిడిపి 2024లో ఒక్కసారిగా జూలువిదిల్చి వైకాపాను భారీ దెబ్బ కొట్టింది. ఇలా దెబ్బ కొట్టడానికి ఆ బడానేతే కారణమని, ఆయనను మళ్లీ జగన్ మచ్చిక చేసుకుంటున్నారని, ఆయనను మళ్లీ వైకాపాలోకి తీసుకువస్తే..వైకాపాపుంజుకుంటుందని ఆ దశగా జగన్ యత్నిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇది ఇలా ఉంటే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఎవరిదోవ వాళ్లదే అన్నట్లు వ్యవహరిస్తున్నారని, వీరి వల్ల పార్టీ బలహీనం అవుతుందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. మరో వైపు ఎమ్మెల్యేల అవినీతి హద్దులు దాటిందని, ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఆయన వారిని హెచ్చరించారని, ఇప్పటికైనా పద్దతి మార్చుకోవాలని కోరారని ప్రచారం సాగుతోంది. అదే విధంగా సంక్షేమ పథకాలన్నీ అమలు కాకపోవడం ఇక్కడ జనాలపై బాగానే ప్రభావం చూపుతోంది. జగన్ ఉన్నప్పుడు పథకాలు వచ్చాయని, ఇప్పుడు రావడం లేదనే ప్రచారాన్ని వైకాపా హోరెత్తిస్తోంది. కూటమి ప్రభుత్వం తాను చెప్పిన సంక్షేమ పథకాలను బాగానే అమలు చేస్తోన్నా ఒక పద్దతి ప్రకారం వైకాపా నెగిటివ్ ప్రచారాన్ని జోరుగా చేస్తోంది. మొత్తం మీద రెండేళ్ల తరువాత ఇక్కడ టిడిపి బలహీనపడుతోందనే భావన సగటు టిడిపి కార్యకర్తల్లో, నాయకుల్లో వ్యక్తం అవుతోంది.