ప్రవీణ్ ప్రకాశ్ ఏమి చెబుతాడో...?
ఆయన ఒకప్పుడు రాష్ట్ర అధికారయంత్రాంగానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు చుక్కలు చూపించారు. ఆయన అనుకుంటే..చాలు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉన్న వ్యక్తి అయినా..నిమిషాల్లో బదిలీ అయిపోతారు. రాష్ట్ర అధికార వ్యవస్థను మొత్తాన్ని తన ముంచేతితో నడిపించి శాసించిన వ్యక్తి. ఒక ముఖ్యమంత్రికి ఉన్న అధికారాలన్నింటినీ అనుభవించిన వ్యక్తి. అయితే..ఆయనేమీ ప్రజల చేత తమను పాలించమని ఎన్నుకున్న నేతేమీ కాదు. కానీ..ఒక సిఎం కంటే ఎక్కువ అధికారాలను అనుభవించారు..శాసించారు..పాలించారు.. ఇలా అధికారాలను శాసించిన వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి. అయితే..రోజులన్నీ..ఒకే రకంగా ఉండవు కదా...? ఆయనను నమ్మి అధికారం మొత్తాన్ని ఆయన చేతిలోపెట్టిన రాజకీయనాయకుడి పార్టీ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతిని చరిత్రలో చూడని పరాజయాన్ని చూసింది. దీంతో..సదరు అధికారాలన్నీ చలాయించిన వ్యక్తి..ఒక్క దెబ్బతో మూలపడ్డారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే..దుకాణం సర్దేసి, తనకు విఆర్ఎస్ ఇవ్వాలని కోరుకున్నారు. నూతన ప్రభుత్వం..మానవత్వవిలువలంటూ..సదరు అధికారిపై ఎటువంటి దర్యాప్తు లేకుండా ఇంటికి పంపించింది. అపరమిత అధికారాలు, అవినీతి, అరాచకాలు చేసిన వ్యక్తిపై విచారణ లేకుండా, ఆయన చేసిన పాపాలను బైటపెట్టకుండా నిశ్బద్దంగా ఆయనను పంపించడం విచిత్రమే. ఇక్కడ ఏ ఒత్తిడిలు పనిచేశాయో..లేక ఆ వ్యక్తి చేసిన చర్యల వల్ల తమకు మేలు జరిగిందని భావించారో...కానీ..సదరు ఐఏఎస్ అధికారిపై ఈగ కూడా వాలకుండా..ఇంటికి పంపించేసింది..చంద్రబాబు ప్రభుత్వం. ఇలా ఇంటికి వెళ్లిన ఐఏఎస్ అధికారి ఎవరో కాదు..ఆయనే ప్రవీణ్ ప్రకాశ్. గత జగన్ ప్రభుత్వంలో సర్వాంత్రయామి అయిన ప్రవీణ్ ప్రకాశ్ విఆర్ఎస్ తీసుకున్న ఏడాది తరువాత ఏబీఎన్ రాధాకృష్ణ ఓపెన్‌హార్ట్ విత్ ఆర్‌కె పోగ్రామ్‌లో పాల్గొనబోతున్నారు. ఈ షో ఆదివారం సాయంత్రం ప్రసారం కానుంది. దీనికి సంబందించి ప్రోమోలు ఇప్పటికే సోషల్‌మీడియాలో విడుదలయ్యాయి. దీనిపై అటు రాజకీయ ఇటు అధికార వర్గాల్లో ఆసక్తి నెలకొంది.
వైకాపాలో టెన్షన్...!
జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ప్రవీణ్ ప్రకాష్ ఇప్పుడు జగన్ ప్రభుత్వ పాలనపై, అక్కడి వ్యవహారాలపై ఏమి చెబుతారో..అన్నదానిపై వైకాపాలో టెన్షన్ నెలకొంది. జగన్‌కు అత్యంత ఆప్తుడిగా ఉన్న ప్రవీణ్ అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎల్.వి.సుబ్రహ్మణ్యంను బదిలీ చేసేశారు. సిఎంఓ కార్యదర్శిగా ఉన్న ప్రవీణ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఇదొక్కటేనా..విద్యా వ్యవస్థలో తెచ్చిన మార్పులు, జగన్ వ్యవహారశైలి, ఇలా పలు అంశాలకు ప్రవీణ్ ప్రకాష్ ప్రత్యక్ష సాక్షి. నాడు అంతా తానై జగన్‌ను నడిపించిన ప్రవీణ్ ఇప్పుడు ఆయన వ్యతిరేక మీడియాలో ఇంటర్వ్యూ ఇవ్వడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఆయన ఏమి చెబుతాడో..జగన్ అవినీతి గురించి, ఆయన మందిమాగాధులు చేసిన అక్రమాలు, అరాచకాలపై ప్రవీణ్ చేసే వ్యాఖ్యలు కీలకంగా మారనున్నాయి. వాస్తవానికి ఒకప్పుడు ప్రవీణ్ ప్రకాష్‌కు మంచి అధికారిగా పేరుంది. అయితే..ఎప్పుడైతే జగన్ ముఖ్యమంత్రి అయ్యాడో..అప్పటి నుంచి ప్రవీణ్ తీరులోమార్పు వచ్చిందనే ప్రచారం ఉంది. జగన్‌ను ఆయన చెడగొట్టారా..? లేక జగనే ప్రవీణ్‌ను చెడగొట్టారో..తెలియదు. మొత్తం మీద..ఆదివారం ప్రవీణ్ ఇంటర్య్వూ ప్రేక్షకులతో పాటు, అధికార వర్గాల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు.