రూ.100కోట్లు దోచేసిన గుర్రం దేవేందర్‌రెడ్డి...!?
వైకాపా ఐదేళ్ల పాలనలో ఆ పార్టీ నేతలు అడ్డగోలుగా దోచుకున్నారు. ఒకవైపు ప్రభుత్వ పెద్ద అన్నిశాఖలను దోచేస్తే...ఆయన అనుచరగణం..దొరికిన చోట దొరికినట్లు దోచేశారు. అధినేత లక్ష కోట్లు దోచేస్తే..ఆయన అనుచరులు వీలైనచోట్ల వీలైన రీతిలో ఇష్టారాజ్యంగా దోపిడీకి పాల్పడ్డారు. వైకాపాలో చోటా మోటా పదవులు నిర్వహించిన వారు కూడా వందలకోట్లు దోచుకున్నారంటే..అవినీతి ఏ రకంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కూటమి నేతలు అధికారంలోకి రాకముందు తాము అధికారంలోకి వచ్చిన తరువాత వారి వైకాపా అవినీతిని బట్టబయలు చేస్తామని, వారందరినీ జైలుకు పంపిస్తామని ఒకటే హోరెత్తించారు. అయితే..అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయినా..కొన్నిశాఖల్లోని అవినీతిపరులపై ఇంత వరకూ చర్యలు తీసుకోలేదు. తాజాగా డిజిటల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతి గురించి వైకాపా సోషల్ మీడియాలో పనిచేసిన వర్రా రవీంద్రరెడ్డి అనే కార్యకర్త సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే గుర్రం దేవేందర్‌రెడ్డి అనే కార్యకర్తను జగన్ డిజిటల్ మీడియా డైరెక్టర్‌గా నియమించారు. దీంతో..గుర్రం దేవేందర్‌రెడ్డి, అప్పటి సమాచారశాఖ కమీషనర్ విజయ్‌కుమార్‌రెడ్డిలు కలసి అడ్డగోలుగా డిజిటల్ మీడియాలో దోపిడీకి పాల్పడ్డారు. ముఖ్యంగా డిజిటల్ మీడియాలో ఉద్యోగాల భర్తీ, సోషల్ మీడియా కంటెంట్ రూపకల్పనలో భారీగా అవినీతి జరిగిందని విజిలెన్స్ దర్యాప్తులో తేలింది. అదే సమయంలో ఇప్పుడు వర్రారవీంద్రరెడ్డి గుర్రం దేవేందర్‌రెడ్డి అవినీతి వ్యవహారాలను బయటపెడుతున్నారు. అప్పట్లో డిజిటల్ కార్పొరేషన్‌లో కొంత మంది వ్యక్తులను ప్రభుత్వం నియమించింది. అయితే..వాస్తవానికి వారెవరూ పనిచేయలేదని తేలింది. వారికి ఒక్కొక్కరికి రూ.75,000/- నుంచి రూ.35000/- వరకూ జీతాలు చెల్లించారు. అయితే వీరందరూ గుర్రందేవేందర్‌రెడ్డి బినామీలేనని, వారి ఎకౌంట్‌లో జీతాలు వేయించడం తరువాత ఆ సొమ్ములను అతను వసూలు చేసుకున్నాడని ఈ విధంగా నెలకు రూ.2కోట్ల దాకా దోపిడీ చేశారని వర్రా రవీంద్రరెడ్డి ఆరోపిస్తున్నారు. నెలకు రూ.2కోట్లు అంటే సంవత్సరానికి రూ.24 కోట్లు...ఐదేళ్ల జగన్ పాలనలో ఇది దాదాపు రూ.120కోట్లు ఉంటుంది.
ఈ సొమ్మంతా కేవలం గుర్రం దేవేందర్‌రెడ్డే మింగేశాడా..? లేక దీనిలో వాటాలు ఎవరెవరికి ఇచ్చారనేది ఇంకా తేలలేదు. అప్పట్లో సమాచారశాఖ కమీషనర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్‌రెడ్డి, ఆయనకు అత్యంత సన్నిహితులైన కొందరు అధికారులకూ దీనిలో వాటా ఉందనే ప్రచారం ఉంది. అప్పట్లో సమాచారశాఖలోనూ.. కొందరిని నియమించి...వారిపేరుతో జీతాలు డ్రా చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా డ్రా చేసిన జీతాలను కమీషనర్‌తో పాటు మరి కొందరు అధికారులు పంచుకున్నారని తెలుస్తోంది. అయితే సమాచారశాఖ అవినీతిపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తున్నా ఇది మందకొడిగానే సాగుతోంది. ఏడాదిన్నర నుంచి విచారణ చేస్తున్నా..దీనిపై ఇంత వరకూ ఏమీ తేల్చలేదు. ఈలోపు అవినీతి ఆరోపణలు ఉన్న అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చుకుంటూ పోతున్నారు. ఇదే రీతిలో డిజిటల్ కార్పొరేషన్‌లోనూ జరుగుతోంది. డిజిటల్ కార్పొరేషన్‌లో జరిగిన అవినీతిపై మొన్న శాసనసభలో చర్చ కూడా జరిగింది. కొందరు సభ్యులు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరినా మంత్రి నామమాత్రంగా సమాధానం ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి వారిపై చర్యలు తీసుకునే ఉద్దేశ్యం ఉన్నట్లు కనిపించడం లేదు. మొత్తం మీద..ఒక డైరెక్టరే వందకోట్లు దోచేస్తే..ఇక మిగతా వారు ఎంత దోచారో..ఊహలకే అందడం లేదు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఎందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకోవడం లేదో..తెలియడం లేదు. ఏది ఏమైనా..చంద్రబాబు, ఆయన కుమారుడు అవినీతిపరులపై తీసుకుంటామన్న చర్యలు నీటిమీద రాతల్లానే ఉంటున్నాయనే భావన టిడిపి నాయకుల్లో, కార్యకర్తల్లో వ్యక్తం అవుతోంది.