జనసేనకు 70 అసెంబ్లీ సీట్లు...!?
దేశ వ్యాప్తంగా చట్టసభ సీట్ల సంఖ్య పెంచడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పుడు ఉన్న సభ్యుల సంఖ్యకు 50శాతం పెంచడానికి కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. లోక్‌సభ, అన్ని రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు ఈ దమాషాలో పెరగబోతున్నాయి. దేశ వ్యాప్తంగా రాజకీయ, అధికార, సామాన్య ప్రజానీకం దీనిపై చర్చించుకుంటోంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఇప్పుడు ఉన్న 175 స్థానాలు 263కి పెరుగుతాయంటున్నారు. దీనితో చట్టసభలకు కొత్తవారు ఎంపికయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మహిళల ప్రాధాన్యం కూడా పెరగనుంది. 33శాతం మహిళా రిజర్వేషన్లు అమలు అవుతాయని కేంద్రం స్పష్టం చేస్తోంది. ఇదంతా 2029 ఎన్నికలకు ముందే చేయడానికి తద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే దీన్ని అమలు చేయబోతున్నారు. భారీగా పెరుగుతోన్న నియోజకవర్గాల్లో రాజకీయ నాయకుల్లో నూతనోత్సాహం నింపుతోంది. ఇది ఇలా ఉంటే..ఆంధ్రప్రదేశ్‌లో గత ఎన్నికల్లో కలిసిపోటీ చేసిన టిడిపి, జనసేన, బిజెపి పార్టీలు వచ్చే ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని చెబుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూటమి వచ్చే పదిహేను ఏళ్లు కలిసే ఉంటుందని, కూటమితోనే రాష్ట్ర అభివృద్ది సాధ్యమని చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రాబోయే ఎన్నికల్లో ఆయన కూటమితో కలిసి వెళితే ఎన్నిసీట్లు తీసుకుంటారేదానిపై రాజకీయవర్గాల్లో భారీ చర్చ జరుగుతోంది.
2024 ఎన్నికల్లో జగన్మోహన్‌రెడ్డి ఓటమే ధ్యేయంగా ఆయన పనిచేశారు. అప్పట్లో టిడిపి, జనసేన, కూటమి పొత్తులో ఆయన కీలకంగా వ్యవహరించారు. జగన్ ఓటమి కోసం ఆయన చాలా త్యాగాలుచేశారు. తన పార్టీ సీట్లను భారీగా తగ్గించుకున్నారు. బలమైన కాపు సామాజికవర్గం అండ ఉన్న ఆయనను కనీసం 50సీట్లు కోరాలని, 50సీట్లకు తక్కువైతే పొత్తు వద్దని అప్పట్లో ఆయనపై ఆయన సామాజికవర్గానికి చెందిన వారు భారీగా ఒత్తిడి తెచ్చారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడానికి త్యాగాలు చేయాల్సిన అవసరం లేదంటూ..వారు పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే..పవన్ కళ్యాణ్ వారి వలలో పడకుండా జగన్‌ను ఓడించడానికి తన సీట్లను తగ్గించుకుని కొన్ని బిజెపికి కేటాయించారు. దాంతో అప్పట్లో పొత్తు సూపర్ హిట్ అయి 164 స్థానాలు కొట్టింది. అయితే...ఇప్పుడు అందంతా చరిత్ర. మరి రాబోయే 2029 ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్న పరిస్థితుల్లో ఆయన ఎన్నిసీట్లు కోరాతరానే దానిపై ఇప్పుడే చెప్పలేం కానీ..ఆయన పార్టీకి చెందిన వారిలో, ఆయన పార్టీ సానుభూతిపరుల్లో భారీ చర్చ జరుగుతోంది.
70సీట్లకు తగ్గేదే లేదు...!
కాగా వచ్చే ఎన్నికల్లో కూటమితోనే జనసేన వెళితే 70 అసెంబ్లీ సీట్లు, 10 పార్లమెంట్ స్థానాలు కావాలని డిమాండ్ చేసే పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం 21 మంది ఎమ్మెల్యేలు ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో కనీసం 70స్థానాల్లో పోటీ చేయాలని వారు కోరుకుంటున్నారు. అదీ కాక వచ్చే ఎన్నికల్లో కూటమి గెలిస్తే పవన్‌ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్‌నూ వారి పెట్టబోతున్నారు. అయితే..ముఖ్యమంత్రి సంగతి అలా ఉంచితే..ఎన్నిసీట్లు వస్తాయనే దానిపైనే ప్రధానంగా దృష్టి ఉంది. నిన్న డీలిమిటేషన్ ప్రకటన వచ్చిన తరువాత ఒక హోటల్‌లో పవన్ కళ్యాణ్ తన పార్టీ నేతలతో సమావేశమైనప్పుడు డీలిమిటేషన్ గురించి ప్రస్తావించారు. తాను గతంలో చెప్పినట్లే..జరిగిందని వచ్చే ఎన్నికల్లో మనకు ఎక్కువ స్థానాలు వస్తాయని దీనిపై పార్టీ నాయకులు అవగాహన పెంచుకోవాలని చెప్పారు. గతంలో పొత్తు వల్ల మేలు జరిగిందని, చేసిన త్యాగాలకు గుర్తింపు వచ్చిందని, పార్టీకి భవిష్యత్తులో మంచి మైలేజ్ వస్తుందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జనసేన కనీసం 70 స్థానాల్లో పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. కాగా మరి కొందరు జనసేన సానుభూతిపరులు తమకు వందసీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా డిలిమిటేషన్ పక్రియ ఇప్పుడే మొదలైంది కనుక..దీనిపై వచ్చే మూడేళ్లు రకరకాలైన చర్చలు జరుగుతూనే ఉంటాయి.