ఆటో డ్రైవర్లకు రూ.436కోట్లు
కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇవ్వకున్నా..తాము ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకం వల్ల ఆటో డ్రైవర్లకు నష్టం కలుగుతుందన్న భావనతో వారిని ఆదుకునేందుకు నూతన పథకానికి శ్రీకారం చుడుతోంది. ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ.15వేలను ఇవ్వబోతోంది. రేపు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందబోతోంది. ఈ పథకం కింద దాదాపు రూ.436కోట్లు ఖర్చు చేయబోతున్నారు. సొంత ఆటో, క్యాబ్ కలిగి వాటిపై ఆధారపడి జీవిస్తోన్న వారి కోసం ప్రభుత్వం ఈ పథకాన్నితెచ్చింది. 2.90లక్షల మంది అర్హులున్నారని, వారికి ఈ పథకాన్ని వర్తింపచేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. గతంలో వైకాపా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ ఆటో డ్రైవర్లకు రూ.10వేలను సహాయం చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం రూ.15వేలను ఇవ్వనుంది. ఇది దాదాపు 50శాతం అధికం. జగన్ ప్రభుత్వం ఈ పథకం కింద కేవలం రూ.261కోట్లు ఖర్చు చేయగా కూటమి ప్రభుత్వం మాత్రం రూ.436కోట్లు ఖర్చు చేస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలను వరుసగా అమలు చేసుకుంటూ వస్తోంది. ముందుగా సామాజిక ఫించన్లను ఒకేసారి రూ.4వేలు చేసింది. గత వైకాపా ప్రభుత్వం వెయ్యి రూపాయిలు పెంచడానికి ఐదేళ్లు సమయం తీసుకోగా కూటమి ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన వెంటనే వెయ్యి పెంచింది. అంతే కాకుండా గతంలో తాము హామీ ఇచ్చిన తేదీ నుంచి అంటే మూడు నెలలు బకాయిలు కలిపి ఒకేసారి రూ.7వేలు ఇచ్చేసింది. అదే విధంగా తల్లికి వందనం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి రూ.15వేలు మంజూరు చేసింది. గతంతో జగన్ ప్రభుత్వం కుటుంబంలో ఒకరికి మాత్రమే అమ్మఒడి కింద రూ.15వేలు ఇచ్చింది. కూటమి ప్రభుత్వం మాత్రం కుటుంబంలో ఎంత మంది చదువుకునే విద్యార్ధులు ఉంటే..అంత మందికి ఇచ్చేసింది. ఒక్కో కుటుంబంలో ఐదు లేక ఆరుగురు ఉన్నా వారందరికీ రూ.15వేల చొప్పున పంపిణీ చేసింది. ఇక మహిళల కోసం మూడు ఫ్రీగ్యాస్ సిలిండర్లు మంజూరు చేసింది. అదే విధంగా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ఎంపిక చేసిన బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇక రైతుల కోసం అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకూ ఏడాదికి రూ.20వేలు ఇస్తోంది. ఇప్పటికే తొలివిడతా రూ.7వేలను మంజూరు చేసింది. మత్స్యకారుల కోసం వేట నిషేద సయమంలో వారి భృతి కోసం రూ.20వేలు చెల్లించింది. ఇలా సమాజంలోని ప్రతి ఒక్క వర్గానికి వివిధ పథకాల ద్వారా సహాయం చేస్తోంది. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారం తాము ఇచ్చిన అన్ని హామీలను ఒకదాని తరువాత ఒకటీ నెరవేర్చుకుంటూ వస్తోంది.