“మావరిక్ మెస్సయ్య” గ్రంథ స‌మీక్ష‌

19, Apr 2026

తెలుగు వారి ఆరాధ్య దైవం, మాజీ ముఖ్య‌మంత్రి స్వ‌ర్గీయ ఎన్టీరామారావు జీవితంపై సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు కందుల ర‌మేష్ రాసిన “మావరిక్ మెస్సయ్య” గ్రంథ స‌మీక్ష నిన్న గుంటూరులోని క్యాపిట‌ల్ హోట‌ల్‌లో జ‌రిగింది. 2021లో అప్ప‌టి ఉప‌రాష్ట్రప‌తి ఎం. వెంక‌య్య‌నాయుడు చేతుల మీదుగా విడుద‌లైన ఈ గ్రంధాన్ని ప్ర‌పంచంలోనే పేరున్న పెంగ్విన్ రాండ‌మ్ హౌస్ ప్ర‌చురించింది. ఆంగ్లంలో ఉన్న ఈ ప్రముఖ పుస్త‌కం గురించి సామాన్య ప్ర‌జ‌ల‌కు పెద్ద‌గా తెలియ‌దు. అయితే..ఇప్పుడు దీన్ని తెలుగువారికి, సామాన్య ప్ర‌జ‌ల‌కు తెలియ‌చేసేందుకు రేప‌టికోసం దిన‌ప‌త్రిక ఎడిట‌ర్ శాఖ‌మూరి శ్రీ‌నివాస్ ప్ర‌సాద్ ఆధ్వర్యంలో స‌మీక్ష స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు రాజ‌కీయ‌నాయ‌కులు, ఇత‌ర వ‌ర్గాల‌కు చెందిన వారు హాజ‌రై ఈ గ్రంథం గురించి త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌చేశారు. ముందుగా రాజ‌కీయ‌నాయ‌కుడు చందు సాంబ‌శివ‌రావు ఈ గ్రంథంపై త‌న అభిప్రాయాల‌ను వెల్ల‌డించారు. ఎన్టీఆర్ జీవితానికి సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఆయ‌న‌తో పాటు ప‌లువురు వ‌క్త‌లు దీనిపై త‌మ అభిప్రాయాల‌ను పంచుకున్నారు. 

చివ‌ర‌గా పుస్త‌క ర‌చ‌యిత కందుల ర‌మేష్ సుధీర్ఘంగా ప్ర‌సంగించారు. ఈ గ్రంథం ఎందుకు తేవాల్సి వ‌చ్చింది..ఈ ర‌చ‌న చేస్తున్న‌ప్పుడు, త‌రువాత ఆయ‌న‌కు ఎదురైన అనుభ‌వాల‌ను ఆస‌క్తిక‌రంగా వివ‌రించారు. అస‌లు ఈ గ్రంథాన్ని ఎందుకు ఆంగ్లంలో తేవాల్సి వ‌చ్చింద‌నే దానిపై ఆయ‌న వివ‌రిస్తూ..ఎన్టీఆర్  గురించి తెలుగువారంద‌రికి తెలుసు కానీ..ఇత‌ర రాష్ట్రాల్లోని వారికి, విదేశీయుల‌కు తెలియ‌దని, ఆయ‌న పేరు తెలుసు కానీ సంఘానికి ఆయ‌నేమీ చేశారు..ఎలా ఆయ‌న త‌న రాజకీయ‌జీవితాన్ని ప్ర‌జ‌ల‌కు అంకితం చేశార‌నేది తెలియ‌చెప్పేందుకు, త‌ద్వారా ఎన్టీఆర్ గొప్ప‌ద‌నాన్ని వారికి తెలియ‌చెప్పేందుకే ఆంగ్లంలో ర‌చించాల్సి వ‌చ్చింద‌ని కందుల ర‌మేష్ వివ‌రించారు. ఎన్టీఆర్‌ను చాలా మంది చాలా ర‌కాలుగా వ‌ర్ణించారు..ర‌క‌ర‌కాల కోణాల్లో విశ్లేషించార‌ని, త‌న దృక్ఫ‌థం వేరేని అందుకే సుధీర్ఘ‌మైన గ్రంథాన్ని రాశాన‌ని ఆయ‌న చెప్పారు. ఎన్టీఆర్ అంటే కేవ‌లం సంక్షేమ‌ప‌థ‌కాల‌కే కాద‌ని, ఆయ‌న ఎన్నోర‌కాలైన సంస్క‌ర‌ణ‌లు తెచ్చార‌ని, ఒక ప్రాంతీయ పార్టీని ఎటువంటి ప్రాంతీయ‌త‌త్వం లేకుండా ఆయ‌న న‌డిపించార‌ని, అదే విధంగా మ‌తాల‌ను, కులాల‌ను ఆయ‌న ప‌రిగ‌ణ‌లోకి తీసుకోలేద‌ని, భార‌త‌దేశ రాజ‌కీయ‌నాయ‌కుల్లో, అదీ ప్రాంతీయ రాజ‌కీయ‌పార్టీల్లో ఇటువంటి నేత‌ను అరుదుగా చూస్తామ‌ని ఈ కోణంలోనే తాను ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌ను రాశాన‌ని కందుల తెలియ‌చేశారు. 

ప్రాంతీయ‌పార్టీలంటే..ఒక ప్రాంతాన్నో, కులాన్నో, వ‌ర్గాన్నో రెచ్చ‌గొట్టి అధికారంలోకి వ‌స్తాయ‌ని, ఇటీవ‌ల కాలంలో మ‌నం వాటిని ప్ర‌త్య‌క్షంగా చూశామ‌ని ఆయ‌న వివ‌రించారు. ఎన్టీఆర్ అటువంటి వాటికి దూరంగా ఉన్నార‌ని, ఆయ‌న కాషాయం క‌ట్టినా మ‌తాల‌కు దూరంగా ఉన్నార‌ని, ఒక మ‌తంపై ప్ర‌త్యేకంగా అభిమానం కానీ, వివ‌క్ష‌ను కానీ ఆయ‌న చూప‌లేద‌ని, ఆయ‌న దేవాల‌యాల‌కు కూడా పెద్ద‌గా వెళ్లేవారు కాద‌ని, జీవితం ఆఖ‌రులో తిరుప‌తి దేవ‌స్థానానికి అప్ప‌డ‌ప్పుడు వెళ్లారే త‌ప్ప ప్ర‌త్యేకంగా తాను హిందువున‌ని చెప్పుకోల‌ద‌ని అన్నారు. అన్ని మ‌తాల్లో ఆయ‌న‌కు అభిమానులు ఉన్నార‌ని, స్వ‌ర్గీయ ఇందిరాగాంధీ చ‌నిపోయిన‌ప్పుడు ఢిల్లీలో సిక్కుల‌ను ఊచ‌కోత కోస్తున్న‌ప్పుడు ఎన్టీఆర్ వారికి అండ‌గా ఉన్నార‌ని, దేశంలో సిక్కులు ఎక్క‌డ ఉంటే అక్క‌డ వారిపై హింస జ‌రుగుతుంటే..ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వారిపై ఈగ కూడా వాల‌లేద‌ని, ఇదే విష‌యం అప్ప‌ట్లో ఢిల్లీ కేంద్రంగా వెలువ‌డే ఒక ప్ర‌ముఖ ప‌త్రిక‌లో వ‌చ్చింద‌ని ఆయ‌న తెలిపారు. ఆయ‌న ముఖ్య‌మంత్రిగా వ‌చ్చిన త‌రువాతే హైద‌ర‌బాద్‌లో మ‌త క‌ల‌హాలు త‌గ్గిపోయాయ‌ని, మ‌త‌క‌ల‌హాల‌ను ఉక్కుపాదంతో అణిచివేయాల‌ని త‌న‌కు చెప్పిన‌ట్లు మాజీ డిజీపీ దొర త‌న పుస్త‌కంలో పేర్కొన్నార‌ని ర‌మేష్ తెలిపారు. 

రాజ‌కీయాల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోని అమెరిక‌న్లు, ముఖ్యంగా ఎన్టీఆర్ గుండెకు శస్త్ర‌చికిత్స చేసిన డాక్ట‌ర్ కూలీ ఎన్టీఆర్‌ను అభినందిస్తూ లేఖ రాయ‌డం విశేమ‌ని కందుల పేర్కొన్నారు. 1995లో ఎన్టీఆర్ ప‌ద‌వీచ్యుతుడైన త‌రువాత రోజు ఆయ‌న‌ను క‌ల‌వ‌డానికి తాను వెళితే..ఆయ‌న ఎటువంటి బాధ లేకుండా ఉన్నార‌ని, కొంత మంది మీకు ఇలా జ‌ర‌గ‌డం విచార‌క‌ర‌మ‌ని, ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో మిమ్మ‌ల‌ను త‌ప్ప వేరే వారిని ఊహించుకోలేక‌పోతున్నామ‌ని అన్న‌ప్పుడు ఆయ‌న మంద‌హాసం చేస్తూ..ముఖ్య‌మంత్రి ప‌ద‌వికే తాను అలంకార‌మ‌ని అన్నార‌ని అటువంటి అరుదైన వ్య‌క్తిత్వం ఆయ‌న‌దంటూ..కందుల త‌న ప్ర‌సంగాన్ని ముగించారు. సుధీర్ఘంగా సాగిన కందుల ప్ర‌సంగంలో ఎన్టీఆర్ గురించి ఎవ‌రికీ తెలియ‌ని ఎన్నో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇప్ప‌టి వ‌ర‌కూ ఈ గ్రంథాన్ని..తెలుగులోకి ఎవ‌రూ అనువ‌దించ‌లేద‌ని, అయితే..తానే ఆ ప‌నిచేస్తాన‌ని, మ‌రికొన్ని మెరుగులు దిద్ది దీన్ని విడుద‌ల చేస్తాన‌ని ఆయ‌న అన్నారు. ఈ గ్రంథం గురించి ఎక్క‌డా ప్ర‌చారం చేసుకోలేద‌ని, త‌న‌కు ఆస‌క్తిలేక‌పోవ‌డం ఒక‌టి..రెండోది..అప్ప‌ట్లో ఉన్న క‌రోనా కూడా మ‌రో కార‌ణ‌మ‌న్నారు. మొత్తం మీద ఈ గ్రంథ స‌మీక్ష సుధీర్ఘంగా జ‌రిగినా ఆహ్వానితులు చివ‌రి వ‌ర‌కూ ఉండ‌డం ఆస‌క్తిని రేకెత్తించింది. 


(2)
(0)

Comments