లోకేష్ తప్పు దిద్దుకుంటున్నారా...?
టిడిపి భవిష్యత్తు నాయకుడు, ఐటి, విద్యాశాఖ మంత్రి తాను చేసిన కొన్ని తప్పులను దిద్దుకుంటున్నారా.. ? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత ఎన్నికలకు ముందు కార్యకర్తలకే తాను పెద్దపీట వేస్తానని, వాళ్ల సమస్యలను పట్టించుకుంటానని, కార్యకర్తే పార్టికి ప్రాణమని చెప్పి, ఎన్నికల్లో కార్యకర్తలను ఉత్సాహపరిచి భారీ విజయాన్ని నమోదు చేసుకున్నారు. అయితే..పార్టీ గెలిచిన తరువాత వారిని పట్టించుకోవడం లేదని, వారిని దరి చేరనీయడం లేదని, వారికి పనులు చేయడం లేదని, విలువ ఇవ్వడం లేదనే ప్రచారం జోరుగా జరిగింది. ఈ రెండేళ్లలో జరిగిన కొన్ని సంఘటనలు కూడా దానికి దోహదం చేశాయి. పార్టీ కార్యకర్తలకే విలువ ఇస్తానన్న లోకేష్ పాలనలో అధికారుల మాటకే పెద్దపీట వేస్తున్నారనే విమర్శలు వచ్చాయి. పొలిటికల్ పాలన ఉంటుందని చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు దాన్ని విస్మరించి అధికారుల చేతిలో కీలు బొమ్మలా మారారని, ఎంత సేపూ కలెక్టర్ల కాన్ఫిరెన్స్, సమీక్షలు, సమావేశాలంటూ..కాలం వెల్లబుచ్చుతున్నారు తప్ప పార్టీని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు పార్టీ వర్గాల నుంచి బలంగా వచ్చాయి.
ముఖ్యంగా ఎన్నో త్యాగాలు చేసిన కార్యకర్తలు పట్టించుకోవడం లేదని, ఏ కార్యాలయానికి వెళ్లినా వైకాపా సానుభూతిపరులైన అధికారులే ఉంటున్నారని, ఇప్పటికీ వైకాపా నాయకులకు, కార్యకర్తలకే పనులు అవుతున్నాయని వారు వాపోతున్నారు. వాస్తవానికి ఇప్పటికీ చాలా కార్యాలయాల్లో వైకాపాకు మద్దతు ఇచ్చే అధికారులే పెత్తనం చేస్తున్నారు. కీలక స్థానాల్లో ఉన్నవారు కూడా వైకాపాకే మద్దతు ఇస్తోన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో కూడా వైకాపా వారికే పనులు జరుగుతున్నాయని, పార్టీ కోసం పనిచేసిన వారిని విస్మరిస్తున్నారనే అభిప్రాయాలు వారిలో బలంగా ఉన్నాయి. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలను చిన్నచూపు చూస్తున్నారని, వైకాపా నుంచి వచ్చిన వారికి, సొమ్ములు ఉన్నవారికే వారు పనులు చేసి పెడుతున్నారనే విమర్శలు, ఆరోపణలు ఉన్నాయి. కొందరు మంత్రులైతే వైకాపా వారికి కొమ్ము కాస్తున్నారని, వైకాపాకు మద్దతు ఇచ్చే అధికారులను తమ కార్యాలయాల్లో నియమించుకుని వారి చేత సొమ్ములు రాబట్టుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు గడ్డుకాలంలోపనిచేసిన తమ వంటి కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని టిడిపి కార్యకర్తలు, సానుభూతిపరులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా వారిలో నిరుత్సాహం, నిర్వేదం, ఆవేదన వ్యక్తం అవుతోంది. పార్టీ గెలిచిందనే ఉత్సాహం లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాగుందనే కార్యకర్తలు, నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి ఇటీవల మంత్రి లోకేష్ చేసిన మరో పని అగ్నిఆజ్యం పోసినట్లైంది. ఆయన పార్టీ ఎమ్మెల్యేలను, వారి కుటుంబ సభ్యులను ప్రత్యేకంగా ఆహ్వానించి వారికి విందులు ఇవ్వడం పార్టీ కార్యకర్తల్లో ఒకరకమైన నిర్వేదం నెలకొంది. తాము అన్ని త్యాగాలు చేస్తే..గెలిచిన రెండేళ్లల్లో ఒక్కసారి అయినా పిలిచి బాగా పనిచేశారు..అనే మాట అన్నారా...? కనీసం పలకరించారా..? అనే మాట వారినుంచి వచ్చింది. ఎమ్మెల్యేలు, ఎంపీలకు బాగానే ఉంది. వాళ్లకు పదవులు వచ్చాయి..ఆస్తులు వస్తున్నాయి..వాళ్లు సుఖంగానే,సంతోషంగానే ఉన్నారు. కానీ కాడిమోసిన మా పరిస్థితి ఏమిటి..? అనే ప్రశ్న వారి నుంచి వస్తోంది. గ్రామస్థాయిలో, వార్డు స్థాయిలో జెండా భుజాన మోసీ మోసీ భుజాలు అరిగిపోతున్నాయి కానీ మా పరిస్థితి మారలేదంటూ వాపోతున్నారు. ఆ మధ్య ఒకరిద్దరు కార్యకర్తలు ఆర్థిక బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. అయినా పార్టీ నాయకత్వంలో మార్పు రాలేదు. ఇవన్నీ అక్షర సత్యాలు. అయితే..టిడిపి పెద్దలు జరిగిన తప్పును ఆలస్యంగానైనా గుర్తించారు.
నిన్న పార్టీ 44వ ఆవిర్భావ సందర్భంలో సీనియర్ కార్యకర్తలను పిలిచి మాట్లాడడం, వారికి విందు ఇవ్వడం పార్టీ కార్యకర్తలకు మంచి సందేశాన్ని పంపించింది. పార్టీ తమను విస్మరించలేదని, తమ అధినేత, ఆయన కుమారుడు తమను మరిచిపోలేదని వారు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తండ్రీ, కుమారుడు తమను పక్కన కూర్చోబెట్టుకుని విందు ఇవ్వడం మరిచిపోలేని విషయమని, ఏ పార్టీలోనూ ఇటువంటి పరిస్థితి ఉండదని, ఇది ఒక్క టిడిపిలోనే సాధ్యమని వారు ఉత్సాహంగా చెబుతున్నారు. ఏది ఏమైనా గత రెండేళ్ల నుంచి పార్టీ కార్యకర్తల్లో నెలకొన్న ఆవేదన,నిరుత్సాహం నిన్నటి కార్యకర్తల సమావేశంతో కొద్దిగానైనా తగ్గిందనే భావన పార్టీ నాయకుల్లో వ్యక్తం అవుతోంది. వాస్తవానికి టిడిపిలో కార్యకర్తలకే పెద్దపీట వేస్తారు. భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇలా కార్యకర్తలను పెద్దగా పట్టించుకోదు. ఏవరి దాకానో ఎందుకు అపారమైన అభిమానగణంతో ఊరేగే వైకాపా అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ఎప్పుడైనా ఇలా కార్యకర్తలను పక్కన కూర్చోబెట్టుకున్నారా..? అంటే లేదనే సమాధానం వస్తుంది. కానీ..టిడిపిలో తండ్రీ, కుమారుడు కార్యకర్తలను స్వంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటున్నారు. అయితే...ఒక్కోసారి వాళ్లు వారిని మరిచిపోయారేమో అన్నట్లు ప్రవర్తిస్తారు. దీనితో కార్యకర్తలు అలుగుతారు. నిన్న లోకేష్ అన్నట్లు అన్నలూ...అలగమాకండి... మనందరిదీ ఒకే కుటుంబం...అన్నమాటతో కార్యకర్తలు ఆయనను ఆకాశానికెత్తేస్తున్నారు. మా లోకేష్ లాంటి లీడర్ ఎక్కడా లేరంటూ ఆనందోత్సవాలను వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆలస్యంగానైనా లోకేష్ జరిగిన తప్పులను దిద్దుకుంటున్నారనే మాట పార్టీ వర్గాల నుంచి వ్యక్తం అవుతోంది.