నేడు తాడేప‌ల్లికి జ‌గ‌న్‌-అమ‌రావ‌తిపై క్లారిటీ ఇస్తారా...!?

30, Mar 2026

రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ప్ర‌తిప‌క్ష వైకాపా తీవ్ర ఇబ్బందులు ప‌డుతోంది. ఆ పార్టీ రాజ‌ధానిపై ఒక నిర్ణ‌యానికి రాలేక‌పోతోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు రాష్ట్రానికి మూడు రాజ‌ధానులు ఉండాలంటూ...చేసిన విన్యాసాలు బెడిసి కొట్ట‌డంతో..ఇప్పుడు ఈ విష‌యంలో ఏమి చేయాలో వారికి పాలుపోవ‌డం లేదు. కొంద‌రు నాయ‌కులేమో రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తుగా మాట్లాడుతుంటే..మ‌రి కొంద‌రేమో..మూడు రాజ‌ధానులే..పార్టీ స్టాండ్..వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ప్ర‌స్తుతం పార్టీలో నెంబ‌ర్ టూగా ఉన్న స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ రాజ‌ధాని అమ‌రావ‌తేన‌ని త‌మ పార్టీ స్టాండ్ అదేన‌ని, రాజ‌ధానిగా అమ‌రావ‌తేన‌ని స్ప‌ష్టం చేస్తున్నారు. అయితే..జ‌గ‌న్ మ‌రో విధంగా మాట్లాడ‌డంతో..రాజ‌ధాని విష‌యంలో వైకాపా గంద‌ర‌గోళం సృష్టిస్తూనే ఉంది. ఇటీవ‌ల జ‌గ‌న్ కొంత మంది ఎంపిక చేసిన జ‌ర్న‌లిస్టుల‌తో మాట్లాడుతూ రాజ‌ధానికి 500 ఎక‌రాలు చాలున‌ని, కొన్ని బిల్డింగ్‌లు ఉంటే స‌రిపోతుంద‌ని, ఇన్నివేల ఎక‌రాలు ఎందుకంటూ స‌న్నాయినొక్కులు నొక్కారు. ముఖ్య‌మంత్రి ఎక్క‌డ కూర్చుంటే..అదే రాజ‌ధాని అంటూ...ఆయ‌న పాత పాటే పాడారు. దీంతో..జ‌గ‌నేమీ మార‌లేద‌ని కొంద‌రు, జ‌గ‌న్ అమ‌రావ‌తే రాజ‌ధానిగా ఒప్పుకున్నార‌ని మ‌రి కొంద‌రు వ్యాఖ్య‌లు చేస్తూ గంద‌ర‌గోళం చేసుకుంటున్నారు. పార్టీ నాయ‌కుల్లోనూ దీనిపై స్ప‌ష్ట‌తలేక ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 



ఘోర‌మైన త‌ప్పు...!

మొన్న రాజ‌ధాని అమ‌రావ‌తికి చట్ట‌బ‌ద్ద‌త క‌ల్పించ‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వం ఆక‌స్మికంగా అసెంబ్లీని స‌మావేశ‌ప‌రిచింది. అయితే..ఈ స‌మావేశానికి వైకాపా స‌భ్యులు హాజ‌ర‌వ‌లేదు. రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తే అంటూ రాష్ట్ర శాస‌న‌స‌భ ఒక తీర్మానాన్ని చేసి  కేంద్రానికి పంపింది. గ‌తంలో మూడు రాజ‌ధానులు అంటూ విన్యాసాలు చేసిన వైకాపా ఈ అవ‌కాశాన్ని ఉప‌యోగించుకోవాల్సిందంటూ ఆ పార్టీ సానుభూతిప‌రులు, ఆ పార్టీలోనే రాజ‌ధాని అమ‌రావ‌తికి మ‌ద్ద‌తు ఇచ్చే వారు భావించారు. అయితే జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి మాత్రం దీన్ని ఏ మాత్రం సీరియ‌స్‌గా తీసుకోలేదు. ఆయ‌న య‌ధావిధిగా అసెంబ్లీ జ‌రుగుతున్నా బెంగుళూరు చెక్కేశారు. దీంతో..ఈ అవ‌కాశాన్ని అధికార కూట‌మి వాడేసుకుంది. జ‌గ‌న్ రాజ‌ధాని అమ‌రావ‌తికి వ్య‌తిరేక‌మ‌ని, మ‌ళ్లీ ఆయ‌న వ‌స్తే రాజ‌ధాని మారుస్తాడ‌ని, ఆయ‌న రాజ‌ధానిని మార్చ‌కుండా ఉండేందుకే రాజ‌ధానికి చ‌ట్ట‌బ‌ద్ద‌త క‌ల్పిస్తున్నామ‌ని పేర్కొంది. జ‌గ‌న్‌లో మార్పు రాలేద‌ని, ఆయ‌నకు అధికారం ఇస్తే..మ‌ళ్లీ మూడు రాజ‌ధానుల పాట పాడుతార‌ని, ఆయ‌న‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. ఈ విష‌యం ప్ర‌జ‌ల్లోకి బాగానే వెళ్లింది. అంతే కాకుండా జ‌గ‌న్ గ‌తంలో చేసిన పాపాల‌ను శాస‌స‌స‌భ సాక్షిగా అధికార కూట‌మి మ‌రోసారి ప్ర‌జ‌ల‌కు గుర్తు చేసింది.రాజ‌ధాని రైతుల‌పై జ‌గ‌న్ ప్ర‌భుత్వం చేసిన దాష్టికాల‌ను, దుర్మార్గాల‌ను వివ‌రించింది. ఇది ప్ర‌తిప‌క్ష వైకాపాకు గ‌ట్టి దెబ్బే. వాస్త‌వానికి రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో ఆ పార్టీ త‌న స్టాండ్‌ను మార్చుకున్న‌ద‌ని స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి అడ‌పాద‌డ‌పా ప్ర‌క‌టిస్తున్నారు. అయితే..దాన్ని నిరూపించుకోవ‌డానికి వ‌చ్చిన అవ‌కాశాన్ని జ‌గ‌న్ దుర్వినియోగం చేసుకున్నాడ‌ని, ఆయ‌న త‌న తీరు మార్చుకోలేద‌న‌డానికి మొన్న జ‌రిగిన అసెంబ్లీకి హాజ‌ర‌కాక‌పోవ‌డ‌మే నిద‌ర్శ‌న‌మ‌ని తేలిపోయింది.  అసెంబ్లీకి హాజ‌రై అమ‌రావ‌తి విష‌యంలో స్ప‌ష్ట‌త ఇస్తే.. రాజ‌ధాని ప్రాంతంలో వైకాపాపై ఉన్న వ్య‌తిరేక‌త కొంతైనా త‌గ్గిపోయేదేమోన‌ని, కానీ..జ‌గ‌న్ దాన్ని వినియోగించుకోలేద‌నే భావ‌న  ఆపార్టీలోనూ వ్య‌క్తం అవుతోంది. కాగా ఈరోజు బెంగుళూరు నుంచి తాడేప‌ల్లికి వ‌స్తోన్న జ‌గ‌న్ రాజ‌ధాని అమ‌రావ‌తిపై ఏమైనా స్ప‌ష్ట‌త ఇస్తారేమో చూడాలి. ఎంపిక చేసిన జ‌ర్న‌లిస్టుల‌తో మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి, రాజ‌ధానిపై త‌న పార్టీ స్టాండ్ ఇస్తార‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. రాజ‌ధాని అమ‌రావ‌తిపై కేంద్రం త్వ‌ర‌లో చ‌ట్టం చేస్తోంద‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. ఒక వేళ ఇక్క‌డ స్ప‌ష్ట‌త ఇవ్వ‌క‌పోయినా..పార్ల‌మెంట్‌లోనైనా అమ‌రావ‌తి విష‌యంలో స్ప‌ష్ట‌త ఇవ్వాల్సి ఉంది. 2014-19 మ‌ధ్య రాజ‌ధానిగా అమ‌రావ‌తిని అంగీక‌రిస్తున్నామ‌ని జ‌గ‌న్ అసెంబ్లీ సాక్షిగా చెప్పి మాట త‌ప్పారు. త‌మ నేత అమ‌రావ‌తిలోనే ఇళ్లు క‌ట్టుకున్నార‌ని, ఇంత క‌న్నా స్ప‌ష్ట‌త ఇచ్చేదేముంద‌ని వైకాపా నేత‌లు అప్ప‌ట్లో వాదించేవారు. అయితే..అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్ మూడు రాజ‌ధానులంటూ..అమ‌రావ‌తి రైతుల‌కు ద్రోహం చేశార‌నే ఆరోప‌ణ‌లు, విమ‌ర్శ‌లు ఉన్నాయి.

కాగా రాజ‌ధానిగా అమ‌రావ‌తేనేంటూ అధికార కూట‌మి అసెంబ్లీలో చ‌ట్టం చేయ‌డంతో..రాజ‌ధాని విష‌యంలో ఏ మాత్రం స్ప‌ష్ట‌త ఇవ్వ‌ని వైకాపా మ‌రోదారిని ఎంచుకుంది. రాజ‌ధానిలో అవినీతి జ‌రుగుతోందంటూ..చంద్ర‌బాబునాయుడు రాజ‌ధానిని దోచుకుంటున్నార‌ని విమ‌ర్శ‌లు గుప్పించింది. నిన్న వైకాపా నాయ‌కులంతా దీనిపైనే మీడియా స‌మావేశాలు ఏర్పాటు చేశారు. అంతేనా ఒక ప‌త్రిక‌లో వ‌చ్చిన ఒక కార్టూన్ విష‌యంపై తీవ్ర స్థాయిలో స్పందించారు త‌ప్ప అమ‌రావ‌తిపై స్ప‌ష్ట‌త ఇవ్వ‌లేక‌పోయారు. వైకాపా నాయ‌కుల విన్యాసాలుచూసిన రాజ‌కీయ ప‌రిశీల‌కుల‌కు వీళ్లు అమ‌రావ‌తిపై ఇంకా దోబూచులాడుతూనే ఉన్నార‌ని, వీరిలో మార్పు రాలేద‌నే భావ‌న‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ ప‌రిస్థితుల్లో ఇప్పుడు బెంగుళూరు నుంచి తాడేప‌ల్లికి వ‌చ్చిన జ‌గ‌న్ దీనిపై వివ‌ర‌ణ ఇస్తారా..?  రాజ‌ధానిపై నెల‌కొన్న గంద‌ర‌గోళానికి తెర‌దించుతారా..? అనే ప్ర‌శ్న‌లు వ‌స్తున్నాయి? 


(0)
(0)

Comments

తాజా పోల్

జ‌గ‌న్ మ‌ళ్లీ గెలుస్తార‌నే భ‌యంతోనే రాజ‌ధాని అమ‌రావ‌తిపై అసెంబ్లీలో తీర్మానం చేశారా?

VOTE PLEASE