మావిగ‌న్‌తో కొత్త చిక్కులు...!

04, Apr 2026

మాజీ ముఖ్య‌మంత్రి, వైకాపా అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి అనాలోచితంగా చేశారో..ఒక వ్యూహ‌త్మ‌కంగా చేశారో కానీ ఆయ‌న చేసిన మావిగ‌న్ వ్యాఖ్య‌లు సంచ‌ల‌నం సృష్టిస్తున్నాయి. ఆయ‌న వ్య‌తిరేకుల‌కు ఇది ఒక అనాలోచిత‌, వ్యంగ్యాత్మ‌కం కాగా..ఆయ‌నను అభిమానించే వారు కొంద‌రు ఆయ‌న వ్యాఖ్య‌లను స‌మ‌ర్ధిస్తున్నారు. రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తిని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం లోక్‌స‌భ‌లో విభ‌జ‌న బిల్లుకు స‌వ‌ర‌ణ చ‌ట్టం చేయ‌డానికి స‌మావేశ‌మైన సంద‌ర్భంలో ఇక్క‌డ తాడేప‌ల్లిలో వైకాపా అధినేత వై.ఎస్‌.జ‌గ‌న్ ఎంపిక చేసిన జ‌ర్న‌లిస్టుల‌తో మీడియా స‌మావేశాన్ని నిర్వ‌హించి...అమ‌రావ‌తిలో రాజ‌ధాని నిర్మించాలంటే..రెండు ల‌క్ష‌ల కోట్లు అవుతాయ‌ని, అలా కాకుండా మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరుల‌ను కేంద్రంగా తీసుకుని రాజ‌ధానిని నిర్మించుకుంటే రాష్ట్రానికి త‌క్కువ ఖ‌ర్చుతో రాజ‌ధాని ఏర్ప‌డుతుంద‌ని, దీనికి కావాలంటే మావిగ‌న్ అనే పేరును పెట్టుకోవ‌చ్చ‌ని, అలా  కాకుంటే ఇంకేదైనా పేరు పెట్టుకోండ‌ని ఒక స‌ల‌హా ఇచ్చారు. అయితే..ఇన్నాళ్లూ మూడు రాజ‌ధానులే త‌మ విధాన‌మ‌ని చెప్పిన వైకాపా ఇప్ప‌డు చేస్తోన్న కొత్త ప్ర‌తిపాద‌న‌ల‌పై మిశ్ర‌మ స్పంద‌న వ్య‌క్తం అవుతోంది. అంత‌రంగిక స‌మావేశాల్లో జ‌గ‌న్ పార్టీ నాయ‌కులే ఆయ‌న చేసిన ప్ర‌తిపాద‌న‌ను విమ‌ర్శిస్తున్నారు. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌త్య‌ర్థులు ఆయ‌న‌ను సోష‌ల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో జ‌గ‌న్‌ను విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు. జ‌గ‌న్ చేసిన ప్ర‌తిపాద‌న హాస్యాస్ప‌ద‌మ‌ని, ఆయ‌నకు ముందుచూపు లేద‌ని, ఎవ‌రైనా ఇలా చేస్తారా..?  రాజ‌ధానిపై ప‌దే ప‌దే మాట మారుస్తారా..? అంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. అధికారంలో ఉన్న ఐదేళ్లూ మూడు రాజ‌ధానులంటూ..మూడు ముక్క‌లాట ఆడార‌ని, ఇప్పుడు మ‌రో కొత్త ప్ర‌తిపాద‌న తెస్తున్నార‌ని, ఇదెక్క‌డి విడ్డూర‌మంటూ విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. 

