హైదరాబాద్‌పై లక్నో సూపర్‌జైయింట్ గెలుపు
నిప్పులు చెరిగిన సమీకి మ్యాన్ ఆఫ్ దిమ్యాచ్
హైదరాబాద్, ఏప్రిల్ 05ః ఆదివారం నాడు హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో లక్నో సూపర్ జైయింట్స్, హైదరాబాద్ సన్‌రైజర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో లక్నో సునాయాస విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ 20 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 156 పరుగులు సాధించింది. అయితే ఈ లక్ష్యాన్ని లక్నో సూపర్ జైయింట్ సునాయాసంగా ఛేదించింది. లక్నో 19.5 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 157పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన లక్నోకు మార్కమ్, మార్ష్‌లు మంచి ఆరంభాన్నే ఇచ్చారు. మొదటి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 4.4 ఓవర్లలో 37 పరుగులు జోడించారు. ఒకవైపు మార్కమ్ దూకుడుగా ఆడుతుంటే మరో వైపు మార్ష్ ఆచితూచి ఆడాడు. అయితే..ఇషాన్ మలింగ్ బౌలింగ్‌లో మార్ష్ అవుటయ్యాడు. తరువాత వచ్చిన కెప్టెన్ పంత్ మార్కమ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను సాపీగా నడిపించారు. అయితే శివాంగ్ కుమార్ బౌలింగ్‌లో మార్కమ్ ఓ భారీ షాట్ ఆడబోయి లివింగ్‌స్టోన్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అతను 27 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 45 పరుగులు సాధించాడు. మార్కమ్ అవుట్ అయిన తరువాత కెప్టెప్ పంత్ ఆచితూచి ఆడాడు. ఇటీవల కాలంలో పెద్దగా ఫామ్‌లో లేని పంత్ మొదట నెమ్మదిగా ఆడినా తరువాత తనదైన శైలిలో షాట్లు ఆడాడు. అయితే ఒకవైపు పంత్ నిలబడినా మిగతా లక్నో బ్యాటర్స్ వెంట వెంటే పెవిలియన్‌కు చేరారు. అయితే పంత్ ఎటువంటి తడబాటుకు గురికాకుండా జట్టును విజయ లక్ష్యానికి చేర్చారు. మొత్తం 50 బంతులను ఎదుర్కొన్న పంత్ 9 ఫోర్ల సహాయంతో 68 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అంతకు ముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నోకు ఆ జట్టు బౌలర్లు మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లక్నో బౌలర్ మహ్మద్ సమీ హైదరాబాద్ సన్‌రైజర్స్ నడ్డి విరిచాడు. మొదటి ఓవర్ బౌలింగ్ చేసిన సమీ డేంజరస్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మను సున్నాకే అవుట్ చేసి, లక్నోను ఆనందోత్సవాల్లో ముంచెత్తాడు. తరువాత తన రెండో ఓవర్‌లో మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను కూడా సమీ ఔట్ చేశాడు. దీంతో సన్‌రైజర్స్ 8 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఇక్కడితో సన్‌రైజర్స్ కష్టాలు తీరలేదు. తరువాత వచ్చిన హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ ఒక్క పరుగుకే ప్రిన్స్‌యాదవ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్స్ 11 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. ఇషాన్ అవుట్ అయిన వెంటనే మరో బ్యాట్స్‌మెన్ లివింగ్‌స్టోన్ 14 పరుగులు చేసి రాతి బౌలింగ్‌లో పంత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో సన్‌రైజర్ కనీసం వంద పరుగులైనా చేస్తుందా..అని సందేహం అభిమానులకు వచ్చింది. అయితే..తరువాత వచ్చిన తెలుగు కుర్రాడు నితీష్‌కుమార్‌రెడ్డి మరో బ్యాట్స్‌మెన్ క్లాసెన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ఒక దారిలోకి తెచ్చారు. ఇద్దరూ సంయమనం పాటిస్తూ..మరో వికెట్ పడకుండా 116 పరుగులు జోడించారు. వీరిద్దరి భాగస్వామ్యంతో హైదరాబాద్ బాగానే కోలుకుంది. కుదురుకున్న తరువాత నితీష్‌కుమార్‌రెడ్డి పెడాపెడా సిక్స్‌లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అతనికి క్లాసెన్ కూడా సహకరించాడు. ఇద్దరూ ఫోర్లు, సిక్స్‌లతో హైదరాబాద్‌కు గౌరవప్రదమైన స్కోరును సాధించిపెట్టారు. ఈ క్రమంలోనే ఇద్దరూ అర్థసెంచరీలు చేశారు. అయితే..33 బంతుల్లో 5 సిక్స్‌లు, 3 ఫోర్లతో 55 పరుగులు చేసిన నితీష్‌కుమార్‌రెడ్డి సిధ్దార్థ బౌలింగ్‌లో అవుట్ కావడం, ఆ వెంటనే 62 పరుగులు చేసిన క్లాసెన్ అవుట్ కావడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్‌మరోమారు కుప్పకూలింది. చివరకు ఆ జట్టు 157 పరుగులకే పరిమితం అయింది. నితీష్‌కుమార్‌రెడ్డి, క్లాసెన్‌లు ఉన్నప్పుడు కనీసం 175-185 పరుగులు చేస్తుందనకున్న హైదరాబాద్ కనాకష్టంగా 150పరుగుల మార్క్‌ను దాటింది. లక్నో బౌలర్లలో సమి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతను 4 ఓవర్లలో 9 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు తీశాడు. దీంతో..అతనికే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. మిగతా లక్నో బౌలర్లలో ప్రిన్స్, ఆవేష్‌ఖాన్‌లు రెండు వికెట్లు తీయగా, రాతి, సిద్ధార్ధ చెరో వికెట్ తీశారు. మొత్తం మీద మూడు మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్‌కు ఇది రెండో ఓటమి. కాగా ఈ సీజన్‌లో లక్నోకు ఇది తొలి గెలుపు. సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తరువాత మ్యాచ్‌ను ఏప్రిల్ 11న పంజాబ్ కింగ్‌తో తలపడబోతోంది.