జగన్ పాపాలను ఎండగట్టిన అసెంబ్లీ...!
రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించడం కోసం ఏర్పాటు చేసిన అసెంబ్లీ సమావేశాల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాపాలను అసెంబ్లీ సభ్యులు ఎండగట్టారు. దాదాపు మాట్లాడిన ప్రతి ఒక్క శాసనసభ్యుడు, మంత్రులు, ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడుతో సహా ప్రతి ఒక్కరూ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరును తప్పుపట్టి, ఆయన చేసిన పాపాలను ఏకరవుపెట్టారు. ముందుగా అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ జగన్ గతంలో చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకుంటాడని భావించానని, వారు 11 మంది అసెంబ్లీకి వచ్చి ఈ ప్రత్యేక చర్చలో పాల్గొంటారని భావించానని, కానీ వాళ్లకు తప్పుదిద్దుకునే ఆలోచన లేదని విమర్శించారు. స్పీకర్ తరువాత మాట్లాడిన ప్రతి ఒక్కరూ రాజధాని అమరావతికి జగన్ చేసిన దుర్మార్గాన్ని, రాజధాని రైతులు, ముఖ్యంగా మహిళల పట్ల వ్యవహరించిన తీరును మరోసారి రాష్ట్ర ప్రజలకు గుర్తుచేశారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ రాజధాని మహిళా రైతులపై నాటి జగన్ ప్రభుత్వం దుర్మార్గంగా దాడి చేసిందని, మహిళల జుట్టులపట్టుకుని ఈడ్పించందని, వారి ఉసురు జగన్‌కు తగిలి 11కు పడిపోయారని, అయినా జగన్‌లో ఇంత మాత్రమైనా మార్పు రాలేదని ఆమె విమర్శలు గుప్పించారు. జగన్ ఎన్నికలకు ముందు రాజధానిగా అమరావతిని అంగీకరించారని, ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి మూడు ముక్కలాటలు ఆడారని, ఈ సందర్భంగా రాజధాని మహిళా రైతులు చేసిన పోరాటం చరిత్రలో నిలిచిపోతుందని ఆమె వారిని ప్రశించారు.
గర్జించిన అచ్చన్న...!
ఈ చర్చలో పాల్గొన్న మంత్రి అచ్చెంనాయుడు జగన్‌పై తీవ్రస్థాయిలో దండెత్తారు. రాష్ట్రంలో ప్రాంతీయ విభేదాలు, కుల, మత విభేదాలు సృష్టించాడినికి జగన్ ప్రయత్నించాడని, ఆయన వంటి నాయకులను ఎప్పుడూ చూడలేదని, తాము అమరావతికి కట్టుబడి ఉన్నామని ప్రకటిస్తే..తమపై దాడులు చేయించారని, అయినా తాను భయపడలేదని, ప్రాంతీయ విభేదాలు సృష్టించి లాభపడదామని భావించారని, కానీ..ఆయన ఆశలను ప్రజలు తిప్పికొట్టి ఇంట్లో కూర్చోబెట్టారని విమర్శించారు. విశాఖపట్నం రాజధానిగా వస్తుందని, దానికి తాము అడ్డుపడుతున్నామని తమపై విధ్వేషాలు వెల్లగక్కారని, కానీ తాము అనుకున్నవిధంగానే రాజధాని అమరావతికి మద్దతు ఇచ్చామని, జగన్ వంటి నాయకుల వల్ల రాష్ట్రం నష్టపోతుందని, భవిష్యత్తులో ఇలాంటి అరాచకవాదుల నుంచి రక్షించేందుకే ఇప్పుడు ఈ తీర్మానం చేయాల్సి వస్తుందని ఆయన అన్నారు.