వాస్త‌వానికి జ‌గ‌న్ రాజ‌ధాని విష‌యంలో ప‌దే ప‌దే మాట‌లు మారుస్తున్నారు. రాష్ట్ర విభ‌జ‌న స‌మ‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు న్యూయార్క్ న‌గ‌రం కంటే పెద్ద న‌గ‌రం రాజ‌ధానిగా ఉండాల‌ని, తాను అధికారంలోకి వ‌స్తే..అటువంటి న‌గ‌రాన్ని నిర్మిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అయితే...ఆయ‌న అప్ప‌ట్లో అధికారంలోకి రాలేదు. అధికారంలోకి వ‌చ్చిన టిడిపి ప్ర‌భుత్వం రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తిని ప్ర‌తిపాదిస్తే..అప్ప‌ట్లో ప్ర‌తిప‌క్షంలో ఉన్న జ‌గ‌న్ దీనికి స‌మ్మ‌తించారు. ప్రాంతాల మ‌ధ్య చిచ్చు పెట్ట‌డం ఇష్టం లేక‌..రాజ‌ధాని అమ‌రావ‌తిని అంగీక‌రిస్తున్నాను అంటూ..అప్ప‌ట్లో ఆయ‌న అసెంబ్లీలో ప్ర‌క‌టించారు. అంతే కాదు..తాను అమ‌రావ‌తిలోనే ఇళ్లు క‌ట్టుకున్నాన‌ని, ఇక్క‌డే కాపురం చేస్తున్నాన‌ని ఆయ‌న చెప్పుకున్నారు. ఇదే త‌న పార్టీ నాయ‌కుల‌తో చెప్పించారు. అయితే 2019 ఎన్నిక‌ల్లో గెలిచిన త‌రువాత ఆయ‌న మాట మార్చారు. రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఉండాలంటూ..అమ‌రావ‌తి శాస‌న‌రాజ‌ధాని, విశాఖ‌ప‌ట్నం కార్య‌నిర్వ‌హ‌క‌రాజ‌ధాని, క‌ర్నూలు న్యాయ‌రాజధాని అని ప్ర‌క‌టిస్తూ..అమ‌రావ‌తిలో ఉన్న స‌చివాల‌యాన్ని విశాఖ‌కు త‌ర‌లించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే..అప్ప‌ట్లో రాజ‌ధాని రైతులు చేసిన ఉద్య‌మం, కోర్టుల తీర్పుతో జ‌గ‌న్ ప్ర‌య‌త్నాలు ఫ‌లించ‌లేదు. త‌రువాత జ‌రిగిన ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ ఘోరంగా ఓడిపోయారు. 

ఓడిపోయిన త‌రువాత కూడా ఆయ‌న త‌న తీరును మార్చుకోలేదు. రాజ‌ధానిగా అమ‌రావ‌తి వ‌ద్ద‌ని, మ‌చిలీప‌ట్నం, విజ‌య‌వాడ‌, గుంటూరులు క‌లిపి (మావిగ‌న్‌) పేరుతో కొత్త రాజ‌ధానిని నిర్మించాల‌ని ఆయ‌న ప్ర‌తిపాద‌న‌లు చేస్తున్నారు. దీంతో రాజ‌ధాని వ్య‌వ‌హారంలో జ‌గ‌న్ చిత్త‌శుద్దితో వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే అనుమానం సామాన్య ప్ర‌జ‌ల‌తో పాటు, ఆయ‌న పార్టీ నాయ‌కులకూ వ‌స్తోంది. ఒక‌సారి అమ‌రావ‌తి, మ‌రోసారి విశాఖ‌ప‌ట్నం, ఇప్పుడు మావిగ‌న్‌..ఏమిటి..ఇదంతా అని వారు ప్ర‌శ్నించుకుంటున్నారు. నిన్న‌టి దాకా..మూడు రాజ‌ధానుల‌ని, ఉత్త‌రాంధ్ర వెనుక‌బ‌డ్డ ప్రాంత‌మ‌ని, అక్క‌డ రాజ‌ధాని ఉంటే..అక్కడి ప్ర‌జ‌లు అభివృద్ది చెందుతార‌ని చెప్పిన వైకాపా ఇప్పుడు మావిగ‌న్ పేరుతో హ‌డావుడి చేస్తోంది. ఇప్ప‌టికే రాజ‌ధానుల పేరిట రాజ‌కీయాలు జ‌రుగుతోన్న ప‌రిస్థితుల్లో జ‌గ‌న్ తీసుకు వ‌చ్చిన మావిగాన్ మ‌రి కొన్ని చిక్కులు తెచ్చి పెడుతోంది. ఇప్ప‌టికైనా..రాజ‌కీయాలు మాని, వాస్త‌వ ప‌రిస్థితుల ఆధారంగా రాజ‌ధాని విష‌యంలో జ‌గ‌న్ చిత్త‌శుద్దితో నిర్ణ‌యాలు తీసుకోవాల‌ని సామాన్య ప్ర‌జ‌లు కోరుకుంటున్నారు. 


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE