ముంబాయిపై ఢిల్లీ ఘన విజయం
సమీర్ రిజ్వీ అద్భుత అర్థ సెంచరీ
ఢిల్లీ, మార్చి 04ః ముంబాయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఈ రోజు జరిగిన ఐపిఎల్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్ ఘన విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబాయి ఇండియన్స్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత రెండు పరుగులకే కె.ఎల్.రాహుల్ వికెట్ కోల్పోయింది. ఆ వెంటనే నితీష్ రాణాను బుమ్రా రనౌట్ చేయడంతో ఢిల్లీ 7 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే..నిషాంకా, సమీర్ రిజ్వీ ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టారు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 66 పరుగులు సాధించారు. ముంబాయి తురుపు ముక్క బుమ్రాను జాగ్రత్తగా ఆడుకుంటూ వీరిద్దరూ మరో వికెట్ పడకుండా సంయమనం పాటిస్తూ ఇన్నింగ్స్‌ను నడిపించారు. బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన మొదటి రెండు ఓవర్లలో అతను కేవలం 7 పరుగులు మాత్రమే ఇచ్చాడు. బుమ్రాను గౌరవించిన ఢిల్లీ బ్యాటర్లు మిగతా బౌలర్లపై దాడి చేస్తూస్కోరును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో నిషాంకా 30 బంతుల్లో 6 ఫోర్లు, ఒక సిక్స్‌తో 44 పరుగులు సాధించి ఢిల్లీ విజయానికి బాటలు వేశాడు. అయితే మరో ఎండ్‌లో ఉన్న సమీర్ రిజ్వీ ఎడెపెడా ఫోర్లు, సిక్స్‌లతో విరుచుకుపడ్డాడు. అతను 51 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90 పరుగులు చేశాడు. రిజ్వీ బ్యాటింగ్‌తో ఢిల్లీ ఘనవిజయం సాధించింది. మొత్తం మీద ఢిల్లీ 18.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ముందు టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ముంబాయికి మొదట్లో ఎదురుదెబ్బ తగిలింది. ముంబాయి రికెల్టన్ 9 పరుగులకు, తిలక్‌వర్మ జీరోకు వెంట వెంటనే ముఖేష్‌కుమార్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో..ముంబాయి కష్టాల్లో పడింది. అయితే రోహిత్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ముంబాయిని ఆదుకున్నారు. వీరిద్దరూ తొలుత ఆచితూచి ఆడినా తరువాత టాప్ గేర్‌కు వెళ్లారు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ 26 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్‌తో 35 పరుగులు సాధించి అక్షర్‌పటేల్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. తరువాత వచ్చిన రూథర్‌ఫోర్ట్ ముఖేష్‌కుమార్ పట్టిన ఒక అద్భుత క్యాచ్‌కు వెనుదిరిగాడు. అయితే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మూడు ఫోర్లు, రెండు సిక్స్‌లతో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అర్థ సెంచరీ పూర్తి అయిన వెంటనే అతను నిగిడి బౌలింగ్‌లో ఎల్‌బిడబ్య్లు అయ్యాడు. తరువాత నామ్ థినార్, శాంటర్న్, కార్బిన్ తలో చేయి వేయడంతో ముంబాయి ఇండియన్ 6 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. కాగా ఢిల్లీ బౌలర్లలో ముఖేష్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన ముఖేష్‌కుమార్ 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్, నిగిడి, నిగమ్,నటరాజన్ తలో వికెట్ తీశారు. ఢిల్లీ బౌలర్లు ఒక ప్రణాళిక ప్రకారం అద్భుతంగా బౌలింగ్ చేశారు. కాగా రెండు మ్యాచ్‌లు ఆడిన ముంబాయి ఇండియన్స్‌కు ఇది మొదటి ఓటమి. కాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఈ సీజన్‌లో ఇది రెండో గెలుపు.