ఫోటోలతో జగన్ పాపాలను గుర్తు చేసిన లోకేష్
విద్యా,ఐటిశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ జగన్ రాజధానికి చేసిన పాపాలను మరోసారి చట్టసభ సాక్షిగా ప్రజల ముందు పెట్టారు. నాడు రాజధాని అమరావతే ఉండాలంటూ మహిళలు ఉద్యమం చేస్తోన్న సమయంలో ఓ మహిళను పోలీసులు జుట్టుపట్టుకుని ఈడుస్తోన్న చిత్రాన్ని ఆయన శాసనసభ సాక్షిగా ప్రదర్శించారు. ఆ చిత్రాన్ని చూసిన ప్రజలకు నాటి జగన్ దాష్టికాలు మరోసారి గుర్తుకు వచ్చాయి.
మనకే అన్యాయం జరుగుతోందిఃపవన్
భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది అయిన ఆంధ్రప్రదేశ్‌కే ఎక్కువ నష్టం జరుగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. మొదట మద్రాస్, తరువాత కర్నూలు, మళ్లీ హైదరాబాద్ ఇలా ఆంధ్రావాసులు ఇబ్బందులు పడ్డారని, చివరకు అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే జగన్ వంటి వారు దాన్ని అడ్డుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దార్శనికుడని, ఆయన వల్లే హైదరాబాద్ అభివృద్ది చెందిందని, ఇప్పుడు అమరావతి, ఆంధ్రప్రదేశ్ కూడా ఆయన వల్లే అభివృద్ది చెందుతుందని, అందుకే ఆయనకు మద్దతు ఇచ్చామన్నారు.
పిచ్చితుగ్లక్...!
జగన్ వంటి నాయకుడు చరిత్రలో ఉండరని, తుగ్లక్‌ను మించిపోయిన పరిపాలకుడు జగన్ అని కడప శాసనసభ్యులు మాధవీరెడ్డి విమర్శించారు. నాడు తుగ్లక్ రాజధానులను ఎలా మార్చాడో జగన్ కూడా అలానే మార్చాడని, అప్పట్లో రాజధానులను మార్చిన తుగ్లక్‌ను ప్రజలు తరిమికొట్టారని, జగన్‌ను కూడా అలానే తరిమికొట్టారని విమర్శించారు.
భస్మాసుర హస్తంఃఎమ్మెల్యే వసంత
జగన్‌ది భస్మాసుర హస్తమని తాను అప్పుడే చెప్పానని, నాడు జగన్ ప్రభుత్వంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నానని, అప్పట్లో ఆయన మూడు రాజధానుల బిల్లు తెస్తే..అప్పుడే తాను ఆ మాట అన్నానని, మూడు రాజధానులను తాను వ్యతిరేకించానని, జగన్ తీసుకున్న మూర్ఖపునిర్ణయంతో తాను విభేదించానని ఆయన అన్నారు.
మొత్తం మీద..ఈ రోజు జరిగిన ప్రత్యేక సమావేశంలో మాట్లాడిన ప్రతి ఒక్కరూ జగన్ పాపాలను మరోసారి రాష్ట్ర ప్రజలకు గుర్తు చేశారు.నాడు జరిగిన అన్యాయాలు, అక్రమాలు,నిరంకుశత్వం, దోపిడీని శాసనసభ సాక్షిగా ప్రజలకు వివరించారు. జగన్ వంటి దుర్మార్గుని భవిష్యత్తులో మరో ఛాన్స్ ఇస్తే...రాజధానిని మరోసారి మారుస్తాడని, అతని పట్ల అప్రమత్తంగా ఉండాలంటూ శాసనసభ్యులు ప్రజలకు విజ్ఙప్తి చేశారు. కాగా జగన్ చేసిన అన్యాయాల గురించి, దుర్మార్గాల గురించి గంటల కొద్ది మాట్లాడిన ప్రజాప్రతినిధులు అధికారంలోకి వచ్చిన తరువాత రాజధాని రైతులకు న్యాయంగా దక్కాల్సిన లాభాలను ఇవ్వడంలో జరుగుతోన్న జాప్యంపై మాట్లాడకపోవడం విచిత్రం.