కోల్‌కతా తొలి గెలుపు: రింకూ సింగ్ అద్భుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌పై థ్రిల్లింగ్ విజయం
టాటా ఐపిఎల్‌లో కోలకతా నైట్‌రైడర్స్ తొలి గెలుపు అందుకుంది. ఈ ఐపిఎల్‌లో ఇప్పటి వరకూ 7 మ్యాచ్‌లు ఆడి ఒక్క గెలుపు కూడా సాధించలేని కోల్‌కతా నైట్ రైడర్స్ ఈ రోజు రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ 20 ఓవర్లకు 9 వికెట్లకు 155 పరుగులు సాధించగా కోల్‌కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. 156 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన కోల్‌కత్తాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది.ఆ జట్టు ఓపెనర్ టిమ్ సిఫెరెట్‌ను మొదట బంతికే అర్చర్ బౌల్డ్ చేశాడు. దీని తరువాత కోల్‌కతాకు మరో షాక్ తగిలింది. రెండో ఓవర్ బౌలింగ్ చేసిన బర్గర్ కోల్‌కతా కెప్టెన్ రహానేను సున్నాకే అవుట్ చేశాడు. దీంతో కోలకతా 5 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. వికెట్లు పడినా కెమెరూన్ గ్రీన్ దూకుడుగా ఆడాడు. అతను 13 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 27 పరుగులు చేసి కోల్‌కతాను గాడిలో పెట్టడానికి యత్నించాడు. అయితే దూకుడుగా ఆడుతోన్న గ్రీన్‌ను బిష్ణోయి ఎల్‌బిడబ్ల్యుగా వెనక్కు పంపాడు. ఆ వెంటనే రఘువంశీని, పావెల్‌ను జడేజా అవుట్ చేయడంతో కోల్‌కతా 85 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి తీవ్ర ఇబ్బందుల్లో పడింది. అయితే..రింకూసింగ్ తనదైన శైలిలో ఆడడంతో కోల్‌కతా కొంచెం కోలుకుంది. అతను రమణ్‌దీప్‌సింగ్, అంకూల్ రాయ్‌తో మంచి భాగస్వామ్యాలు ఏర్పాటు చేయడంతో కోల్‌కతా లక్ష్యానికి చేరువుగా వచ్చింది. ఈ దశలో యాశ్‌రాజ్ రమణ్‌దీప్‌సింగ్‌ను అవుట్ చేయడం..చివరి రెండు ఓవర్లకు 21 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే 19 ఓవర్ వేసిన అర్చర్ బౌలింగ్‌లో రింకూసింగ్ మూడో బంతికి సిక్స్ బాదడంలో కోల్‌కతా లక్ష్యంవైపు వేగంగా పయనించింది. ఈ ఓవర్‌లో 12 పరుగులు రావడంతో లక్ష్యం చివరి 6 బంతులకు 9 పరుగులుగా మారిపోయింది. 20ఓవర్ వేసిన బ్రిజేష్ శర్మ మొదటి బంతికో ఫోర్, రెండో బంతికో ఫోర్ ఇవ్వడంతో కోల్‌కతా తొలిగెలుపు ఖాయమైంది. బ్రిజేష్ వేసిన నాలుగో బంతికి రింకూసింగ్ సిక్స్ బాదడంతో కోల్‌కతా నాలుగు వికెట్లతో విజయం సాధించింది. దీంతో రింకూసింగ్ అర్థ సెంచరీ కూడా పూర్తి అయింది. అతను 34 బంతుల్లో 5ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. రాజస్థాన్ బౌలర్లలో జడేజా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మూడు ఓవర్లు బౌలింగ్ చేసిన అతను 8పరుగులు ఇచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. బిష్టోయి, అర్చర్, బ్రిజేష్, బర్గర్‌లకు తలో వికెట్ దక్కింది.
అంతకు ముందు మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ బ్యాటింగ్‌ను ఎంచుకుంది. రాజస్థాన్ ఓపెనర్స్ జైశ్వాల్, వైభవ్ వంశీ ఆ జట్టుకు శుభారంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరూ కలిసి 8.4 ఓవర్లలో 81 పరుగులు జోడించారు. వీళ్ల ఊపు చూస్తే రాజస్థాన్ భారీ స్కోరు సాధిస్తుందని అనిపించింది. వైభవ్ సూర్యవంశీ ఉన్నంత సేపు రాజస్థాన్ స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. అతను కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌలర్లును ఉతికారేశాడు. ఎడాపెడా ఫోర్లు, సిక్స్‌లు కొడుతూ స్కోర్‌ను రాకెట్ వేగంతో పరుగులు తీయించాడు. అతను 28 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 46 పరుగులు సాధించాడు. అర్థసెంచరీ దిశగా వెళుతోన్న వైభవ్ సూర్య వంశీని వరుణ్‌చక్రవర్తి అవుట్ చేయడంతో రాజస్థాన్ దూకుడుకు బ్రేక్‌లు పడ్డాయి. వైభవ్ అవుట్ అయిన వెంటనే రాజస్థాన్ కెప్టెన్ ద్రువ్ జురేల్‌ను వరుణ్ తన తరువాత ఓవర్‌లో అవుట్ చేయడం..ఆ వెంటనే సునీల్ నరేన్‌ను అవుట్ చేయడంతో రాజస్థాన్ 99 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఒక్కసారిగా రాజస్థాన్ దూకుడు తగ్గడంతో పాటు పరుగులు రాక నెమ్మదించింది. ముఖ్యంగా కోల్‌కతా స్పిన్నర్‌లు వరుణ్‌చక్రవర్తి, నరేన్‌ను ఆడడం రాజస్థాన్ వల్ల కాలేదు. వీరిద్దరూ రాజస్థాన్ బ్యాట్స్‌మెన్‌కు చుక్కలు చూపించారు. వీరికి మరో బౌలర్ కార్తీక్ త్యాగి సహకరించడంతో రాజస్థాన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. వరుణ్‌చక్రవర్తి అద్భుతమైన బంతులతో రాజస్థాన్‌కు కళ్లెం వేశాడు. అతను మొత్తం నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 14 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. మరోవైపు కార్తిక్‌త్యాగి కూడా 4 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీయగా, సునీల్ నరేన్ 4 ఓవర్లకు 26 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా ఈ మ్యాచ్‌లో గెలుపు ద్వారా కోల్‌కతా పాయింట్ల పట్టికలో అడుగు నుంచి రెండోస్థానానికి రాగా, రాజస్థాన్ ఆరు మ్యాచ్‌ల్లో 4 గెలిచి, రెండు ఓడిపోవడంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన వరుణ్‌చక్రవర్తికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.